హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ఎప్పటి నుంచి..? ఎలా ఉండబోతోంది..?

By Kotireddy Palukuri Jun. 30, 2020, 12:17 pm IST
హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ ఎప్పటి నుంచి..? ఎలా ఉండబోతోంది..?

మహమ్మరి కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారన్న ఊహాగానాలకు తెరదించుతూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటన చేశారు. లాక్‌డౌన్‌ ఉంటుందని, అయితే అది ఎలా ఉండాలన్నదానిపై చర్చించి త్వరలో నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. దీంతో లాక్‌డౌన్‌ తప్పదనే భావనకు హైదరాబాద్‌ వాసులు వచ్చారు. అయితే ఈ లాక్‌డౌన్‌ ఎప్పటి నుంచి ఉంటుంది...? ఎలాంటి నిబంధనలు ఉండబోతున్నాయనే అంశంపై రెండు రాష్ట్రాలలోనూ చర్చ సాగుతోంది. హైదరాబాద్‌ తెలంగాణ రాజధాని అయిన ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అధికంగా ఉన్నారు. వారితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఉపాధి, ఉద్యోగ, వ్యాపారి నిమిత్తం హైదరాబాద్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.

జూలై ఒకటో తేదీన తెలంగాణ మంత్రి వర్గం సమావేశం అయిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం మంత్రి వర్గ సమావేశం రెండో తేదీకి వాయిదా పడింది. ఆ రోజు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశమై లాక్‌డౌన్‌ ఎన్ని రోజులు పెట్టాలి, ఎలాంటి నియమ నిబంధనలు అమలు చేయాలన్న దానిపై నిపుణులు ఇచ్చిన నివేదికపై చర్చిస్తారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ స్వయంగా లాక్‌డౌన్‌ నిర్ణయం, విధి విధానాలను వెల్లడిస్తారనే ప్రచారం సాగుతోంది. మంత్రివర్గం 2వ తేదీన జరుగుతుండగా ఆ మరుసటి రోజే అంటే జూలై 3వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధిస్తారని తెలుస్తోంది.

గతంలో లాక్‌డౌన్‌ అమలు చేసినప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పొడిగించుకుంటూ పోయారు. ఈ సారి కూడా అదే పంథాను అమలు చేయనున్నారని సమాచారం. మొదట 15 రోజులు లేదా రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తారని తెలుస్తోంది. ఈ సమయంలో గతంలో కన్నా కఠినమైన నిబంధనలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. మెడికల్‌ షాపులు ఎక్కువ సమయం తెరుచుకునే అవకాశం ఇచ్చి, మిగతా నిత్యవసర దుకాణాలు, కూరగాయలు, పండ్లు కేవలం ఒకటి లేదా రెండు గంటల స్వల్ప సమయం మాత్రమే అందుబాటులో ఉండేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా దుకాణాలు పూర్తిగా మూసివేసేలా నిర్ణయం ఉండే అవకాశం ఉంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ – సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని వ్యాపారులు దుకాణాలు మూసివేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే జంట నగరాల్లోని పలు వ్యాపార ప్రాంతాలు, సముదాయాల అసోసియేషన్లు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశాయి. ఆఫీసులు తెరుచుకునే అవకాశం ఇచ్చినా.. ఇంటి వద్ద నుంచి పని చేసే అవకాశం ఉన్న వారు గత లాక్‌డౌన్‌లో మాదిరిగానే ఇప్పుడు పని చేస్తున్నారు. మళ్లీ లాక్‌డౌన్‌ సూచనలతో జంట నగరాల వాసులు అందుకు సిద్ధం అవుతున్నారు. నిత్యవసరాలు, బియ్యం, ఇతర వస్తువులు తెచ్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు. దుకాణాల వద్ద ఆ స్థాయిలో రద్దీ కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp