మహిళా ఎస్సై వేధింపులు - యువకుడు ఆత్మహత్య

By Kotireddy Palukuri 19-11-2019 07:48 AM
మహిళా ఎస్సై వేధింపులు - యువకుడు ఆత్మహత్య

''ఎస్సై నారాయణమ్మ నన్ను మానసికంగా వేధిస్తోంది. నా చావుకు ఆమె కారణం'' అని తన స్నేహితులకు సందేశాలు పంపి కృష్ణా జిల్లాలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరంలోని సొసైటీపేటలో నివసించే చిట్టూరి మురళి (21) తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి టీస్టాల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విజయవాడలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మురళి ఆదివారం సాయంత్రం స్కూటీపై రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా పాత స్టేట్‌బ్యాంక్‌ ఎదుట భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న గన్నవరం మహిళా ఎస్‌ఐ పి.నారాయణమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ విషయమై ఎస్‌ఐ అతడిని మందలించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.

ఈ ఘటనతో మనస్తాపానికి గురైన మురళి ఇంటికి వెళ్లి భోజనం చేశాక ఇప్పుడే వస్తానంటూ తల్లికి చెప్పి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఎస్‌ఐ నారాయణమ్మ తనను మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేశారని, తన చావుకు ఆమే కారణమంటూ అనంతరం కొద్దిసేపటికి తన మిత్రులకు వాట్సాప్‌లో వాయిస్‌ మెసేజ్‌లు పంపించాడు. సోమవారం మధ్యాహ్నం గన్నవరం కొనాయి చెరువు సమీపంలో మురళి స్కూటీ, పాదరక్షలను గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృత దేహాన్ని వెలికి తీశారు. జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ వచ్చిన మురళి తన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి కనీస మర్యాద లేకుండా వ్యవహరించాడని మహిళా ఎస్‌ఐ నారాయణమ్మ పేర్కొన్నారు. దీనిపై సీఐకి సమాచారం ఇచ్చి స్టేషన్‌కు పిలిచి మందలించామన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News