Manmohan Singh-AIIMS-ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్.. జ్వరమే అంటున్న కాంగ్రెస్.. కానీ?

By Balu Chaganti Oct. 14, 2021, 11:15 am IST
Manmohan Singh-AIIMS-ఎయిమ్స్ లో చేరిన మన్మోహన్.. జ్వరమే అంటున్న కాంగ్రెస్.. కానీ?


మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం, మన్మోహన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలో వైద్యుల బృందం మాజీ ప్రధాని మన్మోహన్ కు ఎయిమ్స్ కార్డియో టవర్‌లో చికిత్స అందిస్తోంది. రెండు రోజుల క్రితం మన్మోహన్ కి జ్వరం వచ్చిందని, జ్వరం తగ్గిన తర్వాత కూడా బలహీనంగా ఉండడంతో వైద్యుని సలహా మేరకు ఎయిమ్స్ కు తరలించారని తెలుస్తోంది. "89 ఏళ్ల మన్మోహన్ జ్వరం పరీక్షల కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

రెండు రోజుల క్రితం ఆయనకు జ్వరం వచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. జ్వరం తగ్గిన తర్వాత కూడా అతను బలహీనంగా ఉన్న కారణంగా వైద్యుల సలహా మేరకె మాజీ ప్రధాని ఎయిమ్స్‌లో చేరారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని కాంగ్రెస్ చెబుతోంది. అయితే మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించిందనే వార్త బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఢిల్లీ ఎయిమ్స్‌కి చేరుకుని మన్మోహన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఏమో జ్వరమే అంటుంటే, కేంద్ర ఆరోగ్య మంత్రి హాస్పిటల్ కి వెళ్లడం మీద భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. నిజానికి మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజులు ఎయిమ్స్‌లో చికిత్స పొందిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యాడు.

అప్పటికే ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నారు కూడా. మార్చి 4, ఏప్రిల్ 3న రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక అంతకు ముందు 2009లో మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో విజయవంతంగా కరోనరీ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే మొదటిసారిగా 1971 లో భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తరువాత అతను 1991 నుంచి 1996 వరకు భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2004లో దేశానికి 14 వ ప్రధాన మంత్రి అయ్యారు, ఆయన పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp