ఎన్నికలకు ముందు కోర్టుల్లో పిటీషన్లు.. వాటివెనుక ఉద్దేశం మాత్రం ఇదే.!

By Ravoori.H 19-11-2019 07:36 AM
ఎన్నికలకు ముందు కోర్టుల్లో పిటీషన్లు.. వాటివెనుక ఉద్దేశం మాత్రం ఇదే.!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల వ్యవహారం తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలంటూ..దాఖలైన పిటీషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తే ముందుకు వెళ్లవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం అమలు చేస్తామని బొత్స తెలిపారు.

అయితే ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కేటాయింపు 50 % కి మించేందుకు దోహదం చేస్తోందని, వాటిని రద్దు చేయాలని అభ్యర్థిస్తూ గుంటూరుకు చెందిన కె.నవీన్‌కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదిస్తూ.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్లు ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించడానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, కాని రాష్ట్రంలో బీసీలకు 34, ఎస్సీలకు 15, ఎస్టీలకు 6% చొప్పున మొత్తం 55% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై కోర్టు నిర్ణయం వెలువరించే వరకు ఎన్నికలు జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. కాగా ఈ కేసు విషయంపై ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదించారు. ఎన్నికల ప్రక్రియను నిలువరించరాదని, దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం 4 వారాలు వాయిదా వేసింది.

ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో కేసు నమోదు అయింది. గడువు ముగిసి నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల‌్‌పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్ పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆదేశించడంతో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు..దీంతో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. మొత్తంగా మూడునెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వ సిద్ధమవుతోంది.

అయితే ఇలా ఎన్నికలకు ముందు ప్రజా ప్రయోజనవాజ్యాల పేరుతో ఆయా పార్టీలు సర్వోన్నత న్యాయస్థానాల్లో కేసులు వేయడం పరిపాటిగా మారింది. గతంలో కూడా 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న జరగనున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రతి ఏటా ఏప్రిల్ 11వ తేదిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబా పూలే జయంతి జరుగుతోంది. ఆ రోజు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పూలే జయంతిని జరుపుకునే అవకాశం లేకుండా పోతుంది. కావున ఆరోజు నిర్వహించనున్న ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. మరో కేసులో ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే వ్యతిరేక కూటమికి చెందిన 21 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలా న్యాయస్థానాలను ఆశ్రయించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా లేని కొన్ని పార్టీల అధినేతలు, వాటిని వాయిదా వేయించడానికే తమ పార్టీ సానుభూతిపరులతో ప్రజాప్రయోజన వాజ్యాలు వేయిస్తున్నట్లు కొన్ని కేసులను చూస్తే అర్థమవుతోంది.

ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేస్తే తమ పార్టీల ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతోనే రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లను అడ్డంపెట్టుకుని ఏదో ఒక పిటీషన్ వేసి ఎన్నికలను అడ్డుకోవడానికే ఇలా వూహాత్మకంగా కోర్టుల్లో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హైకోర్ట్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లవచ్చని చెప్పడంతో సదరు పిటీషన్‌దారుల వెనుక ఉన్న వారి ప్లాన్ వర్కవుట్ కాలేదనే చెప్పాలి. మొత్తంగా ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రజాప్రయోజనవాజ్యాల పేరుతో పలువురు వ్యక్తులచే పార్టీలు కేసులు వేయిస్తున్న విషయంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News