మాగుంట ఇంట ఎంపీలకు విందు, హాజరయిన వివిధ పార్టీల ఎంపీలు

By Raju VS Aug. 04, 2021, 07:30 am IST
మాగుంట ఇంట ఎంపీలకు విందు, హాజరయిన వివిధ పార్టీల ఎంపీలు

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహచర ఎంపీలు, మంత్రులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించారు. దానికి తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో నేతలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన, పలు పార్టీల నేతలు పాల్గొని, ఆత్మీయంగా గడిపారు. అనంతరం ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.

మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటుగా ఆయన తనయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త,మాగుంట రాఘవరెడ్డి ఆహ్వానం మేరకు వచ్చిన నేతలందరినీ వారు సాదరంగా ఆహ్వానించారు. ఆ విందు కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి, మీనాక్షి లేఖీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, అనుప్రియా పటేల్, మాజీ న్యాయ శాఖ సహాయక మంత్రి, పి.పి.చౌదరి, మాజీ కేంద్ర మంత్రి, ప్రఫుల్ పటేల్ ఉన్నారు. పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గిరీష్ బాలచంద్ర బాపట్, గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్న ఫ్రాన్సిస్కో సర్ దిన్ హా తో పాటుగా వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు పినాకి మిశ్రా (బీజేడీ), నామా నాగేశ్వర రావు (టీఆర్ఎస్), నితేష్ పాండే (బీఎస్పీ) కూడా హాజరయ్యారు.

ఎంపీలు కార్తీ చిదంబరం, కనిమొళి, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, నిషికాంత్ దూబే, ప్రియాంకా చతుర్వేది , మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ కూడా విందులో పాల్గొన్నారు. ఇక ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ విభాగం నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ పక్షనేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , లావు కృష్ణదేవరాయలు విందుకి హాజరయ్యారు.

టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ , కింజరపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని తోపాటుగా రాజ్యసభలో టీడీపీకి ఏకైక ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కూడా హాజరుకావడం విశేషం.తెలంగాణా పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్ రెడ్డి తో పాటుగా సుప్రియా సూలే, సుమలత అంబరీష్, గొట్టేటి మాధవి, పాటుగా టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ , కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణా పార్టీ ఇన్ఛార్జ్ మనిక్కం ఠాగూర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

గతం నుంచి ఢిల్లీలో వివిధ పార్టీల ఎంపీల విందు సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా ఉంది. అన్ని పార్టీల నేతలు దానికి హాజరుకావడం, కలిసి సరదాగా గడపడం చాలాకాలంగా వస్తోంది. అదే సమయంలో విందు సమావేశాల కేంద్రంగా పలు రాజకీయాలు నడిపిన చరిత్ర కూడా ఉంది. అయితే ఇటీవల కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోవడం, దానికి తోడు సామాజిక దూరం కారణంగా అందరూ ఒకేచోటకి చేరడానికి ఆంక్షలుండడంతో విందులకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల మధ్య సీనియర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంట జరిగిన సమావేశం సక్సెస్ అయ్యిందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp