జగన్ కు జేసి అభినందనలు... టిడిపి నేతల్లో అయోమయం

By Phani Kumar May. 22, 2020, 08:45 am IST
జగన్ కు జేసి అభినందనలు... టిడిపి నేతల్లో అయోమయం

ప్రత్యర్ధుల నుండి ప్రశంసలు అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మొన్నేమో ఎంఎల్సీ బిటెక్ రవి. తాజాగా మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై ఇద్దరి నుండి అభినందనలు అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇద్దరు కూడా టిడిపిలో కీలక నేతలే. తాజాగా జేసీ మాట్లాడుతూ కరువు ప్రాంతాలకు నీటిని అందించేందుకు జగన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు జేసీ అభినందించారు.

రాయలసీమ అభివృద్ధికి జగన్ చిత్తశుద్దితో జీవో 203 తేవటం అభినందనీయమన్నారు. ఇదే ప్రాజెక్టు విషయంలో గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా చాలా కృషి చేసిన విషయాన్ని జేసీ గుర్తుచేశాడు. పనిలో పనిగా అమరావతి కోసం చేస్తున్న దీక్షలంతా వృధాయే అంటూ వ్యాఖ్యానించారు. అసలు టిడిపి నేతలు ఎందుకు దీక్షలు చేస్తున్నారో కూడా అర్ధం కావటం లేదన్నారు. సరే జగన్ పాలనపైన కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు. కోర్టులు ఎన్ని మొట్టికాయల వేస్తున్న ’మా జగన్’ లెక్క చేయటం లేదన్నాడు.

మొత్తానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు ఇద్దరు అభినందించటం మంచి పరిణామమనే చెప్పాలి. ప్రతిపక్షమంటే ప్రతిదీ వ్యతిరేకించటమని కాకుండా అంశాల వారీగా మద్దతు కూడా ఇస్తేనే నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను ఆశించినట్లుగా భావించాలి. రాజకీయ పార్టీలన్నాక ఒకదాన్ని మరోటి వ్యతిరేకించుకోవటం మామూలే. కానీ వ్యతిరేకించటంలో కూడా గుడ్డి వ్యతిరేకించకుండా కాస్త రాష్ట్ర ప్రయోజనాలను కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడే జనాల్లో కూడా పార్టీలకు మంచిపేరు వస్తుంది.

ఆమధ్య కడప జిల్లాకే చెందిన టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ కు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించం సంచలనంగా మారింది. రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఎవరు కృషి చేసినా వాళ్ళకు తన మద్దతుంటుందని రవి చెప్పటం టిడిపిలో కలకలం రేపింది. ఒకవైపు ప్రాజెక్టు విషయంలో నేతలెవరూ మాట్లాడవద్దని తెలంగాణా, ఏపి నేతలను చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒక్కో టిడిపి నేత జగన్ కు మద్దతు పలుకుతుండటం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp