ఢిల్లీ లాయర్ వద్ద వందల కోట్లు , ఐటీ దాడులతో బండారం బయటకు

By Raju VS Oct. 16, 2020, 09:31 am IST
ఢిల్లీ లాయర్ వద్ద వందల కోట్లు , ఐటీ దాడులతో బండారం బయటకు

ఒకటి కాదు..రెండు కాదు, ఏకంగా 217 కోట్ల రూపాయలు..అది కూడా నగదు రూపంలో. ఓ న్యాయవాది వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో బయటపడిన ఆధారాలు కలకలం రేపుతున్నాయి. పన్ను ఎగువేత ఆరోపణల కేసు వ్యవహారంలో చండీఘడ్ కి చెందిన ఓ ప్రముఖ న్యాయవాది పట్టుబడినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రకటించారు.

సింగ్ అసోసియేట్స్ పేరుతో న్యాయవాద వృత్తిలో సాగుతున్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ అధ్యక్షుడితో ముడిపడిన ఈ వ్యవహారంలో పలువురు పెద్ద తలకాయల పాత్ర కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కే సింగ్ పాత్ర తో పాటుగా అతని అనుచరులు, ఇతర ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా ఐటీ శాఖ వద్ద ఉన్న ఆధారాలతో మరింత లోతుగా విచారణ సాగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి మీద సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తికి లేఖరాయటాన్ని ఢిల్లీ బార్ అసోసియేషన్ ఖండించిన నేపథ్యంలో ఈ దాడుల మీద తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి నెలకొన్నది. అయితే ఢిల్లీ బార్ కౌన్సిల్,ఢిల్లీ బార్ అసోసియేషన్ రెండు వేరు వేరు సంఘాలు. ప్రతి కోర్టుకు ఒక అసోసియేషన్ ఉంటుంది.ఆ కోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వొకేట్లు అందులో సభ్యత్వం తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో బార్ కౌన్సిల్ ఉంటుంది,దీని పరిధి విస్తృతమైనది. జగన్ కు వ్యతిరేకంగా ఢిల్లీ బార్ అసోసియేషన్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టీ ఆ అసోసియేషన్ న్యాయానికి, ధర్మానికి నిలువుటద్దం అనే స్థాయిలో అనుకూల మీడియా వార్తలు రాయటంతో నిన్న ఐటీ దాడులు జరిగిన ఎంకే సింగ్ కు సంబంధించినదని ఎక్కువమంది భావించారు.

Also Read:గీత దాటిందెవరు..దానిని తేల్చేదెవరు?

న్యాయవాదిపై వచ్చిన ఆరోపణలపై ఢిల్లీ, హర్యానా ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిపారు. ఏకకాలంలో 38 చోట్ల సోదాలు నిర్వహించారు. పన్ను చెల్లింపుల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేసే న్యాయవాది సంబంధిత ఆస్తులపై జరిపిన దాడుల్లో రూ. 5.5 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. అతనికి సంబంధించిన మరో 10 బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. అందులో ఇంకా పెద్ద మొత్తంలో నగదు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తన ఖాతాదారుల నుండి వారి వివాదాలను పరిష్కరించడానికోసమంటూ సదరు అడ్వకేట్ భారీ మొత్తంలో నగదును అందుకుంటున్నట్లు అనుమానించబడింది. రికార్డులకెక్కని నగదు లావాదేవీలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి అని ఐటీ విభాగం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) కి సంబంధించిన ఒక కేసులో న్యాయవాది ఒక క్లయింట్ నుండి రూ .117 కోట్లు నగదు రూపంలో అందుకున్నారని, అది కూడా చెక్ రూపంలో తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. కానీ తన రికార్డులలో కేవలం 21 కోట్ల రూపాలు మాత్రమే చూపించాడని ఐటీ అధికారులు చెబుతున్నారు. మరో కేసులో ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వం పేరుతో ఓ ఇంజనీరింగ్ సంస్థ నుండి ఏకంగా 100 కోట్ల రూపాయల నగదును అందుకున్నట్లు సిబిడిటి పేర్కొంది.

Also Read:దీనికీ లోకేషే కారణమా..?

భారీగా వసూలు చేసిన ఈ మొత్తాన్ని ఆస్తులు కూడబెట్టేందుకు వినియోగించినట్టు చెబుతోంది. నివాస, కమర్షియల్ భవనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించింది. తమకు లభించిన ఆధారాలను బట్టి చూస్తే సుమారు రూ. 100 కోట్ల ఆస్తులు బయటపడ్డాయని ఐటీ చెబుతోంది. తన సన్నిహితులతో కలిసి వివిధ చోట్ల పాఠశాలలు ప్రారంభించారు. వాటి విలువ మరో రూ. 100 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. హవాలా రూపంలో భారీగా నిధులు సేకరించినట్టు చెబుతున్నారు. నిందితుడి లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు సేకరించినట్టు చెబుతున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో ఉన్న వారి తీరు మీద చర్చ సాగుతోంది. రాజకీయ , వ్యాపార అనుబంధాలతో న్యాయనిపుణుల వ్యవహారాల మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ఆక్రమంలో ఓ న్యాయవాది చుట్టూ హవాలా పెద్ద మొత్తంలో సాగిన వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగిన ఈ విషయంలో ఎవరెవరి పాత్ర ఉందనేది ఆసక్తిగా కనిపిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp