క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప హత్య కేసు ఖైదీలకు బెయిల్

By Ritwika Ram Jul. 06, 2021, 12:45 pm IST
క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప హత్య కేసు ఖైదీలకు బెయిల్

క‌ప్ప‌ట్రాళ్ల వెంక‌ట‌ప్ప నాయుడు.. ఎప్పుడో 13 ఏళ్ల కిందట హత్యకు గురైన ఫ్యాక్షనిస్టు. ఇప్పుడు ఆయన పేరు మరోసారి వినిపించింది. కప్పట్రాళ్ల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లు జైలు నుంచి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు సహా ఐదుగురు ఖైదీలు ఆదివారం బెయిల్ పై విడుదల అయ్యారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో..

ఐదేళ్లు, అంతకన్నా ముందు నుంచి బెయిల్‌ రాక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో జైళ్లలో సంఖ్య తగ్గించాలని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఐదేళ్ల పాటు బెయిల్‌ రాకుండా ఉన్న వారిని బెయిల్‌పై విడుదల చేస్తున్నారు. దీంతో మద్దిలేటి నాయుడు సహా ఐదుగురు బెయిల్ పై బయటికి వచ్చారు.

శిక్షాకాలం ముగిసినట్లేనా?

కప్పట్రాళ్ల హత్య కేసులో 21 మందికి దోషులుగా తేల్చిన ఆదోని కోర్టు.. వాళ్లందిరికీ 2014 డిసెంబర్ లో జీవిత ఖైదు (14 ఏళ్లు) విధించింది. అప్పటి నుంచి వాళ్లు జైలులోనే ఉన్నారు. దోషుల్లో కొందరు ఇప్పటికే చనిపోయారు. దాదాపు ఆరున్నరేళ్లు గడిచింది. శిక్ష పడటానికి ముందు కూడా వాళ్లు రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. రూల్స్ ప్రకారం జైలు శిక్షలో... పగలు, రాత్రిని రెండు రోజులుగా పరిగణిస్తారు. అంటే ఒక రోజును రెండు రోజులుగా పరిగణిస్తారు. ఆ లెక్కన చూస్తే మద్దిలేటినాయుడు సహా మిగతా దోషుల జైలు శిక్షా కాలం దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.

కత్తులతో బతికి.. కత్తులకే బలై..

కత్తులతో బతికిన వాళ్లు చివరికి కత్తులకే బలవుతారనేందుకు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఓ ఉదాహరణ. వెంకటప్పనాయుడు 27 ఏళ్లకే కప్పట్రాళ్ల సర్పంచ్ అయ్యారు. కేఈ ఫ్యామిలీకి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. తన ఫ్యాక్షన్ గొడవల్లో ఆఖరికి తన సొంత బావ మాదారపు రంగప్ప నాయుడుని కూడా వదల్లేదు. ఆయన తన శత్రువులతో చేతులు కలిపాడన్న అనుమానంతో 1998లో పత్తికొండ లోని హోటల్లో చంపించారు. వెంకటప్ప చావుకు బీజం పడింది ఇక్కడే.

2008 మే 17న శత్రువులు వెంకటప్ప నాయుడు వాహనాన్ని లారీతో ఢీకొట్టి బాంబులు వేసి, కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనలో వెంకటప్ప, ఆయన కొడుకు శివశంకర నాయుడుతోపాటు మొత్తం 10 మంది చనిపోయారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు. వెంకటప్ప చంపించిన సొంత బావ రంగప్ప కొడుకు ఇతను. వెంకటప్పకు మేనల్లుడు అవుతాడు. సర్పంచ్, జడ్పీటీసీ పని చేసిన కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు.. దాదాపు 200 మందినిపైగా చంపారని స్థానికులే చెబుతారు. చివరికి బంధువుల చేతిలోనే ఆయన హత్యకు గురయ్యారు.

Also Read : నాడు విద్యావేత్త.. నేడు మోసగాడు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp