బాబు పెట్టిన బకాయిలు తీరుస్తున్న జగన్ సర్కారు

By Raju VS Sep. 24, 2020, 08:11 am IST
బాబు పెట్టిన బకాయిలు తీరుస్తున్న జగన్ సర్కారు

చంద్రబాబు చిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో సాధించానని ప్రచారం చేసుకునే బాబు ప్రభుత్వంలో బకాయిల విలువ అక్షరాల రూ.60వేల కోట్లు. కాంట్రాక్టర్లకు, ఇతరులకు చెల్లించాల్సిన అంత పెద్ద మొత్తం బకాయిలు చెల్లించకుండా వాయిదా వేస్తూ చివరకు ఖాళీ ఖజానా జగన్ కి అప్పగించారు. దానిని సర్థుబాటు చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికితోడుగా చంద్రబాబు చేసిన కార్యకలాపాల మూలంగా వచ్చి పడిన భారాన్ని సర్థుబాటు చేయాల్సి వస్తోంది.

చంద్రబాబు అత్యంత ఆర్భాటంగా చెప్పుకున్న పెట్టుబడుల సదస్సుకి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదు. 2017,18 లలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకి సంబంధించిన ప్రచారం కోసం చేసిన వ్యయం రూ. 8.63 కోట్లను ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఓవైపు ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బిల్లులు రాకపోవడంతో పలువురు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అదే సమయంలో కరోనా కారణంగా ఆదాయం పడిపోయి సమస్యలు ఏర్పడుతున్నాయి. కేంద్రం కూడా జీఎస్టీ బకాయిల చెల్లింపునకు ససేమీరా అంటోంది. కావాలంటే అప్పులు చేసుకోండి, అవకాశం ఇస్తామని అధికారికంగానే ప్రకటించింది.

ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్వహణ భారంగా మారుతున్నప్పటికీ జగన్ ఎక్కడా గగ్గోలు పెట్టకుండానే అంతా సమసిపోతుందనే ధీమాతో సాగుతున్నారు. సర్కారుని చక్కదిద్దే పనిలో ఉన్నారు. అయినప్పటికీ అప్పులు పెరిగిపోయాయంటూ టీడీపీ అనుకూల మీడియా రోజుకో వార్త వండి వారుస్తోంది. కానీ జగన్ బాధ్యతలు స్వీకరించేనాటికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఖజానా ఇచ్చిన సంగతిని విస్మరిస్తోంది. పైగా చంద్రబాబు అర లక్ష కోట్లకు పైగా బకాయిలతో బాధ్యతలు అప్పగించారనే సంగతి జనం గుర్తించకూడదని ఆశిస్తోంది.

కేవలం ప్రచారంతో పబ్బం గడుపుకున్న చంద్రబాబు తన ప్రచారం కోసం చేసిన వ్యయాన్ని కూడా చెల్లించకపోవడం చిత్రంగా కనిపిస్తోంది. దానికి తోడుగా పారిశ్రామక బకాయిలకు కూడా 2014 నుంచి మోక్షం కలిగించలేదు. ఏకంగా రూ. 4వేల కోట్ల మేరకు పెండింగ్ పెట్టారు. వాటిని కూడా విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అందుకు అనుగుణంగానే ప్రచారానికి సంబంధించిన పెండింగ్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మిగిలిన బకాయిలు కూడా క్రమంగా చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చేసిన స్థితి నుంచి పూర్తిగా గాడిలో పెట్టే పని సాగుతోందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp