నేడు కార్గిల్ విజయ్ దివస్ - అమరవీరులకు నివాళి

By Krishna Babu Jul. 26, 2020, 12:53 pm IST
నేడు కార్గిల్ విజయ్ దివస్ - అమరవీరులకు నివాళి

పాకిస్తాన్ చొరబాటుదారులు స్వాధీనం చేసుకున్న భారత భూభాగం కార్గిల్ - ద్రాస్ లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం 1999 లో ప్రారంభించిన ఆపరేషన్ విజయ్ నేటితో 21ఏళ్ళు పూర్తి చేసుకుంది. భారత దేశం సమగ్రతను కాపాడే క్రమంలో యుద్దంలో తమ జీవితాలను త్యాగం చేసిన అమరవీరులను గుర్తుచేసుకుంటూ కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతి ఏడు (జూలై 26)న యావత్ దేశం గర్వంగా జరుపుకుంటుంది.

కార్గిల్ భూభాగంలోకి పాకిస్తాన్ దళాలు జరిపిన చొరబాటును గుర్తించిన భారత సైన్యం1999 మే 3 నుండి జూలై 26 వరకు కార్గిల్ దగ్గర పాకిస్తాన్ సైన్యంతో యుద్దనికి దిగింది. తొలుత పాకిస్తాన్ 1998 లోనే దాడిని పథకం రచించినా పూర్తిస్థాయి యుద్ధానికి భయపడింది. ఇదే సమయంలో పర్వేజ్ ముషారఫ్ పాక్ సైన్యాధిపతి అవ్వగానే మళ్ళీ ఈ పథకానికి ప్రాణం పోశాడు. కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచెన్ నుండి వెనక్కి పంపడం భారత్ ని కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం, అంతేగాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం కొంత మంది సైనికులను ముజాహిదీన్ ల రూపంలో భారత్ కాశ్మీర్ లోకి పంపింది.

అయితే కార్గిల్‌లో పాకిస్తాన్ సైనికులు చోరబడ్డారనే సమాచారాన్ని ఒక గొర్రెల కాపరి ద్వారా తెలుసుకున్న భారత సైనికులు ఆ ప్రాంతానికి గస్తీ దళాలను పంపించింది. అయితే అందులో ఐదుగురు భారతీయ సైనికులని పాకిస్తాన్ మూకలు పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపడంతో పాటు కార్గిల్ ఆయుధాగారంపై శతఘ్ని తో దాడి చేసి ధ్వంసం చేసింది. దీంతో చొరబాటుదారులపై భారత్ సైనికులు వాయుసేనతో దాడులు జరిపింది. ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన ముగ్గురు సైనికల నుండి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి పర్వేజ్ ముషారఫ్, ఛీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అజీజ్ ఖాన్ తో జరిపిన సంభాషణను బయటపెట్టి పాకిస్తాన్ సైన్యపు జోక్యాన్ని భారత్ అధికారులు నిరూపించడంతో అప్పటివరకు తమకు సంబంధంలేదు అని బొంకిన పాకిస్తాన్ బండారం బట్టబయలైంది.

ఈ సంఘటంతో భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులు జరిపింది. తొలుత బటాలిక్ సెక్టారులో రెండు కీలక స్థావరాలను, ద్రాస్ సెక్టారులోని తోలోలింగ్‌ను, టైగర్ హిల్ వద్ద ఉన్న రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీన పరచుకుంది. భారత సైన్యం తమ దాడిని తీవ్రతరం చేయడం, ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు క్లింటన్ పాకిస్తాన్ పై తీవ్ర ఒత్తిడి తీసుకుని రావడం, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ సొంత సైన్యానికి ఆయుధాలు, ఆహారం నిలిపివేయడంతో. భారత సైన్యం బటాలిక్ లోని కీలక స్థావరాలను కూడా స్వాధీనం చేసుకున్నాక, ఇక చేసేది లేక పాకిస్తాన్ వెనక్కు వెళ్ళడం ప్రారంభించింది. దీంతో జులై 14న భారత ప్రధాని వాజ్ పాయి ఆపరేషన్ విజయ్ అత్యంత విజయవంతంగా ముగిసింది అని ప్రకటించారు. జులై 26న పాకిస్తాన్ తో చర్చల అనంతరం కార్గిల్ యుద్దం ముగిసింది అని భారత్ ప్రకటించడంతో యుద్దం అధికారికంగా ముగిసింది.

ప్రపంచంలోనే అత్యనత క్లిష్టమైన కార్గిల్ భూభాన్ని కాపాడే చర్యల్లో మన సైన్యం చూపిన అసమాన తెగువ ప్రపంచ దేశాలనే ఆశ్చర్య పరిచింది. మన దళాల యొక్క ధైర్యం, అలుపెరుగని సంకల్పం వెరసి లక్ష్యాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది. మన సైనికుల శౌర్యం, త్యాగం మరియు ఆదర్శప్రాయమైన ధైర్యాన్ని దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp