స‌ముద్రం ఒక క‌ల‌!

By G.R Maharshi Jun. 09, 2021, 06:00 pm IST
స‌ముద్రం ఒక క‌ల‌!

స‌ముద్రం కొంద‌రికి జీవితం, కొంద‌రికి ర‌చ‌నా వ‌స్తువు. నాలాంటి వాళ్ల‌కు ఒక క‌ల‌. నీటి చుక్క కోసం అల‌మ‌టించే నేల‌పైన పుట్టిన వాళ్లం. సీమ జ‌నం క‌ళ్ల‌లో మ‌బ్బులుంటాయి, నీళ్లుంటాయి. భూమిలో కాదు. 1970 నాటికి రాయ‌దుర్గంలో తెల్లారిలేస్తే క‌నిపించేది మ‌నుషులు కాదు, నీళ్ల బిందెలు. ఊరంతా క‌లిస్తే రెండు బోర్లు. అక్క‌డ జాత‌ర‌. కొట్లాట‌లు. ఒంటెద్దు బండ్లు నీళ్ల పీపాల‌తో ప‌రిగెత్తుతుంటాయి. బావుల వ‌ద్ద జ‌నం.

స‌ముద్రాన్ని సినిమాల్లో మాత్ర‌మే చూసేవాళ్లం. ఆ రోజుల్లో తెలుగు సినిమాలు తీసేది మ‌ద్రాసులోనే కాబ‌ట్టి ప్ర‌తి సినిమాలో క‌నిపించేవి. మ‌ద్రాస్ 400 కి.మీ. అదేదో వేరే దేశంలో ఉందనుకునేవాన్ని. 150 కి.మీ తాడిప‌త్రికి వెళ్ల‌డానికే 3 బ‌స్సులు మారి 8 గంట‌లు ప్రయాణం చేసే కాలం. అందుకే ఎవ‌రైనా మ‌ద్రాస్ వెళ్లి వ‌స్తే నేను అడిగే ప్ర‌శ్న‌లు రెండే రెండు. ఎన్టీఆర్‌ని చూశావా, స‌ముద్రం చూశావా?

స‌ముద్రం గురించి ఎవ‌డికి తోచిన‌ట్టు వాడు చెప్పేవాడు. అది ఒక్కోడికి ఒక్కోలా అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే రాయ‌దుర్గం కుర్రాళ్ల‌లో కూడా క‌ళాపోష‌ణ పెరిగి 1973లో గోవాట్రిప్ వేశారు. కుర్రాళ్ల‌తో పాటు ముస‌లోళ్లు కూడా బ‌య‌లుదేరారు. దాదాపు వారం రోజులు ట్రిప్‌. హ‌నుమంత అనే ఆయ‌న నాయ‌క‌త్వంలో వెళ్లారు (త‌ర్వాత ఈయ‌న ఆంధ్ర‌ప్ర‌భ విలేక‌రిగా చేశాడు). వెళ్లిన వాళ్ల‌లో కొంద‌రు నాకు తెలుసు. ఎపుడొస్తారా అని ఎదురు చూశాను. రానే వ‌చ్చారు. కానీ గోవాలో అంద‌రూ మందు తాగి వ‌చ్చినోళ్లే కానీ, సముద్రాన్ని తాగిన వాడు లేడు. బీచ్‌ల్లో ఈత‌కొట్టే విదేశీయుల్ని చూసి నోరెళ్ల‌బెట్టారు. మందుబాటిళ్లు సంచుల్లో తెచ్చుకున్నారు. అల‌ల్ని ఆనందించిన వాడు లేడు.

నెల రోజులు ఊరంతా గోవా ముచ్చ‌ట్లు. ఒక‌రి జాత‌కం ఇంకొక‌రు చెప్పుకున్నారు. పెద్ద మ‌నుషులు ఒంటి మీద బ‌ట్ట‌లు కూడా లేకుండా తాగారు. అక్క‌డితో ఆగ‌కుండా వేరే ప‌నులు కూడా చేశారు. ర‌హ‌స్యాన్ని కాపాడాల‌ని ప్ర‌మాణాలు చేసుకున్నారు. ఒక‌డిలో ఉంటేనే ర‌హ‌స్యం.

బ‌స్సు దిగ‌గానే ర‌హ‌స్యం అంద‌రి ఇళ్ల‌లోకి చేరింది. గోవాలో తాగింది గొడ‌వ‌ల‌తో దిగిపోయింది. స‌ముద్రం గురించి ఒక‌డు చెప్పేదేంటి? క‌ళ్ల‌తో చూడాల్సిందే అనుకున్నాను. 83లో కుదిరింది. ఒక మిత్రుడితో వెళ్లాను. అత‌నికి కాశీ చెట్టి వీధిలో బ‌ట్ట‌లు కొనే ప‌ని. నాకేమో స‌ముద్రం చూడ‌డ‌మే ప‌ని. సాయంత్రానికి కుదిరింది. స‌ముద్రాన్ని దూరం నుంచి చూడ‌గానే అల‌ల‌కి మించి ఎగిసిప‌డిన స‌ముద్రం. ఏళ్ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ‌. మెరినాని కౌగిలించుకున్నాను. త‌డిసిపోయా, కాళ్ల‌కి నీళ్లు ఇచ్చి స‌ముద్రం నా చెప్పుల్ని లాక్కెళ్లింది. ప‌ట్టించుకోలేదు. అల‌సిపోయి బీచ్‌లో ఫిష్ బ‌జ్జీ తిన్నా. జీవితంలో మ‌ళ్లీ తిన‌లేదు. అంత ఘోరం.

త‌ర్వాత స‌ముద్రంతో స్నేహం. చెన్నై, మ‌హాబ‌లిపురం, పాండిచ్చేరి, త్రివేండ్రం, గోవా, మురుడేశ్వ‌ర్‌, ఉడిపి ఎక్క‌డికెళ్లినా స‌ముద్రం కోస‌మే వెళ్లాను. క‌న్యాకుమారిలో 3 స‌ముద్రాల్ని చూడ‌డం థ్రిల్‌. వైజాగ్ మాత్రం ఆల‌స్య‌మైంది.

2016లో జ‌క్క‌న్న షూటింగ్‌కి నెల రోజులు వైజాగ్‌లో. స‌ముద్రం ఎదురుగా హ‌వామ‌హ‌ల్‌లో , పార్క్‌హోట‌ల్‌లో షూటింగ్‌. క‌ళ్ల నిండా స‌ముద్ర‌మే. 2018లో రుషికొండ బీచ్‌లో రెండు నెల‌లు. ఎటు చూసినా స‌ముద్ర‌మే. మేర్ల‌పాక గాంధీతో స్క్రిప్ట్ ప‌నులు. స‌ముద్రాన్ని చూస్తూ రాయ‌డం, చ‌ద‌వ‌డం, నిద్ర‌పోవ‌డం.

బీచ్‌లో కుక్క‌లు, గుర్రంతో స‌హా అంద‌రూ ఫ్రెండ్సే. ఒక తెల్లారుజామున లైఫ్ జాకెట్లు లేకుండా చేప‌ల వేట‌కు వెళ్లి భ‌య‌ప‌డి చ‌చ్చాం. నాటు ప‌డ‌వ‌లోకి గుడ‌గుడ నీళ్లు. ఎన్నో పుస్త‌కాలు నేర్పించ‌లేని ఫిలాస‌ఫీని ఆ రెండు గంట‌ల భ‌యం నేర్పించింది. ఆర్కే బీచ్‌లో స‌ముద్రాన్ని, ఆకాశాన్ని చూస్తూ గ‌డిపిన రాత్రులు ఎన్నో.

అమెరికాలో మా అబ్బాయి ఉన్న‌ది స‌ముద్ర న‌గ‌రం. జాక్స‌న్‌విల్లీలో అట్లాంటిక్ స‌ముద్రాన్ని ఎన్ని సార్లు చూసానో. సైకిల్ రేస్‌లు, పిల్ల‌ల అరుపులు, సీగ‌ల్స్ గోల‌ అన్నింటికి మించి శుభ్ర‌త‌.

మియామి కీవెస్ట్‌లో (క్యూబా బోర్డ‌ర్‌) స‌ముద్రంలో 2 గంట‌ల ప్ర‌యాణం. ఒక చోట ఆపి స‌ముద్రంలో దింపుతారు. అడుగున ఉన్న కోర‌ల్స్ క‌నిపిస్తాయి. అంత క్లియ‌ర్ వాట‌ర్‌.

మియామి అదో బీచ్‌ల ప్ర‌పంచం. కొన్ని వంద‌ల మంది బీచ్ ఒడ్డున పాడుతూ , ఆడుతూ క్రిస్మ‌స్‌ని ఆహ్వానించ‌డం (డిసెంబ‌ర్ 24 రాత్రి). మ‌రిచిపోలేని దృశ్యం.

మియామి బీచ్‌లో ఒక అర్ధ‌రాత్రి ఒక అమెరిక‌న్ నా ద‌గ్గ‌రికొచ్చాడు. అత‌ని చేతిలో ఊస‌ర‌వెల్లి ఉంది. దాన్ని ఫొటోల్లో కాకుండా ప్ర‌త్య‌క్షంగా చూడ‌డం అదే ఫ‌స్ట్‌. చేతిలో ప‌ట్టుకుని ఫొటో తీసుకోమ‌న్నాడు.

జీవితంలో ఎన్నో ఊస‌ర‌వెల్లుల మ‌ధ్య బ‌తికాం కానీ, అప్పుడు వేయ‌ని భ‌యం నిజ‌మైన దాన్ని చూస్తే వేసింది. పాపం అమాయ‌క ప్రాణం. మ‌న మురికిని జంతువుల‌కి కూడా ఆపాదిస్తాం. ఊస‌ర‌వెల్లి రంగులు చెప్ప‌వ‌చ్చు కానీ మ‌నిషి రంగుల్ని చెప్ప‌లేం.
(జూన్ 8 ప్ర‌పంచ స‌ముద్ర దినోత్స‌వం, ఒక రోజు ఆల‌స్యంగా)

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp