ఏపీకి రానున్న కైనటిక్ గ్రీన్ సంస్థ..

By Kiran.G Oct. 28, 2020, 10:10 am IST
ఏపీకి రానున్న కైనటిక్ గ్రీన్ సంస్థ..

ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రీచార్జి యూనిట్ల ఏర్పాటుకు కైనెటిక్‌ గ్రీన్‌ సంస్థ ముందుకొచ్చింది. గోల్ఫ్,మరియు ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దశలవారీగా 1800 కోట్ల పెట్టుబడులు పెడతామని కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని ప్రతిపాదనలు పంపారు.

కాగా యూనిట్ ఏర్పాటుకు ఓడరేవుకు సమీపంలో ఉండే భూములను ఏర్పాటు చేయాలని కైనెటిక్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 150 ఎకరాల భూమిని యూనిట్ ఏర్పాటుకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కైనెటిక్ సంస్థ కోరింది. పోర్టు ప్రాంతంలో భూములు కేటాయించాలని కోరడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో కైనెటిక్ సంస్థ తమ యూనిట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. చిత్తూరు విశాఖ జిల్లాలతో పాటు నెల్లూరు కృష్ణ పట్నం పోర్టు ఏరియాలో ఉన్న భూములను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయిస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. తమ కంపెనీ ప్రాజెక్టును భారీ ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కైనెటిక్ గ్రీన్ సంస్థ విజ్ఞప్తి చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp