కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. వారికి దేత్త‌డేనా..?

By Kalyan.S Jul. 12, 2020, 08:11 am IST
కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే.. వారికి దేత్త‌డేనా..?

"పీవీ శత జయంతి రోజు మాయమైన కేసీఆర్ ఇప్పటి వరకూ కనిపించడం లేదు. అసలు కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి."
- కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఘాటు విమ‌ర్శ‌.

"ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.."
- విజ‌య‌శాంతి ఆరోప‌ణ‌.

"తెలంగాణ రాష్ట్రం క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే.. ముఖ్య‌మంత్రి ప‌త్తా లేకుండా పోయాడు.."
- బండి సంజ‌య్‌, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు.

"ఒకవైపు జనం ఆస్పత్రుల్లో బెడ్లు లేక బాధపడుతుంటే... ముఖ్యమంత్రి కనిపించడం లేదు."
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

... ఇలా ఒక‌రు, ఇద్ద‌రు కాదు.. ప్ర‌తిప‌క్షాలకు చెందిన ఎంద‌రో నేత‌లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. క‌రోనాకు భ‌య‌ప‌డి ఫామ్ హౌస్ కు పారిపోయారంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కొంద‌రైతే కేసీఆర్ కు శాప‌నార్థాలు కూడా పెట్టారు.

కేసీఆర్ కనబడలేదనే వార్తలు తెలంగాణ‌లో కొన్ని రోజుల పాటు ఓ రేంజ్ లో హల్‌చల్ చేశాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ‘కేసీఆర్ ఎక్కడ’ అనేది సోషల్ మీడియాలో చివ‌ర‌కు ట్రెండింగ్ గా కూడా మారిపోయింది. అంతేకాదు ఏకంగా ఇద్దరు యువకులు ప్రగతిభవన్‌లోకి దూసుకుపోయి నిరసన తెలిపారు. ‘‘ సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్ల‌కార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు. సీసీఫుటేజ్‌ ఆధారంగా యువకులను అరెస్ట్ చేసి విచార‌ణ చేయ‌గా.. ఆ ఇద్దరు యువకులు కాంగ్రెస్ కు చెందిన వారుగా గుర్తించారు.

కేసీఆర్ ఆరోగ్యంపై కోర్టులో సైతం..

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎక్కడ? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నిస్తూ హైకోర్టులో సైతం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ ఏమైపోయారు? హైదరాబాద్ లో ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఏం చేస్తున్నట్లు? గత రెండు వారాలుగా ఎక్కడ చూసినా ఇవే ప్ర‌శ్న‌లు. వాటికి స‌మాధానంగా దాదాపు రెండు వారాల అనంత‌రం కేసీఆర్ శ‌నివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు చేరుకున్నారు. వ‌చ్చిన రోజునే.. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఎవరున్నా వెంటనే గుర్తించి చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ప్రత్యేక వ్యూహం...

తొలి రోజు రైతులతో సమీక్ష చేసిన కేసిఆర్ త్వ‌ర‌లో మీడియా స‌మావేశం పెట్టి రెండు వారాలుగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సాధార‌ణంగానే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ విమర్శలపై విరుచుకు ప‌డే కేసీఆర్ ఈసారి తీవ్ర స్థాయిలో ఆయ‌న‌ను బ‌ద్నాం చేసిన నేప‌థ్యంలో ఓ రేంజ్ లో వారికి చుక్క‌లు చూపెడ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక్కొక్క‌రి విమ‌ర్శ‌కూ దిమ్మ తిరిగేలా పేరు పేరునా క‌చ్చితంగా స‌మాధానం చెబుతార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

లాక్ డౌన్ వేళ ఎంత ఆస‌క్తిగా ప్ర‌జ‌లు కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం ఎదురుచూశారో.. అదే రీతిలో ఈ సారి కూడా చాలా మందిలో ఆస‌క్తి ఏర్ప‌డింది. స‌చివాల‌యం కూల్చివేత‌లు, క‌రోనా క‌ట్ట‌డికి చేప‌ట్ట‌బోయే చ‌ర్య‌లు పేర్కొంటూనే... ప్ర‌భుత్వంపై.. ముఖ్యంగా ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ప్ర‌త్యేక వూహ్యం ఇప్ప‌టికే కేసీఆర్ సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి.. ఆ వాడీ.. వేడీ మీడియా స‌మావేశం ఎలా ఉండ‌బోతుందో.. వేచి చూడాల్సిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp