ఆంధ్రభూమి పత్రిక ప్రస్థానంలో కీలక అడుగులు

By Raju VS Jul. 31, 2021, 03:45 pm IST
ఆంధ్రభూమి పత్రిక ప్రస్థానంలో కీలక అడుగులు

ఆంధ్రభూమి. తెలుగు నాట వెలిసిన అనేక పత్రికల్లో ఓ ముఖ్యమైన దినపత్రిక. అనేక మంది పాఠకుల ఆదరాభిమానాలు పొంది సుదీర్ఘకాలం పాటు తెలుగు నేల నలుచెరుగులా విస్తరించిన పత్రిక. కొన్ని నెలల క్రితం వివిధ కారణాలతో మూతపడింది. త్వరలో తెరుస్తారని, పునర్ముద్రణ జరుగుతుందని అంతా భావిస్తున్న సమయంలో తాజాగా ఉద్యోగులతో సెటిల్ మెంట్ జరిగిపోతోంది. దాంతో ఇక ఆంధ్రభూమి పత్రిక మళ్లీ కనిపిస్తుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రింట్ మీడియాకి గడ్డుకాలం దాపురిస్తోంది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా డిజిటల్ మీడియా పోటీని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఈ దశలో ఈనాడు లాంటి సంస్థలు కూడా డిజిటల్ రంగానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. దాంతో మళ్లీ ఆంధ్రభూమి పత్రిక పాఠకులకు చేరుతుందా లేదా అనేది అనుమానమే.

డెక్కన్ క్రానికల్ హోల్డింగ్ సంస్థ ఆధ్వర్యంలో 1960లో ఆంధ్రభూమి ప్రారంభమయ్యింది. అంతకుముందు 1932లోనే ఆంధ్రభూమి పత్రికను మద్రాసులో ప్రారంభించారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటివి ప్రధాన పత్రికలుగా ఉన్న కాలంలో వాటికి పోటీగా నిలబడింది. ప్రత్యేక పంథాలో సాగుతూ పాఠకులను ఆకట్టుకుంది. అదే సమయంలో జర్నలిస్టులకు ఆంధ్రభూమి అత్యంత సురక్షిత సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. గోవిందుని రామశాస్త్రి (గోరా శాస్త్రి), పండితారాధ్యుల నాగేశ్వరరావు, గజ్జెల మల్లారెడ్డి, ఎ. బి. కె. ప్రసాద్, కె. ఎన్‌. వై. పతంజలి, సి. కనకాంబరరాజు, ఎం. వి. ఆర్. శాస్త్రి వంటి ఉద్దండ పాత్రికేయుల సంపాదకత్వంలో సాగింది.

చివరకు రెండేళ్ల క్రితం పత్రిక నిర్వహణ నిలిచిపోయింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థ ఆర్థిక వ్యవహారాల చుట్టూ వివాదాలు ముసరడంతో పత్రిక మీద ప్రభావం పడింది. దాంతో సిబ్బందికి చిక్కులు వచ్చాయి. అయినా ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా అనేక రకాలుగా అవకాశాలు అందుకున్న ఆంధ్రభూమి ఉద్యోగులు మళ్లీ పాతయాజమాన్యం ఆధ్వర్యంలో పత్రిక ప్రారంభమవుతుందని ఎదురుచూశారు. ముఖ్యంగా రాజకీయ , వ్యాపార, ఇతర అంశాలలో పాత్రికేయులను వినియోగించుకునే సంస్కృతికి భిన్నంగా పూర్తిగా పత్రికా విలువలకు కట్టుబడిన సంస్థ మళ్లీ వెలుగుచూస్తుందని ఆశించారు. తెలుగు మీడియాలో ఈనాడు సహా ఎవరూ ముందుకు రాకపోయినా జర్నలిస్టులకు వేజ్ బోర్డు సిఫార్సులను అమలు చేసిన సంస్థ తిరిగి ప్రారంభం కావాలని కోరుకున్నారు.

కానీ ఆంధ్రభూమి కథ ఇక ముగిసిందనే వాదనకు బలం చేకూరుస్తూ తాజాగా సిబ్బందితో రాజీనామాలు చేయించే ప్రక్రియ ప్రారంభించారు. వారికి సెటిల్మెంట్ చేస్తూ వారికి సంస్థతో ఉన్న అనుబంధానికి ముగింపు పలికే యత్నం చేపట్టారు. దాంతో ఇకపై ఆంధ్రభూమి నిర్వహణకు డెక్కన్ క్రానికల్ సంస్థ సిద్ధంగా లేదని తేలిపోయింది. భవిష్యత్తులో కొత్త యాజమాన్యం ఎవరైనా ముందుకు వస్తారా లేక ఆంధ్రభూమి కథకు ఫుల్ స్టాప్ పడినట్టేనా అన్నది కాలమే చెప్పాలి. కానీ ప్రస్తుతానికి జర్నలిస్టులకు ఎంతో మేలు చేసిన సంస్థ మూతపడడం తెలుగు ప్రింట్ మీడియా జర్నలిస్టులకు కష్టాలు మిగిల్చినట్టేనని చెప్పాలి.

Also Read : అందరివాడు మురళి.. ఫలించిన కృషి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp