సీట్ మారి సవాల్ నిలబెట్టుకున్న మమత

By Kalyan.S Mar. 06, 2021, 11:30 am IST
సీట్ మారి సవాల్ నిలబెట్టుకున్న మమత

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీ నుంచి వచ్చే పోటీని తట్టుకునేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేకంగా రాజకీయ వ్యూహకర్తను నియమించుకుని మరీ యుద్ధానికి సిద్ధమయ్యారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరించిట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బెంగాల్‌ అసెంబ్లీలో 294 సీట్లు ఉండగా, 291 మందితో జాబితా ప్రకటించారు. మూడు స్థానాలను మిత్రపక్షానికి కేటాయించారు. ఈసారి ఎన్నికల్లో మహిళలు, యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మమత నూతనత్వం ప్రదర్శించారు.

బీజేపీ నేతలను అరెస్ట్‌ చేసిన అధికారికి సీటు
మమత ప్రకటించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలో 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన వారెవరికీ ఈసారి టికెట్‌ ఇవ్వకపోవడం విశేషం. జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖుల్లో మాజీ ఐపీఎస్‌ అధికారి హుమాయున్‌ కబీర్‌ కూడా ఉన్నారు. ఇటీవలే చందానగర్‌ ర్యాలీలో ‘గోలీ మారో’ (దేశద్రోహులను కాల్చి చంపండి) అని నినాదాలు చేసినందుకు ముగ్గురు బీజేపీ నేతలను కబీర్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే నటులు సయోనీ ఘోష్‌, జునే మలయ్య, క్రికెటర్‌ మనోజ్‌ తివారీ కూడా జాబితాలో స్థానం దక్కించుకున్నారు. తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన అనంతరం మమత మాట్లాడారు.

నందిగ్రామ్‌ నుంచి మమత
ఈసారి తాను నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మమత ప్రకటించారు. కోల్‌కతాలోని భవానీపూర్‌ స్థానాన్ని ఖాళీ చేస్తానని తెలిపారు. ఇటీవలే టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరిన సువేందు అధికారి.. దమ్ముంటే నందిగ్రామ్‌ నుంచి పోటీ చేయాలని ఆమెకు సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. ‘‘నేను నా మాటకు కట్టుబడి నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తాను. ఇప్పటిదాకా నేను పోటీచేస్తూ వచ్చిన భవానీపూర్‌ నుంచి శోభన్‌దేవ్‌ చటోపాధ్యాయ నిలబడతారు’’ అని మమత స్పష్టం చేశారు. నందిగ్రామ్‌ తనకు అచ్చొచ్చిన స్థానమని తెలిపారు. భవానీపూర్‌ను తాను ఎందుకు వీడాల్సి వచ్చిందో ఆ నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ‘‘నందిగ్రామ్‌ నాకు అక్క అయితే, భవానీపూర్‌ చెల్లెలు. సాధ్యమైతే రెండు చోట్ల నుంచీ పోటీ చేస్తాను’’ అని మమత వ్యాఖ్యానించారు.

దేవాంగ్షుకు దక్కని టికెట్‌
‘ఖేలో హోబ్‌’ (ఆడదాం) పాటను రూపొందించి ప్రజాదరణ పొందిన టీఎంసీ యువ సంచలనం, ఆ పార్టీ ప్రతినిధి దేవాంగ్షు భట్టాచార్యకు టికెట్‌ దక్కలేదు. సీఎం మమత ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు. హౌరా నుంచి ఆయనను నిలబెడతారని ఇప్పటిదాకా జరిగిన ప్రచారానికి తెరపడింది. ప్రత్యర్థులను సవాలు చేస్తూ ఆయన రూపొందించిన ‘ఖేలో హోబ్‌’ పాట బాగా ప్రజాదరణ పొందింది.
బెంగాల్‌లో ఈసారి బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురవ్వడంతో మమత ఇప్పటికే అప్రమత్తమయ్యారు. దీనికి తోడు పలువురు కీలక నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరడంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి కసరత్తు చేసినట్టు సమాచారం. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్‌ 29న ఎనిమిదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp