తిరుమలలో డిక్లరేషన్ చుట్టూ రాజకీయాలెందుకు, ఏమి సాధిస్తారు?

By Raju VS Sep. 22, 2020, 07:33 am IST
తిరుమలలో డిక్లరేషన్ చుట్టూ రాజకీయాలెందుకు, ఏమి సాధిస్తారు?

ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాల తాకిడి పెరుగుతోంది. కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రయత్నాలతో చర్చ పూర్తిగా అటువైపు సాగుతోంది. చివరకు చంద్రబాబు స్వయంగా రంగంలో దిగి వ్యవహారాలకు మతం రంగు పూస్తుండడంతో వ్యవహారం ముదురుతోంది. బీజేపీ తన మార్క్ రాజకీయాలు నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. పైగా మత ప్రమేయం లేని రాజకీయాలు అని చెప్పుకున్న జనసేన కూడా మతం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్ తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే అంశం చుట్టూ మళ్లింది. ఏపీ రాజకీయాల్లో ప్రజా సమస్యలు లేదా కుల సంబంధిత అంశాలతో మనుగడ లేదని గ్రహించిన ప్రధాన ప్రతిపక్షం ఎత్తుకున్న ఈ ఎజెండా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ మొదలయ్యింది.

సీఎం జగన్ మీద వ్యక్తిగత దాడితో ఒరిగేదేముంటుంది

ఏపీ రాజకీయాల్లో జగన్ మీద గురిపెట్టి చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పటికే బూమరాంగ్ అయ్యాయి. నాటి సోనియా నుంచి నిన్నటి చంద్రబాబు వరకూ జగన్ కి వ్యతిరేకంగా చేసిన ఎత్తులన్నీ విఫలమయ్యాయి. రానురాను జగన్ బలపడుతూనే ఉన్నారు. ప్రజల్లో పట్టు పెంచుకుంటూనే ఉన్నారు. తొలుత అవినీతి ముద్ర వేసిన నేతలే, ఇక అది చెల్లకపోయే సరికి మతాన్ని తమ మనుగడ కోసం ఆధారం చేసుకుంటున్నారు. జగన్ వ్యక్తిగత మతాచారాల మీద గురిపెట్టి రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్నారు. 2014 ఎన్నికల్లోనే అలాంటి ప్రయత్నం జరిగింది. కానీ 2019 ఎన్నికల నాటికి వాస్తవాలు గుర్తించిన ఓటర్లు బాబుకి బుద్ధి చెప్పారు. జగన్ కి పట్టంకట్టారు.

ఏడాదిన్నర పాలనలో జగన్ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు. విపక్షంలో ఉండగా ఇచ్చిన హామీల అమలుకి కట్టుబడి చేస్తున్న ప్రయత్నాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడిన నేతగా ప్రజల్లో పట్టు సాధించుకుంటున్నారు. ఈ తరుణంలో జగన్ విశ్వాసాల మీద గురిపెట్టిన చేస్తున్న ప్రయత్నాల పరంపరలో ఇప్పటికే అనేక చోట్ల వివాదాలు రాజేసే ప్రయత్నం జరుగుతోంది. దీనిని గ్రహించిన జనం పలు చోట్ల ఆయా పార్టీలకు బుద్ధి కూడా చెబుతున్నారు. విజయవాడ సమీపంలోని నిడమానూరు సాయిబాబు ఆలయంలో జరిగిన వ్యవహారం దానికో ఉదాహరణగా ఉంది.

తిరుమలలో నాటి బాబు పాలనలో ఏం జరగింది..

ఏపీ సీఎం హోదాలో జగన్ మంగళవారం నాడు బ్రహ్మోత్సవాలకు హాజరుకాబోతున్నారు. ఇది తొలిసారి కాదు. గతంలో ఆయన తండ్రి వైఎస్సార్ కూడా పలుమార్లు బ్రహ్మోత్సవాలకు వెళ్ళారు ప్రభుత్వం తరుపున పట్టువస్తాలు సమర్పించారు. ఆయన బాటలోనే ఇప్పుడు జగన్ ఆ ఆనవాయితీని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. దానిని సహించలేని చంద్రబాబు వివాదాలు రాజేసే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. జగన్ మీద మత ముద్ర వేస్తుంటే ఆయన మాత్రం సంప్రదాయాల ప్రకారం, నియమబద్ధంగా శ్రీవారం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు హాజరయితే బాబు ప్రచారం బెడిసికొడుతుందని భావించినట్టు కనిపిస్తోంది.

2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉండగా జగన్ పలుమార్లు తిరుమల వెళ్లారు. నేరుగా దర్శనం చేసుకున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన పర్యటనలకు అధికారికంగా అన్ని రకాల ఏర్పాట్లను టీటీడీ చేసింది. చివరకు పాదయాత్రకు ముందు, అది ముగిసిన తర్వాత కూడా నేరుగా తిరుమలకే జగన్ వెళ్లారు. ఇచ్చాపురం నుంచి తిరుపతి చేరుకుని, కాలినడకన తిరుమల వెళ్లిన అనుభవం జగన్ ది. ఆయా సమయాల్లో ఎన్నడూ జగన్ విషయంలో డిక్లరేషన్ పట్ల వివాదం లేదు. కనీసం ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నేతలు గానీ, భాగస్వామిగా ఉన్న బీజేపీ దేవాదాయ శాఖ మంత్రి గానీ స్పందించిన దాఖలాలు లేవు.

ప్రతిపక్షంలో ఉంటే ఒప్పు..సీఎంగా ఉంటే తప్పెలా అవుతుంది..

తాజాగా మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఓ విలేకరి ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన సమాధానమిస్తూ హిందువేతరులకు డిక్లరేషన్ విషయంలో 1990కి పూర్వం నియమం కాదని స్పష్టం చేశారు. 1990లో వచ్చిన జీవో నెం. 316 ప్రకారం డిక్లరేషన్ అవసరం ఏర్పడినట్టు గుర్తు చేశారు. అయినా సాధారణ భక్తులకు డిక్లరేషన్ అమలు కావడం లేదని, నేరుగా అందరూ దర్శనాలు చేసుకుంటున్నప్పుడు విఐపీలకు మాత్రమే అవసరం ఎలా అని ప్రశ్నించారు. దానిని వక్రీకరించి హిందువేతరులకు డిక్లరేషన్ అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టుగా ప్రచారం ప్రారంభించారు. దానికి ఆయన వివరణ ఇచ్చినప్పటికీ వివాదయత్నం మాత్రం ఆగలేదు.

అయితే చంద్రబాబు హయంలో జగన్ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒప్పు అయితే ఇప్పుడు తప్పెలా అవుతుందన్నది టీడీపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దానికి వంతపాడుతున్న బీజేపీ నేతలు గుర్తించాల్సి ఉంటుంది. వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో తిరుమల వెళ్లిన సోనియా గాంధీకి అవసరం లేని డిక్లరేషన్ ఇప్పుడు సీఎంకి ఎందుకు అవసరమో బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయని అంశాన్ని ఇతరులు అమలు చేయాలని పట్టుబడుతున్న ఈ రెండు పార్టీల నేతల తీరు ఇప్పుడు విడ్డూరంగా మారింది.

కొడాలి నాని మాటలపై వివాదం ఎందుకు

గత కొన్నాళ్లుగా కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబుని చెడుగుడు ఆడుతున్నారు. దానిని జీర్ణించుకోలేని చంద్రబాబు తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలను కట్ అండ్ పేస్ట్ తో సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా నాని మీద కక్ష తీర్చుకునే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి నాని అసలు పేరు వెంకటేశ్వరరావు కావడం, ఆయన తిరుమల స్వామివారికి పరమ భక్తుడు కావడం విశేషం. పైగా మొన్నటి లాక్ డౌన్ సమయంలో కూడా కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన అనుభవం ఆయనకుంది.

వాస్తవానికి కొడాలి నాని కూడా డిక్లరేషన్ విషయంలో చర్చ జరగాల్సి ఉందన్నారు. ఇతర ఆలయాల్లో లేని నిబంధన వల్ల తిరుమలలో సాధించేందేముందని ప్రశ్నించారు. పైగా సాధారణ భక్తులు నేరుగా దర్శనాలకు వెళుతుంటే కొందరు ప్రత్యేక దర్శనాలకు వెళ్లిన వారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటే ఏమి ప్రయోజనం వస్తుందని ప్రస్తావించారు. దాని మీద వక్రభాష్యాలు తీయడం ద్వారా నాని మీద దుష్ప్రచారానికి బాబు అండ్ కో చేస్తున్న ప్రయత్నం ఆసక్తికరమే.

బాబు వ్యూహాలు బీజేపీ నెత్తిన పాలుపోస్తున్నట్టా

వాస్తవానికి చంద్రబాబు కుట్రలు చేసి జగన్ ని ఇరుకున పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు. తానేదో ప్రభుత్వాన్ని ప్రశాంతంగా పాలన సాగకుండా చేస్తున్నానని సంతృప్తి పడుతున్నారు. అయితే వాస్తవానికి ఆయన కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తానే బీజేపీ ఉచ్చులో పడుతున్నారు. ఏపీలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి అస్త్రాలు అందిస్తున్నారు. పైగా తన ప్రతిపక్ష స్థానానికి తానే కోరి ఎసరు తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి హిందూత్వం అంటూ, ధర్మం అంటూ చంద్రబాబు ఎంతగా అరచిగీపెట్టినా ఒరిగేదేమీ ఉండదు. దానికి తామే ఛాంపియన్ గా నిలుస్తామని బీజేపీ ఇప్పటికే బలంగా విశ్వసిస్తోంది.

తాజా పరిణామాలతో చంద్రబాబు కమలనాధులు కోరుకుంటున్నట్టు వ్యవహరించడమే విశేషం. చంద్రబాబు, ఆయన అనుంగు మీడియా వేసిన ఎత్తుగడలతో బీజేపీ మరింత బలాన్ని చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది. చివరకు అది టీడీపీకి ముప్పు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. ఇప్పటికే వివిధ పార్టీల వైపు చేస్తున్న తెలుగు తమ్ముళ్లు మరింత త్వరగా బాబు గూటి నుంచి తరలిపోయేందుకు కారణంగా మారుతోంది. అదే సమయంలో జగన్ మీద చేస్తున్న కుట్రల సారాంశాన్ని ప్రజలు గుర్తించడానికి దోహదపడుతోంది. బాబు కుయుక్తులను అర్థం చేసుకుంటున్న జనాలు ఇలాంటి అనవసర వివాదాలకు ప్రాధాన్యతనిచ్చేందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. ఏపీలో మత రాజకీయాలకు పెద్దగా స్థానం లేని నేపథ్యంలో బాబు ప్రయత్నాలు బూమరాంగ్ అవుతాయనడంలో పెద్దగా అతిశయోక్తి లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp