Mudragada - మ‌ళ్లీ రాజ‌కీయాల్లో "ముద్ర" వేసుకుంటారా?

By Kalyan.S Dec. 05, 2021, 07:30 am IST
Mudragada - మ‌ళ్లీ రాజ‌కీయాల్లో "ముద్ర" వేసుకుంటారా?

ఒకానొక సంద‌ర్భం లో రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పిన తూర్పుగోదావ‌రి జిల్లా నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. లేఖల ద్వారా నిత్యం వార్త‌ల్లో ఉంటున్నారు. గతంలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని ప్రధాని మోడీకి ఓ లేఖ.. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చెరో లేఖ.. ఇటీవ‌ల వ‌రుస‌గా సంధించారు. కొంత కాలం పాటు స్తబ్దుగా ఉన్న ఆయన ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు అనేందుకు ఈ లేఖలే నిదర్శనం. దీంతో ఆయన రాజకీయాల్లో రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా  మారింది.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తిరిగి రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు వేసుకుంటున్నారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల వివిధ సమస్యలపై వరుస లేఖలు రాస్తూ ఆయన మళ్లీ తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి ఎంపీగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పని చేశారు. చివరగా 2014లో స్వతంత్య అభ్యర్థిగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా తన సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం కాపు రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి పోరాడారు. రాజకీయంగా ఏ పార్టీకి దగ్గర కాలేదు. అలా అనీ దూరంగా కూడా లేరు.

టీడీపీ హయాంలో కాపు ఉద్యమాన్ని పద్మనాభం ముందుకు తీసుకెళ్లారు. కానీ అప్పుడు తన కుటుంబానికి అవమానం జరిగిందని భావించిన ఆయన కాపు రిజర్వేషన్ల పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. కానీ ఇటీవల మళ్లీ లేఖల పర్వంతో తెరమీదకు వస్తున్నారు. తన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బాబు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. బాబు పతనం చూడాలనే ఆత్మహత్య చేసుకోకుండా ఉన్నానని బాబుకు రాసిన లేఖలో పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మోడీకి ఆయన లేఖ రాశారు. తాజాగా వరి కోనుగోళ్లు చేయాలని ఏపీ తెలంగాణ సీఎంలు జగన్ కేసీఆర్కు లేఖలు రాశారు. దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం జోరందుకుంది. మరి ఆయన ఏ పార్టీలో చేరతారో? అన్న ఆసక్తి మొదలైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp