భారతీయుడి మూడో కూటమి రెడీ!

By Mavuri S Feb. 27, 2021, 09:00 pm IST
భారతీయుడి మూడో కూటమి రెడీ!

థర్డ్ ఫ్రంట్. ఈ మాట తరచూ దేశ రాజకీయాల్లో వినిపించడం పరిపాటి. అయితే ఈ సారి మూడో కూటమి తమిళనాడు రాజకీయాల్లో ముందుకొచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కొత్త పొత్తులు, కూటములు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సినీ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలో మూడో కూటమి అంటూ కొత్త పొత్తుల రాగం తమిళనాడులో సిద్ధం అయ్యింది.

కనీస ప్రభావం చూపాలని
నిన్న మొన్నటి వరకు అగ్ర కథానాయకుడు రజిని రాజకీయ ఆరంగేట్రం మీద కోటి ఆశలు పెట్టుకున్న కమల్ హాసన్ ఇప్పుడు మరో దారి వెతుక్కుంటూ ఉన్నారు. మక్కల్ నీది మయ్యమ్ తో కలిసి వచ్చే నాయకులను, పార్టీలనూ దగ్గరకి తీసుకుంటున్నారు. కమల్ హాసన్ 2018లో పార్టీ పెట్టిన తర్వాత వస్తున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కచ్చితంగా తగిన ప్రభావం చూపాలని కమల్ ఆరాటపడుతున్నారు. దీంతో తనకు పరిచయం ఉన్నా సినీ నటులతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టకపోయినా అప్పటికీ రజనీకాంత్ మద్దతు అవసరం అని, దాని కోసం ఇటీవల కోరినా ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

చేతులు కలిపిన శరత్ కుమార్
కమల్ హాసన్ తో తాజాగా సినీ నటుడు ఆలిండియా సముత్వ మక్కల్ కట్చి పార్టీ నాయకుడు శరత్ కుమార్ చెన్నైలో శనివారం కలిశారు. మరోపక్క ఇందిరా జనన యాగ కట్చి ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల ప్రతినిధులతో చర్చించి మూడో కూటమి తయారు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

మూడో కూటమికి తానే సీఎం అభ్యర్థిని కాదని కూడా స్పష్టం చేశారు. మూడు పార్టీల ప్రతినిధులతో కలిసి మార్చి 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని, మార్చి ఏడో తేదీ నాటికి తొలి విడత అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తామని వేగవంతమైన ప్రకటనలు శనివారం చేశారు.

పాండిచ్చేరి మీద దృష్టి
ఒకవైపు మూడో కూటమి ఏర్పాటు చేస్తున్నామని కమల్హాసన్ చెబుతూనే రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి పనుల కోసం తాను ఎంత వరకు తగ్గడానికి అయినా, ఎవరితో మాట్లాడడానికి అయినా సిద్ధం అని పేర్కొన్నారు. కుదిరితే అన్నాడీఎంకే, డిఎంకె, శశికళ తో కూడా కలిసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కమల్ చెప్పినట్లు అయింది.

మరోపక్క తమిళనాడుకు ఆనుకొని వుండే పాండిచ్చేరిలో సైతం ఖచ్చితంగా పోటీలో ఉండాలని కమల్ భావిస్తున్నట్లు సమాచారం. పాండిచ్చేరిలోని 30 స్థానాల్లోనూ కమల్ పార్టీ తరఫున లేదా మూడో కూటమి తరపున అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కమల్ ప్రయత్నిస్తున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి కమల్ తెరమీదకు తెచ్చిన ఈ మూడో కూటమి తమిళనాడు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపుతుంది? ఎన్ని స్థానాల్లో కనీస ఓట్లు రాబట్టుకుంది అన్నది త్వరలోనే తేలనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp