ముచ్చ‌ట‌గా మూడో సారి : ప్ర‌మాణ స్వీకారానికి వేళాయే..!

By Kalyan.S May. 05, 2021, 09:00 am IST
ముచ్చ‌ట‌గా మూడో సారి : ప్ర‌మాణ స్వీకారానికి వేళాయే..!

ఎన్నిక‌ల సంగ్రామం అనంత‌రం బెంగాల్ బెబ్బులిగా గుర్తింపు పొందిన‌ మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. 292 నియోజక వర్గాలకు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా 213 సీట్లను సాధించి టీఎంసీ విజ‌య‌దుందుభి మోగించింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మ‌మ‌తా బెన‌ర్జీ నేడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు విజ‌యం సాధించి హ్యాట్రిక్ సాధించి చ‌రిత్ర సృష్టించిన దీదీ ప్ర‌మాణ స్వీకారం క‌రోనా నేప‌థ్యంలో నేడు సాదాసీదాగా జ‌ర‌గ‌నుంది. తొలుత క‌రోనాను ఓడించిన త‌ర్వాతే సంబ‌రాలు జ‌రుపుకుంటామ‌ని మ‌మ‌త ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

ఎమ్మెల్యే ప్ర‌మాణ స్వీకారం రేపు

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ కార్యక్రమం తక్కువ మంది ఆహూతులతో జరుగుతుందని టీఎంసీ తెలిపింది. పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమెను సీఎంగా, బిమన్‌ బెనర్జీని ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఎన్నుకున్నారని టీఎంసీ సెక్రటరీ జనరల్‌ పార్థ చటర్జీ తెలిపారు. మిగతా ఎమ్మెల్యేలంతా మే 6న ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే మమతాబెనర్జీ సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ను కలిసి సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను అంగీకరించానని.. తదుపరి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపేట్టే దాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరానని ధన్‌కర్‌ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.

శాంతంగా ఉండాలి..

ఇదిలా ఉండ‌గా, ప్ర‌మాణ స్వీకారం నేప‌థ్యంలో హింస చెల‌రేగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. బెంగాల్‌లో ఎన్నికలు, ఫలితాల ఘట్టం ముగిశాక రాష్ట్రవ్యాప్తంగా హింస చెలరేగింది. సోమవారంనాటి ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు చనిపోయినట్టు, చాలామంది గాయపడినట్టు సమాచారం. పలు దుకాణాలు లూటీ అయినట్టు తెలుస్తోంది. నందిగ్రామ్‌లో బీజేపీ కార్యాలయం తగలబడిపోతుండగా చాలా మంది అక్కణ్నుంచి భయంతో పారిపోతున్న వీడియోను ఆ పార్టీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. అలాగే.. చనిపోయినవారి ఫొటోలను, ఒక దుకాణంలో లూటీ జరుగుతున్న వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. టీఎంసీ దాడుల్లో తమ కార్యకర్తలు, మద్దతుదారులు కనీసం ఆరుగురు చనిపోయారని.. వారిలో ఒకరు మహిళ అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే.. పూర్వ వర్ధమాన్‌ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడిలో టీఎంసీకి చెందిన ముగ్గురు మరణించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మమత తన కార్యకర్తలు, మద్దతుదారులు అందరూ శాంతిని పాటించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా రెచ్చిపోవద్దని, వారి వలలో పడొద్దని, శాంతంగా ఉండాలని సూచించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp