బాబు మాట - జగన్ మేనిఫెస్టోలో వికేంద్రీకరణ మాట లేదంట.

By Krishna Babu Aug. 06, 2020, 10:20 am IST
బాబు మాట - జగన్ మేనిఫెస్టోలో వికేంద్రీకరణ మాట లేదంట.

నేను నూరు అబద్దాలు అయినా ఆడుతాను కానీ నా ప్రత్యర్ధికి అక్షరం పొల్లుపోయినా నేను ఒప్పుకోను అన్నట్టు ఉంది చంద్రబాబు వ్యవహారం. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల పై ఎన్ని పిల్లిమొగ్గలు వేశారో , ఎన్ని యూ-టర్నులు తీసుకున్నారో వేరే చెప్పనక్కరలేదు. రైతు రుణమాఫీ దగ్గర నుండి ఇంటికొక ఉద్యోగం వరకు తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన 600 పై చిలుకు హామీల్లో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చని చంద్రబాబు నేడు సత్యహరిచ్ఛంద్రుడి అవతారం ఎత్తినట్టు తన మాటలతో మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గడిచిన ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన తప్పిదాలు, మార్చిన మాటల వలన పూర్తిగా విసిగిపోయిన ప్రజలు అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకునే తెలుగుదేశం నాయకుడు ఊహించని విధంగా చరిత్రలో ఎరుగని ఓటమిని బహుమానంగా ఇచ్చారు. అలాగే అప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ ఐదేళ్ళ పనితనాన్ని, నిబద్దతను, సమస్యపై నిలబడే తత్వమును చూసి ఇప్పటి వరకు తెలుగునేల ఎరుగని అఖండ విజయాన్ని కట్టబెట్టి రాష్ట్ర పాలనా పగ్గాలు ఆయన చేతికి ఇచ్చారు ప్రజలు . సరిగ్గా ఇక్కడే చంద్రబాబు ప్రజల్లో తాను ఏం కోల్పోయానో, జగన్ ఏం సంపాధించాడో బేరీజు వేసుకునట్టు కనిపిస్తుంది. జగన్ మాట మీద నిలబడే విశ్వసనీయతపై దెబ్బకోట్టే ప్రయత్నాలు ఎన్నికలు అయిన మరుక్షణం నుండే మొదలు పెట్టారు.

చంద్రబాబు రచించిన ఈ ప్రణాళికలకు ఆయనకు వంతపాడే ఒక వర్గం మీడియా తన వంతు పాత్ర పోషించడం మొదలు పెట్టాయి. జగన్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయి ఇప్పటికే మానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 90% హామీలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే తెలుగుదేశం దానికి వత్తాసు పలికే ఒక వర్గ మీడియా మాత్రం జగన్ ఇచ్చిన హామీలపై విష ప్రచారం చేయడం , మానిఫెస్టోలో లేనిది ఉన్నట్టు , ఉన్నది జగన్ చేయనట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

ఉదాహరణ కి జగన్ మానిఫెస్టోలో రైతులకి వైయస్సార్ రైతు భరోసా పధకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్ళు పూర్తి అయ్యే సరికి 50 వేలు ఇస్తాం అని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినా, దానిని అమలులోకి తెచ్చేసరికి చెప్పిన దానికన్న ఎక్కువ గానే పెట్టుబడి సాయం కింద 13,500 ఇస్తూ 5ఏళ్ళకు పెంచారు. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. అయితే తెలుగుదేశం మాత్రం మానిఫెస్టోలో 50వేలు అని చెప్పి 12,500 ఇవ్వడం ఏంటి? అని వక్రీకరించే ప్రయత్నం చేసింది. అలాగే పించన్ విషయం చూసుకున్నా ఎన్నికల ముందు జగన్ ఇప్పుడు ఇచ్చే 2వేల రూపాయల నుండి అవ్వా తాతలకు 3వేల వరకు పెంచుకుంటూ పోతాం అని మానిఫెస్టోలో చెప్పినా జగన్ గెలవగానే పించన్ 3వేలు చేయకుండా మాట తప్పాడు అనే అసత్య ప్రచారానికి తెరలేపారు.

ఇక మూడవ ప్రచారం చూస్తే జగన్ పాదయాత్ర సమయంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు 45ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం అని ప్రకటించారని అది అమలు చేయలేదని బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం చూస్తే జగన్ అదే పాదయాత్రలో వెనకబడిన వర్గాల మహిళలకు 45ఏళ్ళకే పించన్ అంటే పలువురు విమర్శిస్తున్నారని , కానీ కచ్చితంగా వారికి మంచి చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి వారి కోసం పించన్ బదులు వైయస్సార్ చేయూత అనే కొత్త పధకం ద్వారా ఆ మహిళలకు 5 ఏళ్ళలో 75వేలు వచ్చేలా చేస్తాం అని ప్రకటించి దానినే మానిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కానీ నిజాలను దాచిపెట్టి జగన్ విశ్వసనీయత పై దాడి చేసే ప్రయత్నం తెలుగుదేశం చేసింది.

ఇదే ఒరవడిలో ఇక తాజాగ తెలుగుదేశం ఎత్తుక్కున్న మరో అంశం అభివృద్ది వికేంద్రీకరణ. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఎలాంటి నిర్లక్ష్యానికి గురికాకుండా సమాంతరంగా అభివృద్ది జరగాలని , సమన్యాయం చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ఎంచుకున్న మార్గం పరిపాలన వికేంద్రీకరణ . ఇందులో భాగంగానే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా , కర్నులును న్యాయ రాజధానిగా , ప్రస్తుతం ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ వికేంద్రీకరణ అంశం జగన్ ముందుగా ఎక్కడా చెప్పకుండా ప్రజలని ముఖ్యంగా రాజధాని ప్రాంత ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని. చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు అన్ని విపక్షాలు ఆ వర్గపు మీడియా బలంగా వాదిస్తుంది.

నిజానికి జగన్ ఈ వికేంద్రీకరణ అంశాన్ని తాను ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచే ఎన్నికలకు వెళ్లారనే వాస్థవాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి జగన్ మాట తప్పాడు అంటు బురదజల్లే ప్రయత్నం చేస్తూ వస్తుంది విపక్షం . జగన్ మానిఫెస్టోలో సుపరిపాలన అనే దగ్గర 4వ పాయింట్ గా అభివృద్ది వికేంద్రీకరణ విషయాన్ని ప్రస్తావించారు. రాజధానిని అందరికి ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా ఫ్రీ జోన్ గా గుర్తిస్తు నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ది చేస్తాం అని పొందుపరిచారు. ఇచ్చిన హామీ ప్రకారం అమరావతితో పాటు మరో రెండు ప్రాంతాల అభివృద్దికి శ్రీకారం చుడితే దానిని తెలుగుదేశం పెడార్ధాలు తీస్తూ రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటే అన్న చందంగా ప్రవర్తిస్తుంది.

ఇలా చెప్పుకుంటు పోతే చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల దగ్గర నుంచి, తాను తయారు చేసుకున్న సొంత పాలసీల వరకు ఎందులోను ఏనాడు మాట మీద నిలబడకపోయినా, ప్రతిపక్షనేత చేస్తున్న పనుల్లో పొల్లు పోయిందని లేని తప్పులు దొర్లాయంటూ జగన్ మానిఫెస్టో పై అసత్యాలు ప్రచారం చేయడం 40ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడిని అని చెప్పుకునే బాబుకి నిత్యం అలవాటుగా మారింది . జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతే మానిఫెస్టోలకు ఒక విలువ వచ్చిందనేది కాదనలేని సత్యం అని. చంద్రబాబు హయాములో హామీలు నెరవేర్చకుండా ప్రజల నుండి తప్పించుకునేందుకు మానిఫెస్టో ని ప్రజలకి అందుబాటులో లేకుండా అన్ని చోట్ల కనపడకుండా చేశారని, కాని నేడు జగన్ నాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రజలందరికి మానిఫెస్టోని ఎప్పటికప్పుడు చూసుకునేందుకు అందుబాటులోకి తెచ్చారని, ప్రతి ఒక్కరి చేతిలో మానిఫెస్టో ఉన్న సమయంలో చంద్రబాబు దానిపై అసత్య ప్రచారం చేయడం రాజకీయంగా చంద్రబాబు చేస్తున్న మరో అతి పెద్ద తప్పు అనేది విశ్లేషకుల మాట.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp