భేటీకే భ‌య‌ప‌డితే.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ సాధ్య‌మా..?

By Kalyan.S Oct. 28, 2020, 02:20 pm IST
భేటీకే భ‌య‌ప‌డితే.. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ సాధ్య‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స్థానిక స‌మ‌రంపై మ‌ళ్లీ దుమారం రేగుతోంది. గ‌తంలో క‌రోనా ప్ర‌భావం క‌నీస రీతిలో కూడా లేని స‌మ‌యంలో అక‌స్మాత్తుగా ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసిన ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్.. ఇప్పుడు 30,000కు పైగా క‌రో్నా కేసులు ఉన్న‌ప్ప‌టికీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఆస‌క్తి చూప‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ విమ‌ర్శ‌లు కొన‌సాగుతుండ‌గానే నిమ్మ‌గ‌డ్డ బుధ‌వారం వివిధ రాజకీయ పక్షాలతో స‌మావేశం అయ్యారు. కరోనా భయంతో ఆయా పార్టీల‌తో నిమ్మ‌గ‌డ్డ విడివిడిగా భేటీ అయ్యారు. దీంతో భేటీలే విడివిడిగా జరుపుతుంటే ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంప్రదాయాలకు భిన్నంగా, దేశంలో ఎక్కడాలేని విధంగా వింత పోకడ అవలంబిస్తున్న తీరుపై రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి.

అస‌లు అప్పుడెందుకు ఆపారు..? ఇప్పుడెందుకు...

ఈ ఏడాది మార్చి 7న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. అప్ప‌టికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా ప్ర‌భావం అస్స‌లు లేద‌నే చెప్పొచ్చు. క‌రో్నా నేప‌థ్యంలో ఆంక్ష‌లు కూడా ఏమీ లేవు. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. కొన్ని స్థానాల్లో ఎన్నిక‌ల అవ‌స‌రం లేకుండానే ఏక‌గ్రీవం కూడా అయ్యాయి. అంటే ఆ ప్రాంతాల్లో ప్ర‌జ‌లు క‌రోనా గురించిన అవ‌స‌రం కూడా లేదు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు అంద‌రూ ఎన్నిక‌ల‌కు సిద్ధంగానే ఉన్నారు. ఎవ‌రి నుంచీ వాయిదా వేయాల‌న్న కోరిక కానీ, అమ్మో.. క‌రోనానా అనే ప‌రిస్థితి అప్ప‌టికి అంత‌లా లేదు. అయిన‌ప్ప‌టికీ కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు మార్చి 15న నిమ్మ‌గ‌డ్డ ప్రకటించారు. మొత్తం రెండు దశల్లో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. 2129 ఎంపీటీసీ స్థానాలు, 125 జడ్పీటీసీ స్థానాలు కూడా అప్పుడు ఏకగ్రీవం అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వరకు వచ్చిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. అలాంటి ప‌రిస్థితిలో ఆయ‌న ఎన్నిక‌ల‌ను ఎందుకు ఆపారు..? ఇప్పుడు నిర్వ‌హించ‌డానికి ఎందుకు తొంద‌ర‌ప‌డుతున్నార‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

సెకండ్ వేవ్ మాటేమిటి..?

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరుతోంది రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ వ‌చ్చిన ఆందోళ‌న‌ల్లా క‌రోనా సెకండ్ వేవ్ పైనే. మార్చి నెల ఆరంభంలో దేశ వ్యాప్తంగా క‌రోనా ఆందోళ‌న త‌ప్పా.. ఏపీలో కేసుల న‌మోదు లేదు. కానీ ఆ వైర‌స్ వ్యాప్తిపై ఉన్నవ‌స్తున్న వార్త‌ల‌తో అక‌స్మాత్తుగా ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ స‌డ‌లింపులు ఇస్తూ వ‌చ్చాయి. ప్ర‌జ‌లు య‌ధావిధిగా త‌మ కార్య‌క‌లాపాలను త‌ప్ప‌నిప‌రిస్థితుల్లో నిర్వర్తిస్తున్నా క‌రోనా భ‌యం వారిని వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు.. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్ ఓ స‌హా ప‌లువురు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మార్చిలోనూ ఇటువంటి హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేసిన ఈసీ.. మ‌రి ఇప్పుడెందుకు అంత తొంద‌ర‌ప‌డుతోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

అక్క‌డ త‌ప్ప‌నిస‌రి..

స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నవంబర్ లో నిర్వహించే పరిస్థితి లేదని ప‌లువురు మంత్రులు స‌హా.. ప్ర‌జ‌లు కూడా అదే భావ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సీపీఎం కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితులు ఉన్నాయా..? లేదా..? అనేది ప్ర‌భుత్వంతో చ‌ర్చించిన త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని సూచిస్తోంది. నవంబర్ నెలలో కరోనా చాయ‌లు పెరగొచ్చని గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు తప్పనిసరి అని, మన దగ్గర జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని మంత్రి అన్నారు. కాబట్టి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp