జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?

By Thati Ramesh Sep. 23, 2021, 04:10 pm IST
జలగం వెంగళరావు కుటుంబం రాజకీయంగా ఏమి చేస్తుంది ?

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కుటుంబం మాజీ సీఎం జలగం వెంగళరావుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు తర్వాత కేంద్రమంత్రిగా కూడా సేవలందించారు. కరుడుగట్టిన సమైక్యవాదిగా పేరున్న జలగం వెంగళరావు, నక్సలైట్ల పట్ల కూడా కఠినంగా వ్యవహరించి విప్లవ ఉద్యమాలను అణిచి వేశారనే ఆరోపణ కూడా ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన జలగం కుటుంబం ప్రస్తుతం ప్రత్యక్షరాజకీయాల్లో క్రీయాశీలకంగా లేదు. దాదాపు 60 ఏళ్ల పాటు రాష్ట్రంలో, ఖమ్మం జిల్లాలో పలు ఉన్నత పదువలు చేపట్టిన జలగం కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

‘జలగం’ ప్రస్థానం..

ఖమ్మం జిల్లాలోని సమీపంలోని బయ్యన్నగూడెం వెంగళరావు స్వస్థలం. అయితే ఆయన కుటుంబం ఆంధ్రప్రాంత నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో వెంగళరావు, ఆయన సోదరుడు కొండలరావు పాల్గొన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంగళరావు, మొదటసారి 1952లో వేంసూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత 1962లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. మూడు పర్యాయాలు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో 1969 -71 వరకు హోంమంత్రిగా పనిచేశారు. తర్వాత పీవీ నర్సింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో కూడా వెంగళరావు చోటు దక్కించుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా చాలా చురుకుగా వ్యవహరించారు. జై ఆంధ్ర ఉద్యమం తర్వాత రాష్ట్రంలో మారిన సమీకరణాల్లో భాగంగా ఆయన ను సీఎం పీఠం వరించింది. 4 సంవత్సరాల 2 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రెండు మార్లు ఖమ్మం లోక్ సభ నుంచి ఎంపీగా విజయం సాధించి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు.

వెంగళరావు తమ్ముడైన కొండలరావు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1957లో శాసనసభకు ఎన్నికైన కొండలరావు, ఖమ్మం ఎంపీ స్థానం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.

Also Read : తెలంగాణ‌లో చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

జలగం వారసులు..

జలగం వెంగళరావుకు ఇద్దరు కుమారులు. జలగం ప్రసాదరావు, జలగం వెంకటరావు. వీరి వ్యక్తిత్వాలు ప్రత్యేకమైనవి. ప్రసాదరావుకు మొండిఘటంగా పేరుంటే.. వెంకటరావుకు సాదుస్వభావిగా పేరుంది. ప్రసాదరావు దూకుడుగా వ్యవహరిస్తే.. వెంకటరావు, ఎమోషనల్లీ బ్యాలన్సడ్ పర్సన్.

జలగం ప్రసాదరావును సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు, ముద్దుగా పెదబాబు అని పిలుచుకుంటారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించిన ప్రసాదరావు, 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి చట్టసభ లో అడుగుపెట్టారు. తర్వాత 1989లో మళ్లీ గెలిచిన ప్రసాదరావు, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కేబినెట్లో పంచాయతీ రాజ్ శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ప్రసాదరావు ఓటమి చెందారు. తర్వాత కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురై .. బ్యాలెట్ ఫైట్ కు కొన్ని ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు. 2018లో టీఆర్ఎస్ లో చేరారు. కానీ రాజకీయాల్లో మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా లేరు.

చినబాబుది సెపరేట్ స్టైల్..

జలగం వెంగళరావు చిన్నకుమారుడైన వెంకటరావు విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా స్థాపించారు. 2003లో రాజకీయాల్లోకి వచ్చారు. ‘తరం తరం నిరంతరం జలగం సేవలు అనే నినాదంతో బ్యాలెట్ ఫైట్ స్టార్ట్ చేసిన వెంకటరావు.. 2004లో సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును ఓడించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

తర్వాత 2009లో సత్తుపల్లి ఎస్వీ రిజర్వుడు నియోజకవర్గంగా మారడంతో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే 2009లో కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వకపోవడంతో స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ తరఫున విజయం సాధించారు. రాజకీయ పోరాటంలో భాగంగా అన్నదమ్ములు ఇద్దరూ తమ్మల పోటీ చేశారు.

Also Read : కొడాలి మీదికి వంగవీటి అస్త్రం - బాబు మార్క్ వాడకం

మంత్రి పదవి జస్ట్ మిస్..

2014లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడు జిల్లాలో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే ఆయన ఒక్కరే. కానీ సామాజిక సమీకరణల్లో భాగంగా మంత్రి కాలేకపోయారు. ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావు ను పార్టీలో చేర్చుకుని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కమ్మ సామాజికవర్గం అధికంగా ఉన్న ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే తుమ్మలకు ప్రాధాన్యమిచ్చారనే వాదన కూడా అప్పట్లో వినిపించింది.

2018లో జలగం వెంకటరావు కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. అప్పట నుంచి ఆయన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గానికి ఎప్పుడైనా వచ్చినా అది వ్యక్తిగత పర్యటనలో భాగమే. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు.

2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. తర్వాత టీఆర్ఎస్ కు మద్దతు తెలపారు. దీంతో ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ సారి కొత్తగూడెం నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.

పోటీ చేస్తారా..?

వచ్చే ఎన్నికల్లో జలగం వెంకటరావు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఎంపీగా పోటీ చేస్తారా..? లేదా ఎమ్మెల్యేగా చేస్తారా..? అనే విషయంపై క్లారిటీ కోసం జలగం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అభిమానులు, అనుచరులు ఉన్న జలగం వారసులు ప్రస్తుతం మాత్రం రాజకీయ పరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదు. టీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ.

Also Read : హుజూరాబాద్ లో ఈట‌ల‌కు షాక్ ఇచ్చే ప‌రిణామాలు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp