మరియమ్మ లాకప్ డెత్ కేసు.. ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు డిస్మిస్

By Ritwika Ram Jul. 21, 2021, 09:00 pm IST
మరియమ్మ లాకప్ డెత్ కేసు.. ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లు డిస్మిస్

రక్షక భటులు.. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లది. పోలీసులు ఉన్నదే అందుకు. కానీ ప్రజల విషయంలోనే కొందరు పోలీసులు తమ ప్రతాపం మొత్తం చూపిస్తుంటారు. విచక్షణారహితంగా చావబాదిన సందర్భాలెన్నో.. లాకప్ డత్ లు తక్కువేం కాదు. ఇలాంటి అమానుష ఘటనే మరియమ్మ లాకప్ డెత్. తెలంగాణలో సంచలనం రేపిన ఈ కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ వి.మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను సర్వీసు నుంచి తొలగించింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ముగ్గురికే కాదు.. ఇష్టారాజ్యంగా పని చేసే మరికొంతమంది పోలీసులకు కూడా గుణపాఠం లాంటిది.

మొన్న సస్పెన్షన్.. ఇప్పుడు తొలగింపు..

మరియమ్మ లాకప్ డెత్ కేసు బయటికి రాగానే నిందితులు ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యలను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత.. వాళ్లు తప్పు చేసినట్లు తేల్చి సర్వీసు నుంచే తొలగిస్తూ రాచకొండ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. ఆర్టికల్ 311(2)(b), 25(2) ప్రకారం విధులను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల నుంచి సస్పెండ్ చేసినా.. వారిపై నమోదైన కేసులపై విచారణ కొనసాగుతుంది. అక్కడ కూడా దోషులుగా తేలితే శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read : మ‌రియ‌మ్మ‌కు బ‌తికే హ‌క్కు లేదా?

దొంగతనం మోపి.. మహిళ అని చూడకుండా..

ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్లగూడేనికి చెందిన మరియమ్మ.. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని చర్చి ఆవరణలో ఫాదర్ ఇంట్లో వంట మనిషిగా పని చేసేది. ఇంట్లో డబ్బు కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫాదర్ ఫిర్యాదు చేశారు. దీంతో మరియమ్మ, ఆమె కొడుకు ఉదయ్, ఉదయ్ స్నేహితుడు శంకర్ ను అరెస్టు చేశారు. మరియమ్మను ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో ఆమె చనిపోయింది. ఉదయ్ ని కూడా చావబాదారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు ఉదయ్ వెనుకభాగమంతా గాయాలతో నల్లగా కందిపోయింది. ఈ ఘటన మెల్లగా రాష్ట్రమంతటా పాకింది. ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. స్పందించిన కేసీఆర్.. ప్రతిపక్ష కాంగ్రెస్ లీడర్లను ప్రగతిభవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. మరియమ్మ కుటుంబానికి సాయం చేయాలని మంత్రులను ఆదేశించారు. ఘటనకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు పోలీసులను తొలగించారు.

ఇకనైనా మారుతారా?

పోలీసులు అందరూ ఇలానే అని కాదు కానీ.. చాలా చోట్ల కొందరు పోలీసులు నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతుంటారు. కొన్ని సార్లు నాయకుల అజెండా ప్రకారమే నడుచుకుంటారు. ఇవి వివాదాస్పదమవుతున్నాయి. ఇక తెలంగాణలో అయితే ఈ ఆరోపణలు కొన్నాళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన తర్వాతైనా పోలీసుల తీరు మారాలని జనం కోరుకుంటున్నారు. ఆ ముగ్గురుని చూసి మిగతా వారు గుణపాఠం నేర్చుకోవాలని అంటున్నారు. చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలి కానీ.. మహిళలని కూడా చూడకుండా కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరియమ్మ చనిపోయిందంటే.. పోలీసులు ఎంతలా కొట్టి ఉంటారో ఊహించుకోవాలని అంటున్నారు.

Also Read : భారత రత్న గురించి బాలకృష్ణ తీవ్ర అవమానకర వ్యాఖ్యలు ....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp