ఏపీ హైకోర్టులో పెండింగ్ లో లక్షల కేసులు

By Raju VS Sep. 26, 2020, 09:00 am IST
ఏపీ హైకోర్టులో పెండింగ్ లో లక్షల కేసులు

ఏపీ హైకోర్ట్ వ్యవహారాలు ఇటీవల ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం మారిన తర్వాత జగన్ సర్కారుకి వ్యతిరేకంగా వస్తున్న తీర్పుల పట్ల ప్రభుత్వ పెద్దలు కూడా అభ్యంతరాలు చెబుతుండడం విశేషం. పైగా కోర్ట్ తీర్పులపై పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎంపీ లు గొంతు విప్పారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానాలు వచ్చాయి. అదే సమయంలో అవినీతి కేసుల్లో విచారణ వద్దని అనడం, ఎఫ్ ఐ ఆర్ కూడా బయటపెట్టకుండా గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వడం వంటివి హైకోర్ట్ ని వేలెత్తిచూపేందుకు కారణాలుగా మారాయి.

చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు వేసిన దాఖలాలు నామమాత్రం. కానీ జగన్ సర్కారు రెండేళ్లు కూడా నిండకుండానే ఆనాటి లెక్కలను దాటి పిల్ ఎదుర్కోవాల్సి వస్తోంది. రాజకీయ కారణాలతో దాఖలవుతున్నట్టు అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం తరుపున వాదిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు నుంచి ముస్లీం యువతకి కేసుల నుంచి విముక్తి చేసేందుకు జారీ అయిన ఉత్తర్వుల వరకూ అన్నీ వివాదాలుగా మారుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను తాజాగా పార్లమెంట్ లో ప్రస్తావించారు. వైఎస్సార్సీపీ ఎంపీ పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు న్యాయ శాఖ మంత్రి సమాధానమిచ్చారు. ఏపీలో ఏకంగా 2.03 లక్షల కేసులు ఏకంగా ఒక్క హైకోర్టులోనే పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఇవి చాలాకాలంగా సాగుతున్నాయనే సంగతిని గుర్తు చేశారు. పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మీద వేస్తున్న కేసులపై వేగవంతంగా స్పందిస్తున్న తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది. కేవలం హైకోర్టులోనే కాకుండా దిగువ కోర్టులలో మరో 5.82 లక్షల కేసులు పెండింగ్ లో సాగుతున్నట్టు వివరించారు. మొత్తంగా ఏపీ న్యాయస్థానాలలో భారీగా పేరుకుపోయిన కేసుల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp