నిజాలు క‌క్కిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి!? ‌చంద్ర‌బాబు ఇప్పుడేమంటారో!!

By Kalyan.S Jul. 13, 2020, 08:20 pm IST
నిజాలు క‌క్కిన జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి!? ‌చంద్ర‌బాబు ఇప్పుడేమంటారో!!

"మాకేం తెలీద‌బ్బా... అంతా బ్రోక‌ర్లే జేసినారు.." అంటూ మొద‌ట్లో బుకాయించిన జేసీ దివాక‌ర్ రెడ్డి నేరం అంగీక‌రించాడా..? త‌ప్పు చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో ఒప్పుకున్నాడా..? అంటే అవున‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 154 బీఎస్‌–3 వాహనాలను తప్పుడు రిజిస్ట్రేష‌న్లతో బీఎస్‌–4 వాహనాలుగా మార్చి పలువురికి విక్రయించిన కేసులో తెలుగుదేశం పార్టీ నేత‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిలతో పాటు మరో నలుగురిపై క్రిమినల్‌ కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్‌ రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

జ‌రిగిందేమిటంటే...

సుప్రీం కోర్టు ఆదేశాల ప్ర‌కారం... 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–3 వాహనాల రిజిస్ట్రేష‌న్ల‌ను అధికారులు ర‌ద్దు చేశారు. అయిన‌ప్ప‌టికీ కాలం చెల్లిన బీఎస్‌–3 వాహనాలను...నాగాలాండ్‌లో జేసీ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 157 రవాణా వాహనాలను స్క్రాప్‌ కింద విక్రయించేందుకు ముందుకు రాగా... వీటిని తక్కువ ధరకు దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఇక్క‌డి వ‌ర‌కూ బాగానే ఉన్నా వాటిని బీఎస్‌–4గా పేర్కొంటూ నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఆ తర్వాత వీటిని అనంతపురం రవాణాశాఖ కార్యాలయం ద్వారా ఎన్‌ఓసీ తీసుకుని జిల్లాలో వాహ‌నాల‌ను న‌డిపించారు. కొన్ని వాహ‌నాల‌ను విక్ర‌యించారు కూడా.. వీటిపై రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వ‌చ్చాయి. దీనిపై వారు విచార‌ణ ప్రారంభించారు. నాగాలాండ్‌కు కూడా వెళ్లారు. దీంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్రమంగా తిరుగుతున్న ఈ వాహనాలను ఎక్కడికక్కడ పట్టుకుని సీజ్‌ చేశారు. నిందితుల‌పై కేసులు న‌మోదు చేశారు.

కీల‌క విష‌యాలు వెలుగులోకి..

ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్‌రెడ్డి, ఆయ‌న త‌న‌యుడిని క‌స్ట‌డీకి తీసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ "మేమేం చేయ‌లేదు.. మాకు తెలీదు.." అంటూ బుకాయించిన వారు ఇటీవ‌ల జ‌రిపిన విచార‌ణ‌లో నిజం ఒప్పుకున్న‌ట్లు తెలిసింది. అదేమిటంటే.. "స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ప్రభాకర్‌రెడ్డి చెన్నైకి చెందిన ముత్తుకుమార్‌ను సంప్రదించారు. నాగాలాండ్‌ ఆర్టీఏ బ్రోకర్‌ సంజయ్‌ ద్వారా వీరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారు. నాగాలాండ్‌కు తీసుకెళ్లకుండానే అక్కడ మొత్తం 154 వాహనాల రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇలా బీఎస్‌-3 వాహనాలను బీఎస్‌-4గా నమోదు చేయించారు. ఇందుకోసం ముత్తుకుమార్‌, సంజయ్‌లకు ప్రభాకర్‌రెడ్డిలకు భారీగా డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత జేసీ అనుచరుడు నాగేంద్ర నకిలీ పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్లు తయారు చేశారు. వీటితోనే ఎన్‌ఓసీ తీసకున్నారు. ఇలా ఫోర్జరీ చేసిన పత్రాలతో తెలంగాణ, కర్ణాటకలలో 8 వోల్వో బస్సులు, లారీలు విక్రయించారు. మొత్తం అశోక్‌ లేలాండ్‌కు చెందిన 154 వాహనాలను స్క్రాప్‌ కింద కొనుగోలు చేసి.. వాటిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు మార్చారు." ఈ మేర‌కు పోలీసులు నేర అంగీకార‌ప‌త్రం సేక‌రించిన‌ట్లు తెలిసింది.

చ‌ంద్ర‌బాబు ఇప్పుడేమంటారో..

అక్ర‌మాల కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిల‌ను పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు అండ్ కో ఓ రేంజ్ లో హ‌డావిడి చేసింది. ధ‌ర్నాలు, నినాదాల‌తో హ‌ల్ చ‌ల్ చేసింది. వారు శుద్ధ అమాయ‌కులు.. ఇవ‌న్నీ ప్ర‌భుత్వ అక్ర‌మ అరెస్టులంటూ.. స్టేట్ మెంట్లు ఇచ్చారు. నేరం చేసిన‌ట్లు వారు నిజం ఒప్పుకున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఏమంటారో.. తానా అంటే తందానా అంటే ప‌చ్చ బ్యాచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp