ఏపీలో ఇ–పంట

By P. Kumar Jul. 12, 2020, 01:20 pm IST
ఏపీలో ఇ–పంట

రైతులకు మేలు చేకూర్చేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమంతో ముందుకొస్తోంది. సోమవారం రాష్ట్రంలో తొలిసారిగా ‘ఇ–పంట’ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇ–పంట విధానంలో రాష్ట్రంలో సాగయ్యే ఆక్వా సహా వివిధ రకాల పంటలను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. దీనికోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే సిబ్బందికి అవసరమైన శిక్షణను పూర్తి చేసింది.

పంటల పరిశీలన

ఇ–పంట కార్యక్రమం కింద వీఏఏ, వీహెచ్‌ఏ, ఆక్వా, పశు సంవర్థక సహాయకులు, గ్రామ సర్వేయర్, వీఆర్‌వో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంటలు నమోదు చేస్తారు. రైతును పొలంలో నిలబెట్టి ఫొటో తీసి రికార్డ్‌ చేస్తారు. చేపలు, రొయ్యల చెరువులను సర్వే చేసి వివరాలు నమోదు చేస్తారు.

ప్రామాణిక వివరాలు

మూడు సీజన్లలోనూ ఇ–పంట ద్వారా పంట వివరాలను నమోదుచేయనున్నారు. తద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు, ప్రభుత్వానికీ పారదర్శక చెల్లింపులు చేసే అవకాశం దక్కుతుంది. రాబోయే రోజుల్లో సున్నా వడ్డీ రుణాలు, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, కనీస మద్దతు ధర, ప్రకృతి విపత్తుల సహాయం తదితరాలకు ఇ–పంట డేటానే ప్రామాణికంగా తీసుకోనున్నారు. రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి లేదా 155251 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

బాధ్యులు

ఇ–పంట కార్యక్రమానికి గ్రామస్థాయిలో వీఆర్‌వో, వ్యవసాయ– అనుబంధ రంగాల సహాయకులు, గ్రామ సర్వేయర్‌ బాధ్యత వహిస్తారు. మండలస్థాయిలో తహశీల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. పంటల సమాచారాన్ని గ్రామాధికారుల వద్ద ఉండే ట్యాబ్‌ల ద్వారా ఇ–పంట యాప్‌లో నమోదు చేస్తారు. ప్రతి రికార్డును బయోమెట్రిక్‌ ద్వారా ఆమోదించాల్సి ఉంటుంది. నమోదు చేసిన వివరాలను గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తారు.

టైమ్‌ లైన్‌

ఖరీఫ్‌ పంట నమోదు ఈ నెల 13న ప్రారంభమై వచ్చే నెల 31న ముగియనుంది. రబీ పంటల నమోదు నవంబర్‌ 1న మొదలై అదే నెల 30న ముగుస్తుంది. మూడో పంట నమోదు మార్చి 1న మొదలై ఏప్రిల్‌ 30న ముగియనుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp