Jagananna Thodu Launch - చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

By Aditya Oct. 19, 2021, 08:30 pm IST
Jagananna Thodu Launch - చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారికి అధిక వడ్డీల భారం తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం వడ్డీ అందనుంది. కార్యక్రమంలో భాగంగా లబ్ధి దారుల వడ్డీ సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేయనున్నారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి రూ.16.36 కోట్లు లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడత జగనన్న తోడు కింద రుణాలు తీసుకుని సెప్టెంబర్ 30లోగా సకాలంలో చెల్లించిన  4.5 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 9.05 లక్షల మందికి రూ.950 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది.

చిరు వ్యాపారులకు అండగా..

చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు, హస్తకళా వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ప్రతి ఒక్కరికి ఏటా రూ.10వేల వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి లభించనుంది. అయితే తీసుకున్న రుణం చెల్లిస్తేనే తిరిగి రుణం తీసుకొనే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది.

ఎంపిక ఇలా..

ఈ పథకం లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నారు. వడ్డీ లేని రుణానికి దరఖాస్తును గ్రామ/ వార్డు సచివాలయంలో అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులపై గ్రామ వలంటీర్లు సర్వే చేసి అర్హుల జాబితా రూపొందిస్తారు. దీన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. బ్యాంకర్లతో సమన్వయం కోసం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు జారీచేస్తారు. బ్యాంకు ఖాతా తెరవడం నుంచి రుణాలు ఇప్పించే వరకు వలంటీర్లు సహకరిస్తారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక పోర్టల్ నిర్వహిస్తోంది. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలియజేసేందుకు 1902 టోల్ నంబరు ఏర్పాటు చేసింది.

చెల్లింపులు ఇలా.

లబ్ధిదారులు బ్యాంకు నుంచి పొందిన రుణానికి కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేస్తుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్లీ వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఇప్పటి వరకు జగనన్న తోడు పథకం కింద 9,05,458 మంది చిరు వ్యాపారులకు రూ.905 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందజేసింది.

కరోనా వేళ కొండంత అండ..

కరోనా దెబ్బకు బతుకు బండి తలకిందులై దిక్కుతోచని చిరు వ్యాపారులకు ఈ పథకం కొండంత అండగా నిలిచింది. కాళ్లు అరిగేలా వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా, అధిక వడ్డీ భారం లేకుండా వారంతా తమ వ్యాపారాలను తిరిగి నిలబెట్టుకునేందుకు దోహదం చేసింది.

వ్యాపారుల ధన్యవాదాలు

క్రమం తప్పకుండా వడ్డీ జమ చేస్తున్న ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని వ్యాపారులు ధన్యవాదాలు చెబుతున్నారు. తమలాంటి వారి కోసం ముందుచూపుతో ఇటువంటి పథకాన్ని ప్రవేశ పెట్టడమే కాక చిత్తశుద్ధితో అమలు చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : YSR Vahana Mitra - పన్నుల భారం తీరింది.. బతుకు బండికి భరోసా దొరికింది..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp