తప్పు చేయలేదని చెప్పుకోవడం ఇలాగేనా బాబు..?

By Voleti Divakar Jun. 13, 2020, 07:40 am IST
తప్పు చేయలేదని చెప్పుకోవడం ఇలాగేనా బాబు..?

తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే. ఒక కులం వారు, ఒక మతం వారు తప్పు చేస్తే అది ఒప్పుగా మారిపోతుందా..?!. చేసిన తప్పుల నుంచి తప్పుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఇలాంటి కొత్త విధానాన్ని అవలంభించడం ఆయనకు అలవాటుగా మారింది. తాజాగా ఇఎస్ఐ ఆసుపత్రుల్లో పరికరాల కుంభకోణంలో మాజీ కార్మికశాఖ మంత్రి కె అచ్చెంనాయుడును అరెస్టు చేసిన వెంటనే స్పందించిన తీరు, పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన విధానం చంద్రబాబు మార్కు రాజకీయానికి తార్కాణంగా నిలుస్తోంది.

చంద్రబాబునాయుడు రాజకీయాల్లో కొత్త ఒరవళ్లకు, పోకడలకు శ్రీకారం చుట్టారు. ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా ప్రత్యర్థి పార్టీ నాయకుడి కులాన్ని, మతాన్ని బట్టి తన పార్టీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని విమర్శలకు ఉసిగొల్చే విధానాన్ని చంద్రబాబు కనిపెట్టారు. కాపు ఉద్యమ సమయంలో పార్టీకి చెందిన అప్పటి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, టిడిపి నాయకులు బొండా ఉమామహేశ్వరరావు తదితరులతో విలేఖర్ల సమావేశాలు పెట్టించి మరీ కౌంటర్లు ఇప్పించేవారు. తద్వారా రాజకీయాల్లో ఆయన వేర్పాటువాదాన్ని తీసుకుని వచ్చారు. తాజాగా అచ్చెంనాయుడు అరెస్టును కూడా రాజకీయం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన బిసి నాయకులతో మీడియా సమావేశాలు పెట్టించడంతో పాటు, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలకు కూడా బాబు పిలుపునిచ్చారు.

అయితే అచ్చెంనాయుడు అరెస్టును ఖండిస్తున్న నాయకులంతా ఆయన నిజాయితీపరుడని చెప్పకపోవడాన్ని అధికార వైసిపి నాయకులు తప్పుపడుతున్నారు. అచ్చెంనాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబునాయుడుతో సహా ఒక్క టిడిపి నాయకుడు చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విధానం తప్పును సమర్థించే విధంగా ఉందని వైసిపి నాయకులు ధ్వజమెత్తుతున్నారు.

రాజకీయాల్లో నేతపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు చాలా సహజం. గతంలోనూ పెద్ద పెద్ద నేతలే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొంత మంది అరెస్ట్ అయ్యారు. కానీ వాళ్లంతా తమ నిజాయతీని నిరూపించుకునేందుకు కోర్టుల్లో పోరాటం చేశారు. అంతే కానీ కులాలు, మతాలను అడ్డు పెట్టుకోలేదు. ఆరోపణలు వచ్చినప్పుడు తమ నిజాయతీని నిరూపించుకుంటే ప్రజల మనస్సులు గెలుచుకోగలుగుతారు. ఆలా కాకుండా ఇలా వ్యవహరిస్తే ప్రజల్లో చులకన కావడం తోపాటు నవ్వులపాలు కావాల్సి వస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp