గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రాజా బంధువు....పార్టీ మద్దతుంటుందా ?

By Voleti Divakar Jan. 21, 2021, 07:21 am IST
గోదావరి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రాజా బంధువు....పార్టీ మద్దతుంటుందా ?

తూర్పుగోదావరి జిల్లాలో ఒకప్పుడు రాజకీయ చక్రం తిప్పిన దివంగత మాజీ మంత్రి, జన యోధుడు జక్కంపూడి రామ్మోహనరావు కుటుంబం గోదావరి జిల్లాల్లో క్రమంగా రాజకీయ ప్రాబల్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా రాజానగరం ఎమ్మెల్యేగా, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజాసేవలో తలమునకలయ్యారు.తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో , సంక్షేమ పథకాలతో ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్నారు.పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడు,జక్కంపూడి రామ్మోహనరావు వియ్యంకులు.

తాజాగా జక్కంపూడి మరో వియ్యంకుడు, రాజా మామగారు గంధం నారాయణరావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాల్లో పాల్గొన్న నారాయణరావు అనంతరం అధ్యాపకుడిగా సుమారు 34 సంవత్సరాల పాటు వివిధ ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన చేశారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ఆయన మండల స్థాయి నుంచి జిల్లా వరకు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే అధ్యాపక సంఘం నాయకుడిగా రాష్ట్రస్థాయి ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు.

ఆదికవి నన్నయ్య యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పిజి కళాశాలల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన అధ్యాపకులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఇప్పటికీ కృషిచేస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రభుత్వ సహకారంతో సిపిఎస్ రద్దు, సర్వీస్ రూల్స్ సమస్యలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు రంగ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ, ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు, ప్రభుత్వ, మున్సిపల్, ఆదర్శ, గురుకుల, కెజిబివి పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని నారాయణరావు హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ కానున్న రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు మార్చి 9న జరుగుతాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతాయి. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి నుంచి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గంలో యుటిఎఫ్ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వరుసగా యుటిఎఫ్ అభ్యర్థులు రాము సూర్యారావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు.

రాము సూర్యారావు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా, వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తాజా ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఇప్పటికే యుటిఎఫ్ అభ్యర్థిగా షేక్ సాబ్జీని అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్రాపధ్యాయ సంఘం మద్దతుతో గంధం నారాయణరావు ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. 

ఆయన అల్లుడు రాజా ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపికి అనుబంధంగా వైఎస్సార్ సిపి ఉపాధ్యాయ సంఘం ఉంది. ఆ సంఘం తరుపున అభ్యర్థి బరిలో నిలిచే అవకాశాలు లేకపోవడంతో నారాయణరావుకు మద్దతు పలుకుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. అలాగే జక్కంపూడి, కొత్త పల్లి సుబ్బారాయుడుల పలుకుబడి, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల సంఘం ద్వారా చేసిన సేవలు తనకు కలిసి వస్తాయని నారాయణరావు ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నారాయణరావు నెగ్గితే యుటిఎఫ్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన చరిత్రను సృష్టిస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp