వెలుగులోకి మరో భూ అక్రమం - కామారెడ్డి ఆర్డీవో సస్పెండ్

By Kiran.G Sep. 16, 2020, 07:32 am IST
వెలుగులోకి మరో భూ అక్రమం - కామారెడ్డి ఆర్డీవో సస్పెండ్

మొన్న కీసర ఎమ్మార్వో నాగరాజు, నిన్న మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, నేడు కామారెడ్డి ఆర్డీవో జి. నరేందర్.. కొందరు అధికారుల ముసుగులో యథేచ్ఛగా పాల్పడిన భూ అక్రమాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నలుగురికి కట్టబెట్టినట్లు ఆధారాలు లభించడంతో కామారెడ్డి ఆర్డీవో జి. నరేందర్ తో పాటుగా డిప్యూటీ తహసీల్దారు కె.నారాయణనూ సస్పెండ్ చేశారు. వీరితో పాటుగా
ఖాజీపల్లి వీఆర్వో జె.వెంకటేశ్వర్‌రావు, జిన్నారం ఆర్‌ఐ జి.విష్ణువర్ధన్‌, మండల సర్వేయర్‌ ఎన్‌.లింగారెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆర్‌.ఎం.ఈశ్వరప్ప, సూపరింటెండెంట్‌ సహదేవ్‌లపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.

భూ అక్రమం వెనుక ఉన్న నేపథ్యం ఇది...

ప్రస్తుత కామారెడ్డి ఆర్డీవో జి. నరేందర్ గతంలో జిన్నారం మండలం తహసీల్దార్ గా పని చేసారు. ఆ సమయంలో ఖాజీపల్లిలోని సర్వే నెం.181లో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమ మార్గంలో కొందరు వ్యక్తులకు అప్పగించడానికి తెరతీశారు. అందులో భాగంగా 2013లో కాకుండా 2007 లోనే వీరికి భూమిని కేటాయించినట్లు దస్త్రాలను మార్చివేశారు.అప్పటికే మరణించిన తహసీల్దారు పరమేశ్వర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి ఎన్‌.నరేంద్రరావు, ఎం.మధులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున కేటాయించారు. అందుకోసం చనిపోయిన తహశీల్దార్ పరమేశ్వర్ సంతకాలను ఫోర్జరీ చేశారు.

ఇలా పట్టుబడ్డారు..

దస్త్రాలను తారుమారు చేసిన అనంతరం ఆ 20 ఎకరాల భూమికి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని 2019లో సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అర్జీ పెట్టారు. కానీ ఇక్కడే సదరు నిందితులు చిన్న పొరపాటు చేయడంతో పట్టుబడ్డారు. తాము వేసుకున్న ప్లాన్ కాగితం కూడా పొరపాటున ఆ అర్జీతో పాటు కలెక్టర్ కు పంపారు. ఆ ప్లాన్ లో తాము చేసిన అన్ని వివరాలు ఉన్నాయి. అంటే ఎవరి పేరుపై భూములు మార్చాలి, ఏ సంవత్సరం భూములు కేటాయించినట్లు నమోదు చేయాలి లాంటి వివరాలున్న ప్లాన్ పేపర్ కూడా కలెక్టర్ కు చేరడంతో ఈ వ్యవహారంపై విచారణ చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు.

విచారణలో ఆర్డీవోతో సహా పలువురు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతోపాటు, అక్రమ మార్గాల్లో పొందిన అసైన్‌మెంట్‌ పట్టాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp