రాజస్తాన్ రాజకీయాల్లో ఐటీ ప్రకంపనలు, బీజేపీ ఎత్తుగడ అంటున్న పాలకపక్షం

By Raju VS Jul. 13, 2020, 02:39 pm IST
రాజస్తాన్ రాజకీయాల్లో ఐటీ ప్రకంపనలు, బీజేపీ ఎత్తుగడ అంటున్న పాలకపక్షం

రాజస్తాన్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ ఆశలు నెరవేరుతాయా లేదా అన్నది సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఊగిసలాటలో ఉన్న సమయంలో మరోసారి మధ్యప్రదేశ్ పరిణామాలు పునరావృతం చేయాలని బీజేపీ ఆశించింది. దానికి అనుగుణంగా పావులు కదిపింది. కానీ సచిన్ పైలట్ తీరుతో బీజేపీ ఆశలకు గండిపడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రాజకీయంగా ఎత్తులు వేస్తున్న బీజేపీ మరోవైపు అధికారాన్ని కూడా వినియోగిస్తుందనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్ సన్నిహితులపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు దానికి సంకేతంగా కనిపిస్తోంది.

రాజస్తాన్ సీఎల్పీ వాడివేడిగా సాగుతున్న దశలో కాంగ్రెస్ కి చెందిన కీలక నేతల మీద ఐటీ దాడులకు పూనుకోవడం వెనుక బీజేపీ హస్తం ఉందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సీఎం సన్నిహితుడైన ధర్మేందర్ రాథోడ్ పై ఏకకాలంలో 12 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. అదే సమయంలో నగల వ్యాపారంలో సిద్ధహస్తుడైన రాజీవ్ అరోరాపై కూడా ఐటీ దాడులు సాగుతున్నాయి. ఈ ఇరువురు అశోక్ గెహ్లట్ కి అత్యంత సన్నిహితులు కావడంతో రాజకీయ కోణంలోనే ఐటీ దాడులు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐటీ రంగంలో దిగింది..నెక్ట్స్ ఈడీ ఎప్పుడూ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాల సెటైర్ విసిరారు.

రాజకీయ సంక్షోభంతో రాజస్తాన్ అధికార పార్టీలో కలకలం సాగుతున్న సమయంలో ఐటీ దాడులు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తాయిలాలు పంచే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న దశలో కాంగ్రెస్ ని కట్టడి చేసేందుకు ఐటీని వినియోగించారని అత్యధికులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే క్యాంప్ లు మొదలయిన దశలో అవి మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉండడంతో ఐటీతో కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేసే యోచనలో ఉన్నారని సందేహిస్తున్నారు. మరోవైపు సీఎల్పీ మీటింగ్ పై అందరి కన్ను పడింది. కాంగ్రెస్ అతిపెద్ద గండం నుంచి ఎలా గట్టెక్కుతుందోననేది ఆసక్తిగా మారింది.

కరోనా సమయంలో కూడా ఇలాంటి రాజకీయ పరిణామాలకు బీజేపీ నేతల తీరు కారణమని రాజస్తాన్ లో కాంగ్రెస్ సహా వివిధ పక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలు ఎన్నికల్లో ఓడించిన తర్వాత కూడా ఇతర పార్టీలను చీల్చి గద్దెనెక్కాలనే ఆతృతలో కాంగ్రెస్ లో కుంపటి రాజేస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీ మాత్రం దానిని తోసిపుచ్చుతోంది. కాంగ్రెస్ లో అంతర్గత పోరును సర్థుబాటు చేసుకోలేక బీజేపీ మీద విమర్శలు చేస్తున్నాని మండిపడుతోంది. ఐటీ దాడుల వెనుక బీజేపీ అధిష్టానం పాత్ర ఉందనే వాదనను తోసిపుచ్చుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp