ఉనికి లేని పార్టీ జెండాతో ఉద్యమమా..? విస్మయపరుస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

By Ramana.Damara Singh Jul. 31, 2021, 05:00 pm IST
ఉనికి లేని పార్టీ జెండాతో ఉద్యమమా..? విస్మయపరుస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

బహుజనులకు రాజ్యాధికారం సాధనకు ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. గతంలో కాన్షిరామ్, మాయావతి వంటివారు బహుజనులకు రాజ్యాధికారం అజెండాతోనే జెండాలు పట్టుకొని రాజకీయాలు చేశారు. కొంత మార్పు తేగలిగినా.. ఉత్తర భారతానికే వారి ప్రాబల్యం పరిమితమైంది. ఇప్పుడు అదే అజెండాను భుజానికి ఎత్తుకున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. దానికోసం ఆయన తన సర్వీసును త్యాగం చేశారు. అణగారిన వర్గాలుగా మిగిలిపోతున్న దళితుల హక్కులు, రాజ్యాధికారం కోసం పోరాటం కొనసాగించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. దాంతో ఆయన సొంత పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ బహుజన సమాజ్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో ఉనికిలో లేని పార్టీలో చేరడం వల్ల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అధికారిగా పలు విప్లవాత్మక చర్యలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూరుకు చెందిన రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కరీంనగర్ ఎస్పీగా ఉన్న సమయంలో అక్కడ నక్సల్స్ కార్యకలాపాలు చాలా తీవ్రంగా ఉండేవి. లొంగుబాట్లను ప్రోత్సహించి నక్సల్స్ ను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ఎస్పీ హోదాలో ప్రవీణ్ కుమార్ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పరివర్తన సదస్సులు, నిమజ్జనం వంటి కార్యక్రమాల ద్వారా లొంగిపోయే నక్సలైట్ల పేర్లను క్రైమ్ రికార్డుల నుంచి పూర్తిగా తొలగించి.. వారికి సాధారణ జీవనంపై పూర్తి భరోసా కల్పించారు. నక్సలిజం పెరుగుదలకు మూలాలను పోలీస్ సిబ్బంది ద్వారా అన్వేషించారు. నిరక్షరాస్యతే కారణమని తెలుసుకుని అటవీ గ్రామాల పిల్లలను చదివించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ఉపాధ్యాయులను రప్పించేలా 'మా ఊరికి రండి.. మాతో ఉండండి' అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా చదువు చెప్పడానికి ముందుకొచ్చే టీచర్లకు ఆయా గ్రామాల్లోనే ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించారు. క్రమంగా అదో పెద్ద ఉద్యమంగా మారి.. ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లోనే నివాసం ఉండాలని జీవో(45) జారీకి దారి తీసింది.

అణగారిన వర్గాల్లో విద్యోన్నతి లక్ష్యంగా పెట్టుకున్న ప్రవీణ్ పోలీస్ సర్వీస్ నుంచి పక్కకు మళ్లి 2013లో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు. గురుకుల పూర్వ విద్యార్థులతో స్వేరో అనే సంస్థను నడుపుతూ దళిత విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ కేడర్ లో గురుకులాల కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన రాజ్యాధికారం నినాదంతో ఐపీఎస్ పదవికి ఈ నెల 20న రాజీనామా చేశారు.

Also Read : మాజీ ఐపీఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఏ దారిలో నడవబోతున్నారు..?

బీఎస్పీతో ప్రయోజనమేమిటో?

రాజీనామా తర్వాత నుంచి ప్రవీణ్ అణగారిన వర్గాలు, బహుజనుల హక్కులు, అధికారం కోసం పోరాడుతానని ప్రకటించారు. వారికి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికే రాజీనామా చేసి వచ్చానన్నారు. ఇందుకోసం ఆయన సొంత పార్టీ పెట్టడం గానీ బలమైన పార్టీలో చేరడం గానీ చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. అయితే వాటికి భిన్నంగా ప్రవీణ్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వైపు అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతిని ఇటీవల కలిశారు కూడా. తమ పార్టీలో చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆ సందర్బంగా ఆమె ఆఫర్ చేశారు. ఆగస్టు 8న నల్గొండలో జరిగే సభలో ప్రవీణ్ బీఎస్పీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారైంది. బీఎస్పీలో చేరాలన్న ఆయన నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఆ పార్టీకి ఏమాత్రం ఉనికి లేదు. 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ టికెట్టుతో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయితే నాడు కాంగ్రెస్ వారికి టికెట్లు నిరాకరించడంతో చివరి నిమిషంలో బీఎస్పీ టికెట్ తెచ్చుకొని పోటీ చేశారు. సొంత బలంతో నెగ్గారే తప్ప బీఎస్పీ ప్రభావం ఏమీ లేదన్నది వాస్తవం.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీ సాధించిన ఓట్లు 4.50 లక్షలకు మించలేదు. అటువంటి పార్టీలో చేరడం ద్వారా ప్రవీణ్ తన ఆశయాలు ఎలా సాధించగలరో అర్థం కావడంలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానికంటే పదిమందికీ సహాయం చేసే అవకాశం ఉన్న ఐపీఎస్ సర్వీసులో కొనసాగి ఉంటే ఇంకా మేలు చేయగలిగేవారన్న అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ప్రవీణ్ వ్యవహార శైలి తెలిసినవారు ఆయన బీఎస్పీలో ఇమడలేరని తేల్చి చెప్పేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ్ ఉదంతాన్ని ఈ సందర్బంగా కొందరు ప్రస్తావిస్తున్నారు. ఐఏఎస్ సర్వీసును వదులుకొని ఏదో చేయాలన్న ఆకాంక్షతో లోక్ సత్తా పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ్.. క్రమంగా తెరమరుగయ్యారు. ప్రవీణ్ కుమార్ విషయంలోనూ చివరికి అదే జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రవీణ్ ఆలోచనలు, వ్యూహం ఏమిటో.. వేచి చూడాలి.

Also Read : మాజీ మంత్రి బాలరాజు రాజకీయాల్లో ఉన్నాడా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp