లక్ష్మీ పార్వతియే కాదు ఆవిడ సరస్వతి కూడా

By iDreamPost 07-11-2019 12:38 PM
లక్ష్మీ పార్వతియే కాదు ఆవిడ సరస్వతి కూడా

లక్ష్మీ పార్వతి గారిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిన్న నియమించింది. దీని సంబంధించి బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 

నందమూరి లక్ష్మీ పార్వతి ఒక రాజకీయ వివక్షితురాలుగా,బాధితురాలిగా...తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితమే.ఆమె వ్యక్తిగత జీవితమో తుఫాను.ఇదంతా లక్ష్మీ పార్వతి గారి గురించిన ఒక కోణమైతే..భాషా ప్రవీణ తొలి అడుగుగా డాక్టరేటు దాకా సాగిన లక్ష్మీ పార్వతి గారి సాహిత్య ప్రస్థానం,ఆమె ఆలోచలు, ఒక నవలా రచయిత్రిగా,ఒక కవయిత్రిగా,ఒక ఆధ్యాత్మిక అభిజ్ఞురాలుగా ఆమె సాధించిన ఘనత మరో కోణం.వారి రచనలు తెలుగు తేజం,ఎదురులేని మనిషి,ఆద్యంతాలు, భజగోవింద వ్యాఖ్యానం, ముఖ్యంగా నందమూరి తారక రామారావుగారి పౌరాణిక పాత్రల విశ్లేషణలను చదివితే తెలుగు సాహిత్యంలో ఆవిడది సమోన్నత స్థానం అని అర్ధమవుతుంది. .


"ప్రకృతి నుండి ఆవిర్భవించిన పంచభూతాలు, తిరిగి మాతృ వ్యవస్థ మీదికే దాడి చేసినట్టు-స్త్రీ గర్భంలో జనించిన పురుషుడు స్త్రీల మీదనే పెత్తనం సాగిస్తున్నాడు.తరాలుగడిచినా స్త్రీ అశ్రు వేదనలోని అంతర్భాగం ఒక్కటే-నాటి వైదేహి నుండి నేటి నిర్భయ వరకు జరుగుతున్న చరిత్ర ఇదే..."అంటూ సీత పాత్రలోని మరో కోణంలో ఆవిష్కరించిన 'వైదేహి'నవలలో ఆమెలోని సాహిత్య ప్రకర్షతోపాటు.."కవి కుల గురువు " మహాకవి కాళిదాసు కథానాయకుడిగా రాసిన "అభిజ్ఞ"మలిచిన విధానం...కాళిగాడు కాళిదాసుగా పరివర్తన పొందిన తీరు హృధ్యంగా వివరిస్తూ...కాళిదాసు సుకవిగా పేర్కొనబడే అద్భుతమైన చమత్కార చాటు శ్లోకాలు ఈ ఆపాత రమణీయ రచనకు అదనపు సొగబులద్దడం..ఆవిడకు  సంస్కృత భాషపై ఉన్న పట్టును తెలియజేస్తాయి.

"చరిత్ర సృష్టించిన ప్రతి వ్యక్తిలో విశేషంగా కన్పించేది అతని వ్యక్తిత్వమే. అటుపోట్లు వచ్చినా చెక్కుచెదరక ముందుకు సాగిపోయేవారే ధీరచిత్తులు, వారి వారి సిద్ధాంతాల అమలుకు జీవితాన్ని కూడా బలిపెట్టారు. కాని వెనుకకు మరల లేదు. బుద్ధుడు మొదలుకొని గాంథీ, అంబేద్కర్, నేతాజీ వరకు అదే పోరాట పంథా, ప్రతి మనిషి జన్మించగానే గొప్ప ఇంట్లో, బంగారు చెంచాతో పుట్టరు. కష్టాలు, కన్నీళ్ళు కలబోసుకుని జీవితసారాన్ని వడబోసుకుని ఒడిదుడుకుల ప్రవాహంతో ఎదురీది ఒక సుస్థిర స్థానాన్ని సంపాదిస్తారు. అలా సాధించిందే విజయం. అయితే ఎప్పుడూ సమాజంలోని కొన్ని వ్యతిరేక శక్తులు ఈ మంచి వ్యక్తులను ఎదుర్కోటానికే ప్రయత్నిస్తుంటారు.ఎన్టీఆర్ ను తీసుకుంటే ఆయనకు నచ్చినవిధంగా తన జీవితాన్ని నిర్ణయించుకోకూడదనేదే ఇక్కడ శాసనం. అదే ఇంట్లో ఎన్టీఆర్ చివరి కుమార్తె మొదటి వివాహం భగ్నమైతే ఆమె జీవితం మోడు కాకూడదని, ఎన్టీఆర్ మరో వివాహం చేసారు. అలాగే కొడుకు విషయంలో కూడా ఆయన ఉదారంగా ప్రవర్తించారు"అంటూ... ఆమె తన "తెలుగు తేజం"పుస్తకంలో వివరించిన విధానం రాజకీయ వేత్తగా ఆమెలోని పరిణతిని తెలుపుతాయి.  


సుప్రభాతం మేగజైన్ లో ఎన్టీయార్ జీవిత చరిత్ర చదివిన ఏ పాఠకుడు ఆమె కలం నుండి జాలువారిన ఆ సాహితీ పరిమళాలను అంత తేలికగా మరిచిపోలేడు.తెలుగుభాషలోని లాలిత్యానంతా కరిగించి,సిరగా మార్చి రాసారా...అన్నంతగా వెంటాడుతాయి ఆమె అక్షరాలు.

ఆమె మంచి  రచయిత్రి, కవయిత్రి, రాజకీయ విశ్లేషకురాలికి తెలుగు అకాడమీ చైర్మన్ పదవి దక్కడం భాషాసాహిత్యాలతో పాటుగా సాహిత్య విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందాని ఆశపడొచ్చు.తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమితులైన లక్ష్మీ పార్వతి గారికి అభినందనలు. 

--శతపత్ర మంజరి

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News