టీడీపీకి ఝలక్ ఇచ్చిన "డీకే" కుటుంబం

By Raju VS Sep. 25, 2020, 12:02 pm IST
టీడీపీకి ఝలక్ ఇచ్చిన "డీకే" కుటుంబం

టీడీపీ నుంచి ఒక్కొక్కరు చేజారిపోతున్నారు. చంద్రబాబు మీద విశ్వాసం సన్నగిల్లుతున్న కొద్దీ నేతలంతా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగా సీనియర్ నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. టీడీపీకి అన్ని రకాలుగానూ అండగా నిలిచిన కుటుంబాల నుంచి కొందరు నేతలు జగన్ కి జై కొడుతుండడం ఆసక్తికరంగా మారుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ , దివంతగత ఆదికేశవుల నాయుడి కొడుకు శ్రీనివాసులు కూడా జగన్ శిబిరంలో చేరేందుకు అంతా సిద్ధమయ్యింది.

తిరుమల పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ తో శ్రీనివాసులు భేటీ అయ్యారు. పద్మావతి అతిధి గృహంలో ముఖ్యమంత్రిని కలిసి తన మనసులో మాట చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఆయన్ని సీఎం వద్దకు తీసుకెళ్లారు. గత ఎన్నికల్లో మిథున్ రెడ్డి పై పోటీ చేసి ఓటమి పాలయిన డీకే సత్యప్రభ తనయుడే శ్రీనివాసులు కావడంతో ఆసక్తిగా మారింది. 2009 లో కూడా శ్రీనివాసులు రాజంపేట నుంచి ప్రజారాజ్యం తరుపున పార్లమెంట్ కి పోటీ చేశారు.

డీకే ఆదికేశవులు నాయుడు వివిధ పార్టీలలో రాజకీయంగా చక్రం తిప్పారు. పార్లమెంట్ సభ్యుడిగానూ, వ్యాపార వేత్తగానూ, టీటీడీ చైర్మన్ గానూ కీలక హోదాలలో క్రియాశీలకంగా కనిపించారు.పార్టీలకు అతీతంగా డీకే అనుచరులు ఉండేవారు. వైయెస్ఆర్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోశాధికారిగా వ్యవహరించిన డీకే ఆదికేశవుల నాయుడును 2004 ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి చిత్తూర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ దక్కనందుకు చంద్రబాబు సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు కాంగ్రెసులో చేరి అన్న మీద అనేక ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచిన డీకే ఆదికేశవుల నాయుడు 2008 అవిశ్వాస పరీక్షా సమయంలో కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వానికి క్రాస్ ఓట్ చేసారు .ప్రతిఫలంగానో లేక ఆయన మిత్రుల సహకారంతోనే టీటీడీ చైర్మన్ అయ్యారు.

Also Read:ఏపీలో భారీ ఫర్నిచర్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం

2009 నియోజకవర్గాల పునః విభజనలో చిత్తూర్ పార్లమెంట్ స్థానం SC రిజర్వేడ్ కావటంతో డీకే ఆదికేశవుల నాయుడికి పోటీచేసే అవకాశం రాలేదు. మరో వైపు చిరంజీవితో ఉన్న వ్యక్తిగత సంబధాల రీత్యా ఆది కేశవుల నాయుడు కొడుకు శ్రీనివాసులు ప్రజారాజ్యంలో చేరి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదికేశవులు నాయుడు మాత్రం అధికారికంగా ప్రజారాజ్యంలో చేరకుండానే కొడుకు కోసం పనిచేశారు.

ఆదికేశవుల నాయుడు 2013లో మరణించారు.2014 ఎన్నికల్లో చిత్తూర్ శాసన సభ స్థానం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషించిన చంద్రబాబు ఆదికేశవుల నాయుడు భార్య డీకే సత్యప్రభ కు సీట్ ఇచ్చారు, ఆవిడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆవిడ మంత్రి అవుతారని అనుకున్నారు కానీ సామాజిక సమీకరణాలు ఆమెకు అనుకూలించలేదు. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పదే పదే సత్యప్రభని చికాకు పెట్టే రీతిలో పరిణామాలు సాగాయి. ప్రధానంగా వారి వ్యాపారాల మీద పలు సార్లు ఐటీ దాడులు జరిగాయి.

2019 ఎన్నికల్లో జగన్ ఒకే రోజు 175 మంది ఎమ్మెల్యే మరియు 25 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయటంతో చంద్రబాబు ఒత్తిడికి లోనయ్యారు. ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికలకు అంతగా సంసిద్దమవుతాడని ఊహించని చంద్రబాబు ఉరుకుల పరుగుల మీద అభ్యర్థుల వేటలో పడ్డారు.అనేక స్థానాలలో లోక్ సభకు పోటీచేయటానికి నాయకులు ముందుకు రాలేదు. మరో వైపు నెల్లూరు,ఒంగోలు లోక్ సభ అభ్యర్థులు అనుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మరియు మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరి పోటీకి సిద్దమవటం చంద్రబాబును దిగ్బ్రాంతికి గురిచేసింది. దీనితో ఆర్ధికంగా బలమైన శిద్దారాఘవరావ్, బీద మస్తానయ్య ,డీకే సత్య ప్రభలాంటి వారిని శాసన సభకు కాకుండా లోక్ సభ బరిలోకి బలవంతంగా దించారు.

Also Read:మరో వివాదంలో ఎంపీ రఘురామకృష్ణం రాజు..

ఆ విధంగా డీకే సామాజిక వర్గం బలంగా ఉన్నా రాజంపేట లోక్ సభ బరిలో డీకే సత్యప్రభను టీడీపీ తరుపున పోటీకి దించారు, ఆవిడ అయిష్టంగానే పోటీచేశారు. రాజకీయంగా బలమైన పెద్దిరెడ్డి కుటుంబం మీద రాజంపేట లోక్ సభ స్థానంలో ఫలితం ఎలాఉంటుందో ఎన్నికలకన్నా ముందే ఊహించవచ్చు.

సత్యప్రభను చివరకు రాజంపేట పార్లమెంట్ బరిలో దించిన టీడీపీ అదే సామాజిక వర్గానికి చెందిన ఏఎస్ మనోహర్ కు టీడీపీ చిత్తూర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. చంద్రబాబు సామాజిక, ఆర్ధిక లెక్కలు విఫలమయ్యి వైసీపీ నేత జంగాలపల్లి శ్రీనివాసులు గెలిచారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూర్ లో 1983 ఎన్నికల్లో టీడీపీ మొత్తం 15 స్థానాలు గెలిచింది, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీచేసిన చంద్రబాబు ఓడిపోయారు. టీడీపీ సునామి సృష్టించిన 1994 ఎన్నికల్లో టీడీపీ 14 స్థానాలు గెలువగా కాంగ్రెస్ తరపున సీకే బాబు ఒక్కరే గెలిచారు. మొన్నటి 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ తరుపున చంద్రబాబు ఒక్కరే గెలువగా వైసీపీ 13 ఎమ్మెల్యే స్థానాలతోపాటు తిరుపతి,చిత్తూర్ ఎంపీ సీట్లు కూడా గెలిచింది.

ఇప్పటికే ఏఎస్ మనోహర్ కూడా టీడీపీని వీడి వైఎస్సార్సీపీ గూటిలో చేరారు. తాజాగా సత్యప్రభ కుటుంబం కూడా ఆ బాట పట్టడంతో చిత్తూరు జిల్లాలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారు.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన ఎమ్మెల్సీ దొరబాబు, పులివర్తి నాని లాంటి నాయకులు ప్రకటనలకే పరిమితమయ్యారు.

Also Read:టీడీపీని వీడిన బాబు చిరకాల మిత్రుడు..

టీడీపీలో తగిన భవిష్యత్ లేదని భావించిన నేతలంతా ప్రస్తుతం వైఎస్సార్సీపీ వైపు పయనమవుతున్నారు. దానికి తగ్గట్టుగానే జగన్ ని కలిసిన శ్రీనివాసులు త్వరలోనే పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే టీడీపీ కుదేలవుతోంది. కీలక నేతలు కూడా రానురాను వెనక్కి తగ్గుతున్నారు. చంద్రబాబు , ఆయన తనయుడి వ్యవహారాలతో టీడీపీకి భవిష్యత్తు ఉండదనే బెంగ వారిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా దన్నుగా ఉన్న పెద్ద కుటుంబం కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సమాయత్తం కావడం ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది. మరింత మంది నేతలు శ్రీనివాసులు బాటలో క్యూ కట్టే అవకాశం కూడా ఉంది.వీరు పార్టీని వీడటం టీడీపీకి నష్టం కానీ వైసీపీకి కలిగే లాభం ఏంటనేది వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp