ఈటల + కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి = ఏం జరగబోతోంది..?

By Kalyan.S May. 07, 2021, 08:15 am IST
ఈటల + కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి = ఏం జరగబోతోంది..?

తెలంగాణలో ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌పై రోజుకో చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే ఆయనపై పోటీకి టీఆర్‌ఎస్‌ నుంచి కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నిలబడతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక వేళ రాజేందర్‌ రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిస్తే కొత్త పార్టీకి పెడతారనే వాదన ఉంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అలాగే, ఈటల భూ కబ్జా ఆరోపణలకు ముందే ఇరువురూ కలిసి పార్టీ పెడతారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. అంతకు ముందే విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలవడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

మేడ్చల్‌ మండలం పూడూరు శివారులోని ఈటల రాజేందర్‌ నివాసానికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి వెళ్లారు. ఈటల దంపతులకు సానుభూతి తెలిపారు. తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా, తెలంగాణ ప్రజలు ఆయన వెంటే నడుస్తారని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈటల భార్య జమున తనకు దగ్గరి బంధువని, ఆయన కూడా తనకు పాత మిత్రుడని తెలిపారు. వారు బాధపడడం టీవీల్లో చూసి బంధువు, మిత్రుడిగా సానుభూతి తెలిపేందుకు వచ్చినట్లు వెల్లడించారు. వారికి ధైర్యం చెప్పానని, ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని ఆయన స్పష్టం చేసినా, ఇద్దరూ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం మీడియాలో జరుగుతోంది.

ఈటల అభిమానుల నిరసన

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని పెద్ద చెరువులోకి దిగి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అభిమానులు, మత్స్యకారులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈటలను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల ఎదుగుదలను ఓర్వలేకే ఆయనపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ భూకబ్జా ఆరోపణలు చేసి మంత్రి పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. ముదిరాజ్‌లు అంతా ఈటల వెంటే ఉన్నారన్నారు.

కేసీఆర్‌ ఫొటోకు ఈటల పూజ చేయాలి

తనకు వందల ఎకరాలు, రూ.వేల కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఫొటో పెట్టుకుని తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ జీవితాంతం పూజ చేయాలని బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్య చేశారు. బీసీ నాయకుడికి మంత్రిపదవి ఇచ్చినందుకు కేసీఆర్‌కు ఈటల కృతజ్ఞతతో ఉండాలన్నారు. గురువారం ఓ చానల్‌తో మోత్కుపల్లి మాట్లాడారు. ఈటలది ఆత్మగౌరవ సమస్య కాదని, ఆత్మద్రోహమని ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి భూములు, దళితుల భూములు తీసుకుని ఆయన తప్పు చేశారని అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp