మరో బీజేపీ సిఎం మార్పు‌...హైడ్రామా మొదలు

By Balu Chaganti Sep. 15, 2021, 01:30 pm IST
మరో బీజేపీ సిఎం మార్పు‌...హైడ్రామా మొదలు

ముందుగా రెండు సార్లు ఉత్తరాఖండ్​ సీఎం, తర్వాత కర్ణాటక సీఎం, తాజాగా గుజరాత్​ సీఎం ఇలా ఆరు నెలల వ్యవధిలో ముఖ్యమంత్రులను మార్చేసి ఆసక్తికర చర్చకు దారి తీసింది బీజేపీ సెంట్రల్ హైకమాండ్​. ఒక్కొక్కరికి ఒక్కో వంక పెడుతూ ప్రస్తుతం ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు అందరికీ టెన్షన్ పెట్టి చంపేస్తోంది.

నిజానికి వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసమే ఈ నాయకత్వ మార్పు అంటున్నారు. దీంతో ఈ లిస్టులో తర్వాత ఎవరుంటారు? అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ చర్చ జరుగుతున్న సమయాన హిమాచల్​ ప్రదేశ్​ సీఎం జైరాం ఠాకూర్ కి హడావుడిగా ఢిల్లీ నుంచి కబురు రావడంతో ఆయన హుటాహుటిన వెళ్లారు. వచ్చే ఏడాది హిమాచల్‌లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఠాకూర్​ ఒక్కడిని కాకుండా హిమాచల్​ ప్రదేశ్​ బీజేపీ పెద్ద తలకాయలు అన్నిటినీ ఢిల్లీకి పిలిపించడం వారం రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి కావడంతో ఈ జాబితాలో తరువాతి పేరు ఆయనే అని అందరూ భావిస్తున్నారు. ముందు ఈ నెల 8న దేశ రాజధానికి వెళ్లిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. 

ఇక ఈ రోజు ఆయన తాజా పర్యటన అనంతరం ఆయన అదేమీ లేదని కొట్టి పడేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చారు తన ఢిల్లీ పర్యటన ఎప్పుడో షెడ్యూల్ చేయబడిందని అది కేవలం సంస్థాగత పటిష్టత కోసమే అని చెప్పుకొచ్చారు., "అసలు నన్ను సీఎం గా తప్పిస్తున్నారు అనే చర్చ నిరాధారమైనది, ఇది షెడ్యూల్ చేయబడిన కార్యక్రమం, బీజేపీ సమావేశం కావడంతో నేను ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాను, ఈ సమావేశం 20 రోజుల క్రితం నిర్ణయించబడింది'' అని పేర్కొన్నారు.

Also Read : ఉత్త‌రాఖండ్ లో బీజేపీ వ్యూహాలు ఫ‌లిస్తాయా?

నిజానికి మరికొద్ది రోజుల్లో హిమాచల్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి, రెండు సార్లు బిజెపి ఎంపి రామ్ స్వరూప్ శర్మ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న కేసులో మండి సీటు ఖాళీ అయింది. మరోపక్క బిజెపి ఎమ్మెల్యే నరీందర్ బ్రగత మరణంతో జుబ్బల్-కోట్‌కాయ్ అసెంబ్లీ స్థానం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజన్ సింగ్ పఠానియా మరణంతో ఫతేపూర్ సీటు ఖాళీగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి మరియు కాంగ్రెస్ సీనియర్ వీరభద్ర సింగ్ మరణం కారణంగా ఆర్కి స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు వార్మ్ అప్ మ్యాచ్ వంటిది, దీంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిజానికి జార్ఖండ్‌లో పార్టీ ఓటమి తరువాత, ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలో రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదని, అందుకే ముఖ్యమంత్రులను ఎప్పుడు మారుస్తారో? ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి.. ఒకరకంగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గతం కంటే పుంజుకుంది, అనూహ్యంగా ఆ తర్వాత ఆరు నెలల వ్యవధిలో ఆ పార్టీ జార్ఖండ్‌ లో అధికారాన్ని కోల్పోయింది, అక్కడ హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మహాకూటమి చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఎన్నికల ఫలితాల మీద జరిపిన విశ్లేషణలో అప్పటి ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కి ప్రజాదరణ లేకపోవడమే కారణమని తేల్చారు. జార్ఖండ్‌లో ఈ ఓటమి నుండి పాఠాలు నేర్చుకున్న బీజేేపీ ఈ  సంవత్సరం ఇప్పటికే ఐదుగురు ముఖ్యమంత్రులను మార్చింది, అందులో చివరి పేరు విజయ్ రూపానీ.

అయితే హిమాచల్ సీఎం విషయంలో హైడ్రామా మొదలైంది, గతంలో కూడా ఇలా రెండు మూడు సార్లు ఢిల్లీ పర్యటనల అనంతరమే సీఎంల మార్పు జరిగింది. దీంతో ఇప్పుడు ఈ లిస్టులో ఆయన పేరు ఉంటుందా? లేదా అనేది చూడాల్సి ఉంది.

Also Read : ఆలయాల కూల్చివేత.. బీజేపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp