జేసీకి షాక్‌.. మళ్లీ అరెస్ట్‌

By Kotireddy Palukuri Aug. 07, 2020, 06:48 pm IST
జేసీకి షాక్‌.. మళ్లీ అరెస్ట్‌

ఫోర్జరీ పత్రాలతో బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో 54 రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చిన 24 గంటల్లోపే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలకు షాక్‌ తగిలింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అనుచరులతో భారీ రెత్తును ర్యాలీగా తాడిపత్రి చేరుకున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి కోవిడ్‌ నిబంధనల కారణంగా కొన్ని వాహనాలను తాడిపత్రి వద్ద నిలిపివేశారు. ఆ సమయంలో సీఐ దేవేందర్‌పై దురుసుగా ప్రవర్తించిన జేసీపై సీఐ ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దానితోపాటు కడప రిమ్స్‌ పోలీసులు కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించిన ఘటనపై మరో కేసు పెట్టారు.

బుధవారం అనంతపురం జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో నిన్న గురువారం వారు విడుదలయ్యారు. షరతులతో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేసేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలు వచ్చారు. సంతకం పెట్టించుకున్న తర్వాత వారిని అక్కడే ఉంచిన పోలీసులు.. సీఐ దేవేందర్‌ను దూషించిన అభియోగాలపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వారిద్దరినీ ఈ రోజు శక్రవారం 6 గంటలకు అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల తర్వాత వారిని కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను విక్రయించిన కేసులో అనంతపురం జిల్లా కోర్టు జేసీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే దాదాపు 45 రోజుల తర్వాత హైకోర్టు కూడా బెయిల్‌ ఇవ్వలేమని చెబుతూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నేరం చాలా తీవ్రమైనదని, తాము విచారణ చేసి ఆదేశాలు ఇస్తే తీవ్ర ఇబ్బందులు పడతారని వ్యాఖ్యానించింది. సుప్రిం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వాహనాలను విక్రయించారని, ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆక్షేపించింది. కింద కోర్టుల్లో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడం బెటర్‌ అని సూచించింది.

ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కోర్టులో బెయిల్‌ తిరస్కరణ కావడంతో ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. షరతులతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా.. ర్యాలీలో చేసిన అతితో మళ్లీ జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడులు జైలుకు వెళ్లాల్సి వస్తోంది. తమ నాయకుడు జైలు నుంచి విడుదలయ్యారన్న ఆనందం జేసీ అనుచరులకు రోజు కూడా నిలవకపోవడం తమ స్వయంకృపరాధమే అనే భావనలో వారందరూ ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp