నేడో.. రేపో కేసీఆర్ ప్రెస్ మీట్‌..?

By Kalyan.S Jul. 12, 2020, 07:36 am IST
నేడో.. రేపో కేసీఆర్ ప్రెస్ మీట్‌..?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వ‌స్తున్నారంటే.. బాహుబ‌లి లాంటి ఓ భారీ బ‌డ్జెట్ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నంత ఆతృతగా చూసేవారు చాలా మందే ఉంటారు. లాక్ డౌన్ వంటి సందర్భాల్లో ఆయ‌న ప్రెస్ మీట్ పెట్టిన‌ప్పుడు ఆయా న్యూస్ చానళ్ల రేటింగ్స్ ను, వ్యూస్ ను చూస్తే అది అర్థం అవుతుంది.

బ‌తికుంటే బ‌లుసాకు తిందామ‌న్నా.. క‌రోనా తో స‌హ‌జీవ‌నం చేయాల్సిందే అని చెప్పినా.. ఆయ‌న శైలి.. వాగ్ధాటి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేవి. "ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం.. లాక్ డౌన్ క‌ఠినంగా అమ‌లు చేస్తాం.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుక‌డుగు వేయం.. ‌జ‌నాన్ని చంపుకుంట‌మా.. అవ‌స‌ర‌మైతే 10 వేల కోట్లు అప్పు తీసుకుంటాం.. ఎవ‌రికీ ఏ లోటూ లేకుండా కాపాడుకుంటాం.." అంటూ ఆయ‌న చెప్పే ఒక్కో మాట ప్ర‌జ‌ల‌కు కొండంత భ‌రోసా ఇచ్చేది..

క‌రోనాను ఢీ కొట్టే శ‌క్తిని ఇచ్చేలా ఉండేవి. మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఠ‌క్కున స‌మాధానాలు ఇస్తూ.. ఆక‌ట్టుకునేవారు. ఉదాహ‌ర‌ణ‌కు లాక్ డౌన్ తొలి సండ‌లింపుల‌ సంద‌ర్భంలో మ‌ద్యం దుకాణాల ప్రారంభంపై ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు "ఏ కొన్ని రోజులు తాక్క‌పోతే చ‌స్త‌రా.." అంటూ చ‌లోక్తిగా.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా స‌మాధానం ఇచ్చారు. ఇలాంటి ప్ర‌శ్న‌లు.. కేసీఆర్ అదిరిపోయే స‌మాధానాలు ఎన్నో.. అందుకే లాక్ డౌన్ స‌మ‌యంలో కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా గంట‌ల త‌ర‌బ‌డి టీవీలకు అతుక్కుపోయేవారు.

నిబంధ‌న‌ల ప్రకార‌మే..

అయితే.. ప్ర‌స్తుతం కేసీఆర్ మీడియా ముందుకు వ‌చ్చి దాదాపు ఐదారు వారాల పైనే అవుతోంది. దీనికి తోడు రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో కొద్ది మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన కార‌ణంగా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆయ‌న 14 రోజులు క్వారంటైన్ లో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ స‌మ‌యంలో కూడా ఆయ‌న ఓ రైతుతో సాగునీటికి సంబంధించి ఫోన్ లో మాట్లాడిన‌ట్లు మీడియాలో వార్త‌లొచ్చాయి.

క్వారంటైన్ గ‌డువు ముగియ‌డంతో కేసీఆర్ శ‌నివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ నుంచే పాల‌న చేస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలాంటి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేసీఆర్ త్వ‌ర‌లోనే మీడియాతో మాట్లాడే అవ‌కాశం ఉంది. జూలై 12న మ‌న‌వ‌డు హిమాన్షు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు కుటుంబంతో గడిపే అవకాశాలు ఉన్నాయి. లేదా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే సాయంత్రం స‌మావేశం పెట్టే చాన్స్ కూడా ఉంది. లేదా రేపు, ఎల్లుండి ప్రెస్ మీట్ పెట్టే అవ‌కాశాలు మాత్రం త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తున్నాయి. లేదా.. ఏదైనా అభివృద్ధి కార్య‌క్ర‌మం అనంత‌రం.. ఆ సంద‌ర్భంగా ఆయా అంశాలు, ఆయ‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌పై మాట్లాడే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp