లాక్ డౌన్ తో పెరుగుతున్న మానసిక రోగులు

By Raju VS Mar. 31, 2020, 12:00 pm IST
లాక్ డౌన్ తో పెరుగుతున్న మానసిక  రోగులు

కరోనా  క‌ల‌క‌లం వివిధ వ‌ర్గాల‌పై ప‌డుతోంది. అన్ని త‌ర‌గతుల‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. చివ‌ర‌కు మందు బాబుల‌ను కూడా వ‌దిలిపెట్ట‌డం లేదు. తాగేందుకు మందు దొరక్క‌పోవ‌డంతో వంద‌ల మంది విలవిల్లాడిపోతున్నారు. ఇప్ప‌టికే వారం రోజులు గ‌డిచిన నేప‌థ్యంలో ఇక త‌ట్టుకోలేని స్థితికి చేరుతున్నారు. మ‌ద్యానికి బానిస‌లుగా మారిన వారికి ఒక్క‌సారిగా మందు అందుబాటులోకి రాక‌పోవ‌డం పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. మానసిక ప్ర‌వ‌ర్త‌న‌లో పెను మార్పుల‌కు కార‌ణంగా మారుతోంది. పిచ్చాసుప‌త్రుల‌కు త‌ర‌లించాల్సిన పరిస్థితి దాపురిస్తోంది.

మార్చి 22 నాడు జ‌న‌తా క‌ర్ఫ్యూతో మొద‌ల‌యిన మందు స‌మ‌స్య ఉధృత‌మ‌వుతూనే ఉంది. అయితే తొలి రోజు తీసుకున్న జాగ్ర‌త్త‌లు, ఇత‌ర మార్గాల్లో ల‌భించే అవ‌కాశాలు ఉండ‌డంతో మొద‌ట్లో పెద్ద స‌మ‌స్య అనిపించ‌లేదు. కానీ రానురాను మందు పూర్తిగా దొర‌క‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో దిక్కులేని వారిగా మారుతున్నారు. మందుకోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు ల‌భించినా దారి లేక‌పోవ‌డంతో దిగాలు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే కొన్ని చోట్ల లిక్క‌ర్ షాపులపై దాడి చేసి దోచుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. దొంగ‌త‌నాలకు పాల్ప‌డిన కేసులో కొంద‌రు మందుబాబుల‌ను విశాఖ‌లో పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇక మ‌ద్యం సీసాలు అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ఎక్సైజ్ సీఐ కూడా ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న తూర్పు గోదావ‌రి జిల్లాలో జ‌రిగింది.

అన్నింటికీ మించి మందు ల‌భించ‌క మ‌తి చెడిన కొంద‌రు ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల‌కు పాల్ప‌డ‌డం మ‌రింత క‌ల‌క‌లం రేపింది. ఈ ప‌రిణామాల‌తో ఇప్ప‌టికే కేర‌ళ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. వైద్యుల స‌ల‌హా మేర‌కు అత్య‌వ‌స‌రం అయిన వారికి మందు స‌ర‌ఫ‌రా చేయాల‌ని కూడా నిర్ణ‌యించింది. ఇక తెలంగాణాలో ఒక్క‌సారిగా మ‌ద్యం దొర‌క‌ని స్థితిలో పిచ్చి చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్న వారిని ప‌లువురిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. ఎర్ర‌గ‌డ్డ ఆస్ప‌త్రికి ఒక్క‌రోజులోనే వంద‌ల మంది రోగుల‌ను త‌ర‌లించాల్సి రావ‌డం గ‌మ‌నిస్తే ప‌రిస్థితి అదుపుత‌ప్పుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ప‌రిస్థితుల్లో అటు ఆంధ్ర‌, ఇటు తెలంగాణా ప్ర‌భుత్వాలు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. మొత్తం మ‌ద్యం క‌ట్ట‌డి చేస్తే అక్ర‌మ మ‌ద్యం , ఇత‌ర ప్ర‌మాద‌క‌ర పానీయాల వైపు మ‌ళ్లే ప్ర‌మాదం ఉంద‌ని కొంద‌రు అనుమానిస్తున్నారు. అదే స‌మ‌యంలో కొంత‌వ‌ర‌కూ క‌ల్లు సీజ‌న్ కావ‌డంతో అనేక‌మందికి ఊర‌ట ద‌క్కుతోంది. కానీ న‌గ‌ర వాసుల‌కు మాత్రం ఊపిరి స‌ల‌ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డం మందుబాబుల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మార‌డంతో వారి కుటుంబ స‌భ్యులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వాలు పున‌రాలోచ‌న చేయాల‌ని కోరుతున్నారు. ఎలాంటి నిర్ణ‌యాలు వెలువ‌డ‌తాయ‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp