సోము వ్యూహం ఫ‌లించేనా..?

By Kalyan.S Sep. 03, 2020, 10:10 am IST
సోము వ్యూహం ఫ‌లించేనా..?

మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ఆ మేర‌కు కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచీ ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. సంబంధిత బిల్లు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేరిన‌ప్పుడు ఆ వేడి మ‌రింత పెరిగింది. ఆ బిల్లు ఆమోదం ప‌డ‌కుండా ప్ర‌తిప‌క్షాలు రాయాల్సిన లేఖ‌ల‌న్నీ రాశారు. ఆనాడు బీజేపీ అధ్య‌క్షుడుగా ఉన్న క‌న్యా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా టీడీపీకి వంత పాడుతూ మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా లేఖ రాశారు. అయిన‌ప్ప‌టికీ న్యాయ స‌ల‌హాలు తీసుకుని సుదీర్ఘంగా చ‌ర్చించిన గ‌వ‌ర్న‌ర్ మూడు రాజ‌ధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేసిన సంగ‌తి తెలి‌సిందే.

అనంత‌రం దీనిపై కోర్టులో ప‌లు కేసులు దాఖ‌ల‌య్యాయి. బీజేపీ ఏపీ క‌మిటీలో కూడా ప‌లు మార్పులు చోటుచేసుకున్నాయి. అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇదిలా ఉండ‌గా.. మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి కేంద్రం త‌మ ప‌రిధిలో లేదంటూ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ప‌రోక్షంగా రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి మ‌ద్దతు ల‌భించింది. దీంతో బీజేపీ అమ‌రావ‌తి వ్య‌తిరేక ఉద్య‌మానికి స్వ‌స్తి ప‌లికింది. ఈ నేప‌థ్యంలో పార్టీపై రైతుల్లో వ్య‌తిరేక భావ‌న క‌ల‌గ‌కుండా సోము స‌రికొత్త వ్యూహం ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రో కొత్త రూట్లో...

అయితే గ‌తంలో మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తూ రైతుల త‌రఫున మాట్లాడిన బీజేపీ కేంద్రం నిర్ణ‌యంతో వెన‌క్కి త‌గ్గినా.. రైతుల‌కు దూరం కాకూడ‌ద‌నే ఉద్దేశంతో కొత్త రూట్లో వారిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. నాడు రాజధాని కోసం రైతులు 33వేలకు పైగా ఎకరాల భూమి ఇచ్చారు. అయితే ఇందులో రైతులు ఇచ్చిన దాని కంటే 20వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని ప్ర‌భుత్వ పెద్ద‌లు చెబుతున్నారు. మ‌రోవైపు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ పేరుతో కొంత మంది ఉద్య‌మం న‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ రైతుల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాల‌నేదానిపై అధ్య‌క్షుడు సోము వీర్రాజు పార్టీ ముఖ్య నాయ‌కుల‌తో అంత‌ర్గ‌తంగా చ‌ర్చిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలో టీడీపీ మాదిరిగా ఏక‌ప‌క్షంగా వెళ్ల‌కుండా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని బీజేపీ భావిస్తోంది. ఒకే ప్రాంతానికి చెందిన పార్టీగా ముద్ర వేసుకోకుండా అటు రైతుల కోసం పోరాటం చేస్తూనే.. ఇటు రాష్ట్రంలోని ఇత‌ర అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని నిర్ణ‌యించింది. మ‌రి ఎంత వ‌ర‌కు త‌మ ప్ర‌య‌త్నాల్లో బీజేపీ స‌ఫ‌లం అవుతుందో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp