బీసీ జనాభా లెక్కలకు వైఎస్ జగన్ మొగ్గు, అసెంబ్లీ తీర్మానం చేసే ఆలోచన

By Raju VS Oct. 13, 2021, 12:45 pm IST
బీసీ జనాభా లెక్కలకు వైఎస్ జగన్ మొగ్గు, అసెంబ్లీ తీర్మానం చేసే ఆలోచన

దేశంలో ప్రతీ ఏటా జనాభా లెక్కల సందర్భంగా కులాల వారీగా వివరాల సేకరణ అంశంపై చర్చ సాగుతోంది. కానీ అధికార పార్టీలు దానికి అంగీకరించడం లేదు. విపక్షంలో ఉండగా 2010లో బీసీ జనాభా లెక్కల కోసం పట్టుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో అది సముచితం కాదని చెబుతోంది. దాని మూలంగా సమస్యలు వస్తాయని కూడా అంటోంది. ప్రతిపక్షంలో ఉండగా బీసీ జనాభా లెక్కలు తేల్చాల్సిందేనని పట్టుబట్టి, ఇప్పుడు దానికి భిన్నంగా వాదించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కానీ బీజేపీ నేతలు మాత్రం తమ అభిప్రాయానికి అనుగుణంగా వివిధ రకాల వాదనలు ముందుకు తెస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఓబీసీ లెక్కలు తేల్చాల్సిందేనని ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. బీహార్ లో అధికార, ప్రతిపక్షాలన్నీ కలిసి సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో పీఎంకి వినతిపత్రం అందించాయి. వాస్తవానికి బీహార్ లో బీజేపీ మిత్రపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో బీజేపీదే మేజర్ రోల్. అయినా అక్కడి బీజేపీ నేతలు కూడా బీసీ జనాభా లెక్కలు కావాలని డిమాండ్ చేస్తూ అన్ని పార్టీలతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లారు. బీహార్ బీజేపీ నేతలు ఓబీసీ లెక్కలు తేల్చాల్సిందేనని కోరుతుండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించడం విశేషంగానే చూడాలి.

Also Read : జ‌గ‌న్ ను కాద‌ని.. ప‌వ‌న్ ను సీఎం చేసే చాన్స్ ఉందా?

తాజాగా తెలంగాణా సర్కారు కూడా బీసీల జనాభా వివరాలు కూడా సేకరించాలని కోరింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా ఏకగ్రీవంగా తీర్మానం ఆమోందించారు. తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దానిని అంగీకరించడం గమనార్హం. 1931లో బ్రిటీష్ వారి హయంలో సేకరించిన జనాభా లెక్కలు తప్ప గడిచిన 90 ఏళ్లుగా ఏ కులం లెక్కలు ఎంత అన్నది స్పష్టత లేదు. అందులోనూ ఆనాడు కేవలం దేశవ్యాప్తంగా 4300 కులాలున్నట్టు తేలగా 2011 జనగణనలో కులాల సంఖ్య 21లక్షలు దాటింది. కేవలం మహారాష్ట్రలోనే 2.3లక్షల కులాలున్నట్టు లెక్కల్లో పేర్కొన్నారు. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టత కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరిగా అన్ని కులాల లెక్కలు తేల్చాల్సిందేననే డిమాండ్ ముందుకొస్తోంది.

ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ కూడా దానిని బలపరిచేందుకు సిద్ధమవుతోంది. కులాల వారీగా జనాభా లెక్కలు సేకరిస్తే ఆ డేటా ప్రాతిపదికన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆస్కారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీలో ఇంటింటి సర్వే నిర్వహించినా ఆ లెక్కలు సమగ్రంగా లేకపోవడంతో సమస్య ఏర్పడింది. వాటిని ప్రభుత్వం అధికారికంగానూ ధృవీకరించలేదు. దాంతో జనాభా లెక్కల సందర్భంగానే పూర్తి వివరాలు తెలుసుకుంటే అందరికీ ఉపయోగం అనే విషయంలో సీఎం జగన్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం ఆమోదించేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్రానికి ప్రతిపాదించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏపీ సీఎం కూడా సిద్ధం కావడం విశేషం.

Also Read : తెగని పేచీ.. కేఆర్‌ఎంబీ గెజిట్‌ అమలుపై ఉత్కంఠ

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదిస్తున్న వేళ మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాల్లో ఎంబీసీలను ఉపయోగించుకుని ఎదిగిన బీజేపీకి బీసీల లెక్కల వివరాలు నష్టం చేస్తాయనే అభిప్రాయంతో రాజకీయంగా వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ తీర్మానం కూడా చేస్తే అది మరింత చర్చనీయాంశం అవుతుందనడంలో సందేహం లేదు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp