కోమ‌టిరెడ్డి `దళిత సీఎం` వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

By Kalyan.S Aug. 28, 2021, 07:28 am IST
కోమ‌టిరెడ్డి `దళిత సీఎం` వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సాధార‌ణంగానే బ‌ల‌మైన నేత‌. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో అత‌నికి ఎదురులేదు. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన కోట‌రీ ఉంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ లో కొన‌సాగుతూ పార్టీ అభివృద్ధికి పాటు ప‌డుతూ వ‌స్తున్నారు. టీపీసీసీ చీఫ్ ప‌ద‌విని ఆశించారు. ఆయ‌న‌ను కాద‌ని రేవంత్ కు అధిష్ఠానం ఆ ప‌ద‌విని అప్ప‌గించిన‌ప్ప‌టి నుంచీ కోమ‌టిరెడ్డి మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారారు. మాములుగానే సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన ఆయ‌న ఇటీవ‌ల వినూత్న శైలిలో స్పందిస్తున్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక‌లో హై క‌మాండ్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన ఆయ‌న ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డ్డ‌ప్ప‌టికీ.. అప్పుడ‌ప్పుడు ఆయ‌న చేస్తున్న పార్టీలో వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఆయ‌న నుంచి వెలువ‌డిన మ‌రో ప్ర‌క‌ట‌న ఇదే విధంగా ఉంది.

కోమ‌టిరెడ్డి ప్ర‌క‌ట‌న‌లు ఎప్పుడూ అధికార ప‌క్షాన్ని, కేసీఆర్ ను ఇరుకున పెట్టేవిగా ఉండేవి. కానీ ఇటీవ‌ల సొంత పార్టీనే ఇరుకున పెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి ఆయ‌న చేసిన స‌ర్వే కూడా అలాగే ఉంది. ఈ ఎన్నిక‌లో కాంగ్రెస్ కు ఐదు శాతం కూడా ఓట్లు రావ‌ని చెప్ప‌డంతో పీసీసీ కంగుతింది. అలాగే బ‌హిరంగ స‌భ‌ల‌కు హాజ‌రుకాక‌పోవ‌డం, కోమ‌టిరెడ్డి గురించి వేదిక మార్చాల్సి రావ‌డం ఇవ‌న్నీ చ‌ర్చ‌కు దారి తీసిన అంశాలే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ప్రయత్నిస్తానని ప్రకటించ‌డం కూడా అంత‌కుమించి వివాదానికి దారి తీస్తోంది.

వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కీల‌క ప‌ద‌వి లేని ఆయ‌న ఈ త‌ర‌హా ప్ర‌క‌టన చేయ‌డం ఓ ఎత్త‌యితే, దాని వెనుక అస‌లు ఉద్దేశం ఏంట‌నేది మ‌రో ప్ర‌శ్న‌గా మారింది.
వాస్తవానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హుషారు వచ్చింది. అందరూ యాక్టివ్ అయిపోయారు. కాంగ్రెస్ మునుపెన్నడూ లేని విధంగా సవాల్ విసురుతోందని టీఆర్ఎస్కూ అర్థమైపోయింది. అయితే.. ఈ పదవిని ఆశించి భంగపడ్డ.. వెంకటరెడ్డి.. రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆయన పీసీసీ చీఫ్ అయితే.. కాంగ్రెస్ మరింత దిగజారిపోతుందన్నట్టు వ్యాఖ్యానించారు.

అయితే.. తాజాగా ఆయన ముఖ్యమమంత్రి పదవి గురించి మాట్లాడడం అందునా.. దళిత ముఖ్యమంత్రి అంటూ.. వ్యాఖ్యలు చేయడం వంటివి సంచలనంగా మారాయి. వెంకటరెడ్డి మాత్రం ప్రస్తుత పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారా? లేదా ద‌ళిత బంధు పేరుతో కేసీఆర్ చేస్తున్న రాజ‌కీయాల నేప‌థ్యంలో ఈ అంశంపై తెర‌పైకి తెచ్చారా అనేది సందేహంగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp