భారత్ టెరెన్స్ మాక్స్వినీ - జతింద్రనాథ్ దాస్

By Krishna Babu Oct. 27, 2020, 10:20 pm IST
భారత్ టెరెన్స్ మాక్స్వినీ - జతింద్రనాథ్ దాస్

దేశ విముక్తి కోసం తెల్లవాడి పాలనలో హక్కుల కోసం జైలులో భగత్ సింగ్ తో పాటు నిరాహార దీక్ష చేసి 63వ రోజు ప్రాణాలు వదిలిన విప్లవ వీరుడు జతిన్ దాస్. కలకత్తాలో బంకీందాస్, సుహాసినీ దంపతులకు 27-10-1904 జన్మించిన జతిన్ దాస్ భవానీపూర్ మిత్రా పాటశాలలో మెట్రిక్యులేషన్ చదువు పూర్తి చేశారు. మహాత్మా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఉద్యమంలో పాల్గోన్న జతిన్ కలకత్తా బుర్రాబజార్ ప్రాంతంలో విదేశీ వస్త్రాలను తగలబెడుతూ పోలీసులకి చిక్కి హుగ్లీ జైలులో శిక్షను అనుభవించారు. అయితే ఆరోగ్యం పాడవడంతో జైలు అధికారులు జతిన్ ను విడిచిపెట్టారు. ఈ సమయంలోనే జతిన్ కు రాస్ బిహారీ బోస్ , సచింద్రనాత్ సన్యాల్ లాంటి విప్లవకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

జైలు నుంచి విడుదలైన తరువతా ఆరోగ్యం కుదుటపడటంతో 1922లో సుబర్బన్ కాలేజీలో ఆర్ట్స్ కోర్స్ లో జాయిన్ అయి ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. ఆ తరువాత 1924లో గ్రాడ్యువేషన్ కోసం విద్యాసాగర్ కాలేజీలో చేరారు. ఈ సమయంలో సీఆర్ దాస్ ఆధ్వర్యంలో సాగిన తారకేశ్వర్ సత్యాగ్రంలో పాల్గోన్నారు, 1923 లో వచ్చిన బెంగాల్ వరదలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సుభాష్ చంద్రబోస్ పరవేక్షణలో సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు.అలాగే 1924లో కరాయా ప్రాంతంలో జరిగిన హిందు ముస్లిం మత కలహాల్లో నష్టపోయిన వారికి సహాయక చర్యలు చేపట్టారు.

అప్పటీకే రాబిన్ అనే పేరుతో అనుశాలిని సమితి అనే విప్లవ సంస్థలో చురుకుగా ఉన్న జతిన్, సచింద్రనాథ సన్యల్ స్తాపించిన హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మి అనే విప్లవ సంస్థలో చేరి తెల్ల వాడి కంపెనీ మీద దోపిడీలు చేసి విప్లవ సంస్థలకి తుపాకులు డబ్బులు సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సమయంలోనే దక్షిణేశ్వర్ బాంబు కేసులో , కకోరి రైలు దోపిడి కేసులో బెంగాల్ ఆర్డినెన్స్ ద్వారా అరెస్టు అయి హక్కుల కోసం మైమన్సింగ్ ( నేడు బంగ్లాదేశ్) జైలులో 23 రోజులు నిరాహారా దీక్ష చేసి హక్కులు సాధించుకున్న పట్టుదల కలిగిన వీరుడు. ఇతను కాలేజిలో అందరికన్న అపార విజ్ఞానం కలిగిన వ్యక్తి, బాంబుల తయారీలో నేర్పరిగా విప్లవ పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు.

హిందుస్తాన్ సోషలిష్టిక్ రిపబ్లికన్ ఆర్మీ ముఖ్య సభ్యుడిగా ఉన్న భగత్ సింగ్, సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న లాలాలజపతిరాయి హత్యకు ప్రతీకారంగా సాండర్స్ అనే పోలీసు అధికారిని హత్యచేసి లాహోరు నుండి కలకత్తా చేరుకున్నారు. ఆ సమయంలోనే సహచర విప్లవ సభ్యుడైన జతిన్ దాస్ ని హజారా బజార్ లో కలుసుకున్నారు. తనకి బాంబు తయారీ పద్దతిని నేర్పమని జతిన్ దాస్ కోరి ఒప్పించి ఆగ్రాలోని ఒక ఇల్లుని అద్దెకు తీసుకుని దానిని బాంబు ఫ్యాక్టరీ గా మార్చి విప్లవ పార్టీ సభ్యులు అందరు అక్కడ జతిన్ దాస్ ఆధ్వర్యంలో బాంబుల తయారీ నేర్చుకున్నారు. తరువాత అక్కడ నుండి విప్లవ సభ్యులు అందరూ దేశంలోని వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళి బాంబుల ఫ్యాక్టరీలు స్థాపించారు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్ కార్మిక తగువుల చట్టం, ప్రజా సంరక్షణ చట్టం లాంటి నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు వేసారు, ఈ బాంబు ఫార్ములా జతిన్ దాస్ దగ్గర నేర్చుకున్నదే.

అసెంబ్లీలో బట్టుకేశ్వర్ దత్ తో కలిసి బాంబులు వేసిన భగత్ సింగ్ స్వచ్ఛందంగా పట్టునడిన తరువాత, విప్లవ పార్టీ సభ్యులు ఒక్కొక్కరుగా పోలీసులకి దొరికిపోగా జతిన్ దాస్ 1929 జూన్ 14 న కలకత్తాలో అరెస్టు అయ్యారు. అరెస్టు తర్వాత లాహోర్ కు తీసుకురాబడ్డ జతిన్ అప్పటికే జైలులో ఉన్న భగత్ సింగ్ హక్కుల కోసం నిరాహార దీక్షలో ఉన్నారని తెలుసుకున్నారు. భగత్ సింగ్ దీక్షకు మద్దతుగా మిగత సహచరులు కూడా నిరాహార దీక్షకి సంసిద్దం అవుతున్న సమయంలొ జతిందాస్ వాళ్ళకి ఒకసారి ఆలోచించమని ఇది తుపాకులు, బాంబుల కన్న చాలా ప్రమాదకరమని ఉరి తాడ్లకి తుపాకులకి నిమిషంలో చనిపొతాం ఇది రోజు రోజుకి క్రుంగిపొయి చనిపొతాం మధ్యలో తట్టుకొలేక ఆపివేస్తే మనమీద దేశ ప్రజలకి అపనమ్మకం ఏర్పడుతుంది అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు అని వాళ్ళని హెచ్చరించారు.

విప్లవ సభ్యులందరూ భగత్ సింగ్ నిరాహార దీక్షకి మద్దతు గా హక్కుల కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. మొదట్లొ పొలీసులు చినపిల్లల చేష్టలుగా పట్టించుకోలేదు.15 రోజుల తరువాత తీవ్రత చూసి బలవంతంగా ముక్కులొకి గొట్టాలు వేసి పాలు పోసి నిరాహార దీక్షను భగ్నం చేయాలని చూసినా వారి పంటి బిగువున ఓర్చుకుని పోలీసుల ప్రయత్నాన్ని విఫలం చేశారు. దేశ అగ్రనాయకులైన బోసు, జిన్నా, నెహ్రు, మాదన్మోహన్ మాలవ్యా, పటేల్ వంటి వారు మద్దతు పలికారు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

నిరాహార దీక్ష 60వ రోజుకు చేరే సరికి జతిందాస్ పరిస్తితి విషమించింది. ఇది ప్రభుత్వం గమనించి జైలు అధికారులకు షరతలు లేకుండా జతిన్ ని విడుదల చేయమని ఆదేశాలు పంపింది. బ్రిటీష్ ప్రభుత్వం లాహోరు కుట్ర కేసుని కూడా జతిందాస్ మీద ఎత్తివేస్తామని ప్రటన పంపింది -- అలా వచ్చిన వారితో జతిన్ " ప్రభుత్వం మా డిమాండ్లకు అంగీకరించిందా" ? అని మాత్రమే అడిగాడు -- లేదు మిమ్మలని మాత్రమే విడుదలకి అంగీకరించింది అని చెప్పగా జతిన్ తిరస్కరించాడు. 62 వ రోజు జతిన్ మాత్రలు తీసుకోకపోతే బ్రతకడు అని డాక్టర్లు పోలీసులకి చెప్పారు. భగత్ సింగ్ చెబితే వింటాడని భగత్ సింగ్ ని పిలిపించారు. చెప్పినట్టుగానే భగత్ సింగ్ చెప్పగానే జతిన్ మాత్ర వెసుకొవటానికి ఒప్పుకున్నాడు.

జైలర్ మేము ఎంత చెప్పినా వినలేదు భగత్ సింగ్ చెబితే మారు మాట్లాడకుండా మాత్రలు వేసుకోవటానికి ఒప్పుకున్నావు ఎందుకు? అని అడగగా జతిన్ జైలర్ తొ " జైలర్ సాబ్ మీకు భగత్ సింగ్ గురించి తెలియదు భగత్ సింగ్ చాలా ధైర్యశాలి భగత్ సింగ్ చెబితే నేనేంటి ఈ దేశమే వింటుంది అని చిరునవ్వు చిందించాడు. 63 వ రోజు తన తమ్ముడు కిరణ్ దాస్ ఒక పక్కన "కాజి నజ్రూల్ ఇస్లాం పాడిన మన్ విప్లవ వీర్ అనే పాటని తన తమ్ముడు చేత పాడించుకుంటు , భగత్ సింగ్ ఒడిలొ తలపెట్టికుని మధ్యాహ్నం 1:05 నిమిషాలకి చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటీష్ ప్రభుత్వంతో హక్కుల కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించిన వారిలో ఐర్లాండ్ కు చెందిన టెర్రాన్ మాక్ స్వైనీ, భారత్ కు చందిన జతిన్ దాస్ ఇద్దరు బ్రిటీష్ నిరకుశ పాలనను ప్రపంచానికి చాటిచెప్పారు.

లాహొర్ నుండి కలకత్తాకి జతిన్ భౌతిక కాయానికి తరలించారు. దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడు లేని విధంగా లక్షలాది మంది అంతిమ యాత్రలో పాల్గొన్నారు. సుభాష్ చంద్రబొస్ గారు జతిన్ సుర్యుడు లాగా తూర్పున కలకత్తాలో పుట్టి పడమరన లాహొరులో అస్తమించాడని చెప్పారు. కియొరతోలా శ్మశానవాటికలో జతిన్ దహన సంస్కారాల అనంతరం మిగిలిన బూడిదను తీసుకుని వెళ్ళేందుకు ప్రజలు ఎగబడటంతో తొక్కిసలాట జరిందంటేనే ఆయన ప్రజల హృదయాలు ఏ స్థాయిలో గెలుచుకునారో అర్ధం చేసుకోవచ్చు. నేడు విప్లవ కెరటం జతిన్ దాస్ జన్మదినం సందర్భంగా స్మరిస్తూ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp