జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన- దిద్దుబాట్లు

By Ravuri.SG Dec. 02, 2019, 07:23 pm IST
జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన- దిద్దుబాట్లు

జగన్ ఆరు నెలల పాలనలో జరిగిన మంచి పనుల గురించి విశ్లేషణ -జగన్మోహన్ రెడ్డి-ఆరు నెలల పాలన-అభివృద్ధి,సంక్షేమం కు కొనసాగింపుగా ఈ ఆరు నెలల పాలనలో జరిగిన పొరపాట్ల మీద ,తప్పటడుగుల మీద విశ్లేషణ,

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మడమా ? లేక తెలుగుదేశం పార్టీ ఘోరమైన పరిపాలనా ? 2014 ఎన్నికల్లో చంద్రబాబు పదే పదే చెప్పిన 'అనుభవం' అన్న మాట పనిచేసినట్టే, ఈ ఎన్నికల్లో జగన్ ప్రతి చోటా కోరిన 'అవకాశం' అనే మాట పని చేసిందన్నది సుస్పష్టం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడుగులు వేస్తున్నా కొన్ని కొన్ని విషయాల్లో తప్పటడుగులు పడుతున్నాయి. వాటిని అంశాల వారీగా నిర్మొహమాటంగా చెప్పేవారు, నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేవారు జగన్ కోటరీలో ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. అలాంటివారు లేక గత ప్రభుత్వం ఎంత నష్టపోయిందో ఎవరికీ తెలియనిది కాదు.

అంశాల వారీగా ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు : రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడపడితే అక్కడ అధికారికంగా పార్టీ రంగులు పులుముతోంది. గుడిని, బడిని సైతం వదలట్లేదన్నది కొందరి ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు కొత్తగా రంగులు వేసుకోవడానికి అధికారికంగా నిధులు మంజూరు చేయడం, ఆదేశాలు జారీ చేయడం ప్రభుత్వం చేసినా కూడా దాని అర్ధం తమ పార్టీ రంగులు వేసుకోమని కాదు. దీని వెనుక అనధికార ఉత్తర్వులో, కార్యకర్తల అత్యుత్సాహమో, పార్టీ శ్రేణుల ఆధిపత్యధోరణో, ప్రతిపక్షాల కుట్రో - కారణాలు ఏమైనా కానీ దాని ప్రభావం పడేది మాత్రం ప్రభుత్వం మీదనే.

ఇవన్నీ ముఖ్యమంత్రికి కానీ, తమకు కానీ తెలియకుండా జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబితే అది అబద్దమే అవుతుంది. ఎక్కడో దేశంలో ఏదో జరిగితేనే క్షణాల్లో తెలుసుకునే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్న ఈ రోజుల్లో పార్టీ రంగుల గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వస్తున్న ట్రోలింగులు పార్టీ పెద్దల వరకు చేరకుండా అయితే ఉండవు. ఆయా ప్రాంతాల నాయకులు ఈ రంగుల వెనుక ఉన్న వారు ఎవరైనా సరే - అదుపు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇలాంటి విషయాల్లో ఏ పార్టీలకు చెందని తటస్థులకు ఏహ్యభావం కలిగితే YCPకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 

నాయకుల భాష : పార్టీలోని నాయకులు కొందరు తమ భాష మీద అదుపు లేకుండా మాట్లాడటం ప్రమాదకరం. రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. ఒక్క సారి నోరు జారిన మాటను వెనక్కు తీసుకోవడం అసాధ్యం. పార్టీ శ్రేణులు వాటిని కూడా వెనకేసుకొస్తూ 'గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎలా ప్రవర్తించారు ?' అంటూ ప్రశ్నిస్తూ ఆ నిముషానికి తమ వాదనను నెగ్గించుకుంటున్నారు కానీ పరోక్షంగా ఇది కూడా టీడీపీ చేసినలాంటి తప్పేనని ఒప్పుకుంటున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, తాము ఏం చేసినా కప్పిపుచ్చేందుకు తమ అనుకూల మీడియా ఉందన్న దురహంకారంతో, నోటికి అడ్డూ అదుపు లేకుండా అసెంబ్లీలో కూడా పరుష పదజాలం వాడారు కనుకనే ప్రజలకు అసహ్యం కలిగిందన్న విషయం విస్మరిస్తే ప్రభుత్వానికి ప్రమాదమే.

గత ప్రభుత్వంలో కోడెల శివప్రసాదరావు సభలో నిస్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ స్థానంలో ఉండి తెలుగుదేశం పార్టీ సభ్యుడి లాగే ప్రవర్తిస్తూ అప్పటి ప్రతిపక్షనాయకుడిని ప్రశ్నించిన విషయం ప్రజలకు బాగా గుర్తు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు,ఎమ్మెల్యేలు ,ఇతర నాయకులు మరియు స్పీకర్ మాట తీరు,ప్రవర్తన గత ప్రభుత్వాని కన్నాభిన్నంగా ఉందన్న నమ్మకం ప్రజలకు కలిగించాలి కానీ వీళ్ళు కూడా దాదాపు అదే రీతిగా ప్రవర్తిస్తే ప్రతిఫలంలో కూడా తేడా ఉండదు. స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నాయకుడు కూడా బాషా మీద అదుపు తప్పి మాట్లాడటం ఆశ్చర్యం,అంగీకారం కాదు.

Also Read : థాక్రే సంచలన వాఖ్యలు.. కూటమిలో కుమ్ములాటలు తప్పవా.?

పనుల్లో పురోగతి : రివర్స్ టెండర్లు,ఇసుక విధానం వలన ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. రివెర్స్ టెండర్ల వలన వందల కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేశారు . ఇది మంచిదే కానీ జగన్ ప్రభుత్వం ముందు పోలవరం,రాయలసీమ నీటి ప్రాజెక్టులు,రాజధాని లాంటి భారీ లక్ష్యాలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం 2024లో ఎన్నికలు జరుగుతాయి కానీ 2023 చివరి నాటికే పనులు అన్ని పూర్తయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. కేంద్రం నుంచి ఏమేర ఆర్ధిక మద్దతు దక్కుతుందో ఇప్పుడే ఒక అంచనాకు రావాలి.

శంకుస్థాపనలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వ మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది. ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు,చెప్పుకోవటానికి ఏ పెద్ద నిర్మాణం జరగలేదు. వర్షానికి నీరుకారిన రాజధాని తాత్కాలిక భవనాలను ప్రజలు ఇప్పటికి మర్చిపోలేదు.జగన్ ప్రభుత్వం మీద ప్రజలుకు చాలా అంచానాలు ఉన్నాయి,వాటిని అందుకోవాలంటే ఇప్పటి నుంచే యుద్ధప్రాతిపదికన పనిచేయాలి.

అసందర్భ ,అర్థరహిత ప్రసంగం : 'తెలుగుదేశం' పార్టీ అధికారంలో ఉండగా అనంతపురం జిల్లాలో 'కియా' మోటార్స్ ప్లాంట్ స్థాపించారు. నారా లోకేష్ స్వయంగా 'ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందుకే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మన రాష్ట్రానికి 'కియా' మోటార్స్ ఇచ్చారు' అని సభలోనే చెప్పారు. అదే విషయం ప్రతిపక్షంలో ఉండగా జగన్ కూడా ఒకానొక సందర్భంలో చెప్పినట్టున్నారు. మళ్ళీ ఆ విషయమై కియా ఇక్కడకు రావడానికి కారణం అప్పుడెప్పుడో వైఎస్సార్ కోరిక మేరకు ఇచ్చిన మాటేనని ఆ కియా ఎండీ ఉత్తరం రాశారని సభలో చెప్పడం హాస్యాస్పదం. ఆ ఉత్తరంలో అలా రాయడం వెనక కారణాలు ఏవైనా కానీ ఆ విషయంలో క్రెడిట్ వైఎస్సార్ కు ఆపాదించాలని చూడటం అర్ధరహితం.

నిజానిజాలు ఏవైనా కూడా ప్రస్తుతం హైదరాబాద్ 'హైటెక్ సిటీ' చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ అని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇప్పటికీ ప్రచారం చేస్తున్నట్టే 'కియా' మోటార్స్ కూడా చంద్రబాబు వల్లనే రాష్ట్రానికొచ్చిందని ప్రచారం చేసి చేసి అదే నిజమని నమ్మించేందుకు శాయాశక్తులా కృషి చేస్తారన్నది నిజం. చంద్రబాబు "అన్నిటికి నేనే ,అందరికి నేనే" అన్నప్రచారం దుష్ఫలితాలు మర్చిపోకూడదు.ఇలాంటి వాటి మీద అనవసర ప్రసంగాలు చేసి అభాసుపాలు అవ్వడం కన్నా ప్రజలు ఈ ప్రభుత్వం పేరు పదికాలాలు చెప్పుకునేలా కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి వచ్చేలా ప్రయత్నించడం ఉత్తమం.

Also Read : పవన్, ఇది సినిమా కాదు రాజకీయం

అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టడం : తెలుగుదేశం పార్టీ నూటికి నూరు శాతం ఘోరంగా ఓడిపోబోతోందని తెలిసినా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సానుభూతిపరుల వరకు అందరికీ ఏదో ఒక మూల ఫలితం మీద వారికే తెలియని ఒక చిన్న అనుమానం ఉండేది. దానికి కారణం - తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుకూల మీడియా, ఛానెళ్లు, ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసే పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు, వీళ్లందరినీ ఒక పద్దతిలో నడిపించే నాయకత్వం. ఆ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అభినందించి తీరాల్సిందే.

నిజానికీ 2019 ఎన్నికల ముందు సామాజిక మాధ్యమాల్లో పార్టీని బలపరిచి, ప్రచారం చేసేందుకు 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' నుంచి అధికారికంగా నియమించబడ్డ వారితో సరిసమానంగా స్వచ్ఛందంగా పోరాడినవారు ఉన్నారు, నిజానికీ ఎక్కువ ఉన్నారని చెప్పినా అతిశయోక్తి కాదు. ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ పనితీరు ఏ మాత్రం తగ్గకపోగా మరింత జోరు పెంచి మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ నేతలు తమ ప్రభుత్వం పైన వస్తున్న దుష్ప్రచారాన్ని మరింత సమర్ధంగా తిప్పికొట్టేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది.

ఇకపొతే - కారణాలు ఏవైనప్పటికీ 'అన్నా' క్యాంటీన్ల మూసివేత స్వాగతించదగ్గ నిర్ణయమైతే కాదు. అలాగే ఎన్టీఆర్ పేరున్న పథకాలకు జగన్ పేరు పెట్టడం వంటివి ప్రజలు హర్షించే విధంగా లేవు. సంక్షేమం పేరుతో రకరకాల పథకాలు రూపకల్పన చేశారు, డబ్బులు ఖర్చుపెడుతున్నారు. వీటిలో అపాత్రదానం ఏదో కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఐదేళ్ల పాటు ఈ 'నవరత్నాలు' అమలు చేయాలంటే ప్రభుత్వం కనీసం రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రభుత్వానికి అంత ఆదాయం ప్రస్తుతం ఎక్కడ నుంచి వస్తోందో, భవిష్యత్తులో ఏ వనరుల ద్వారా సమకూర్చబోతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది.

Also Read : కళ్ళలో కారం కొట్టి, కూరగాయలు తరిగే కత్తులతో కోర్టు హాలులో...

ప్రభుత్వపరంగా సరిదిద్దుకోవాల్సిన అంశాలు; పార్టీ పరంగా చక్కబెట్టాల్సిన విషయాలు; క్యాడర్ అత్యుత్సాహం వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి కలిగే నష్టాలు - ఇలా ఒకొక్కటిగా విభజించి అన్నిటినీ చక్కబెట్టి, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp