చంద్రబాబుకి మరోసారి కౌంటర్ వేసిన కేశినేని నాని

By Raju VS Aug. 06, 2020, 04:00 pm IST
చంద్రబాబుకి మరోసారి కౌంటర్ వేసిన కేశినేని నాని

మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా కేశినేని నాని కలకలం రేపాయి. టీడీపీ నేతలను కలవరపరిచారు. ముఖ్యంగా ఆయన వ్యాఖ్యలు, ట్వీట్లు సంచలనంగా మారాయి. సొంత పార్టీ నేతలకే ఆయన కౌంటర్లు ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. చివరకు ఆయన పార్టీ మారే ఉద్దేశంతోనే టీడీపీ అధిష్టానం మీద రెచ్చిపోతున్నారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు ఆయన మెత్తబడ్డారు. కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. టీడీపీ విధానాలపై గానీ , అధిష్టానంపై గానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిగ్రహం పాటిస్తున్నారు.

కానీ హఠాత్తుగా కేశినేని నుంచి వచ్చిన ఓ కౌంటర్ ఇప్పుడు మళ్లీ మంట పుట్టిస్తోంది. టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అంతా చల్లబడిందనుకుంటున్న సమయంలో మళ్లీ కేశినేని నాని ట్వీట్లు ప్రారంభించడం వారిలో అలజడి రేపుతోంది. విజయవాడ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా దేవినేని ఉమతో కేశినేని నానికి వైరం ఉంది. ఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ ఇరువురు వర్గపోరు సాగిస్తున్నారు. అలాంటి సమయంలో ఉమా ని అధిష్టానం ఆదరిస్తూ, అందలం ఎక్కించడం నానికి రుచించడం లేదనే చెప్పవచ్చు. చంద్రబాబు దృష్టికి పలుమార్లు తన మనసులో మాట చెప్పినా ఆయన మాత్రం ఉమ వైపు మొగ్గుచూపడంతో కేశినేని నాని బరస్ట్ అయినట్టు అప్పట్లో అంతా భావించారు.

అయితే తాజాగా అమరావతి విషయంలో మరోసారి కేశినేని నాని చేసిన ట్వీట్ చర్చకు వచ్చాయి. మన కలలను మనమే సాకారం చేసుకోవాలి..వేరెవరో చేయరని కేశినేని చేసిన వ్యాఖ్య ఇప్పుడు సూటిగా చంద్రబాబుని ఉద్దేశించి చేసిందేనని పలువురు సందేహిస్తున్నారు. తాజాగా 48 గంటల డెడ్ లైన్ అంటూ చంద్రబాబు నడిపిన ప్రహసనం పట్ల నాని ఇలాంటి కౌంటర్ ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. అమరావతి కోసం చంద్రబాబు పోరాడుతూ వైఎస్సార్సీపీని రాజీనామా చేయాలనడం పట్ల నాని ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారని భావిస్తున్నారు. అంతటితో సరిపెట్టుకుండా పేపర్ స్టేట్ మెంట్లు, ప్రెస్ మీట్ల ఉపయోగం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా బాబు తీరు మీద అసహనంతోనేనా అని విజయవాడ వాసులు అంచనాలో ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో అసలే ఆత్మరక్షణలో ఉన్న టీడీపీకి కేశినేని నాని సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంతా సర్థుమణింగిందని భావిస్తున్న సమయంలో పార్టీ అధినేత వైఖరిపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న తీరు మీద రకరకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. కేశినేని కథ మొదటికి వచ్చిందని, ఆయన ఎక్కువ కాలం టీడీపీ లో కొనసాగాలేరని కొందరు సూత్రీకరించడానికి సైతం సిద్ధపడుతుండడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp