Amith Sha -Kashmir Tour -అమిత్ షా కాశ్మీర్ ప‌ర్య‌ట‌నలో ఏమి జరిగింది?

By Kalyan.S Oct. 26, 2021, 07:45 pm IST
Amith Sha -Kashmir Tour -అమిత్ షా కాశ్మీర్ ప‌ర్య‌ట‌నలో ఏమి జరిగింది?

కాశ్మీర్ లో శాంతియుత వాతావ‌ర‌ణ నిర్మాణమే ల‌క్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు అక్క‌డ ప‌ర్య‌టించారు. మ‌రి హింసాకాండ‌, భయం తోబుట్టువులుగా వ‌ర్ధిల్లే ఆ ప్రాంతంలో అమిత్ ప‌ర్య‌ట‌న ధైర్యాన్ని నింపిందా? అమిత్ ప‌ర్య‌ట‌న వెనుక అస‌లు ఉద్దేశం ఏంటి? ఓ బ‌హిరంగ స‌భ‌లో ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూప్ గ్లాసును స్వ‌యంగా తొల‌గించి ‘‘నాకు బుల్లెట్‌ ప్రూఫ్‌ షీల్డ్‌ లేదు,సెక్యూరిటీ లేదు, మీ ముందు నిల్చొని మనసు విప్పి మాట్లాడుతున్నా’’ అంటూ స్థానికుల‌ను ఆక‌ట్టుకునేలా సాగిన షా ప్ర‌సంగాలు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకున్నాయి అనే అంశాలు ఇప్పుడు ప్ర‌ధానంగా మారాయి.

2019 ఆగస్టు 5న కేంద్రం రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దుతో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తద్వారా పరిస్థితి చక్కబడి శాంతి నెలకొంటుందని ఆశించింది. నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, ఎన్నికల సంఘం ఓకే అనగానే రెండు రాష్ట్రాలకూ ఎన్నికలు పెడతామనీ చెప్పింది. కానీ, రెండేళ్ళు దాటినా పరిస్థితి అలా లేదు. పైగా, కొద్ది రోజులుగా తీవ్రవాదులు ఎంచుకొని మరీ చేస్తున్న హత్యల్లో డజను మంది సామాన్యులు, ఆధీన రేఖకు దగ్గరలోని రాజౌరీ– పూంఛ్‌ సెక్టార్‌లో 9 మంది దాకా సైనికులు బలయ్యారు. ఇది చొరబాటుదారులైన పాకిస్తానీ తీవ్రవాదుల పనే అన్నది అంచనా. బీహార్, యూపీల నుంచి వచ్చిన వలస కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తర్వాత రెండేళ్ళలో తొలిసారిగా అమిత్‌షా  కాశ్మీర్ లో ప‌ర్య‌టించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబ‌ర్ 25న‌ పుల్వామా చేరుకున్నారు. అక్కడ సీఆర్పీఎఫ్ (CRPF) క్యాంపులో సైనికులతో సమావేశమయ్యారు. 2019లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు అర్పించి, ఈ లెత్‌పోరా అమరవీరుల స్మారక చిహ్నంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కలిసి రాత్రి గడిపారు. హోంమంత్రి అమిత్ షా సోమవారం రాత్రి పుల్వామాలోని సీఆర్పీఎఫ్ క్యాంపులోనే బస చేశారు ఈ సందర్భంగా సైనికుల ఉత్సాహం ఉరకలెత్తింది. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలోని సీఆర్పీఎఫ్ (CRPF) శిబిరంపై తీవ్రవాద దాడి జరిగింది. ఆ దాడిలో 40 మంది సైనికులు అమరులయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత్ వైమానిక దాడులు నిర్వహించి పలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

Also Read : Chandrababu Delhi Tour -చంద్రబాబు కష్టాలు రెట్టింపు చేసిన హస్తిన యాత్ర

పుల్వామా పర్యటనకు ముందు హోంమంత్రి అమిత్ షా శ్రీనగర్‌లోని దాల్ సరస్సు చేరుకున్నారు. ఇక్కడ క్రూయిజ్ ఎక్కి కలర్‌ఫుల్ ప్రోగ్రామ్‌ను ఆస్వాదించారు. ఉగ్రవాదుల భయంతో ఈమధ్య ఇక్కడ విహార యాత్రలు సాగడం లేదు. అందమైన ఆ ప్రదేశంలో మన దేశ హోంమంత్రి క్రూయిజ్ ఎక్కారు. ఇది అత్యంత ఆస‌క్తిగా మారింది. కొద్ది రోజులుగా ఉగ్రవాదులు అక్కడ చీకటి అధ్యాయాన్ని ప్రారంభించే కుట్రకు సిద్ధం అయ్యారు. అమిత్ షా పర్యటనతో ఆ కుట్ర భగ్నం అయినట్టే. స్థానికులకు, పర్యాటకులకు ఆత్మవిశ్వసాన్నిచ్చింది ఈ పర్యటన.జమ్మూ-కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా హోంమంత్రితో పాటు హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇక్కడ జరిగిన బోట్ ఫెస్టివల్‌ను అమిత్ షా ఆస్వాదించారు. ఈ పర్యటన ద్వారా కాశ్మీర్‌ను మార్చాలనే సందేశాన్ని దేశవ్యాప్తంగా పంపారు అమిత్ షా.ఇప్పుడు అమిత్ షా జమ్మూకాశ్మీర్ పర్యటన ఉద్దేశం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్త‌డం స‌హ‌జ‌మే. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు భారత హోంమంత్రి చేసిన సుదీర్ఘమైన కాశ్మీరీ పర్యటన ఇదే. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌కు ఇది మొదటి పర్యటన, కేంద్ర హోం మంత్రిగా ఇది రెండవ పర్యటన.

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉన్న ఖీర్ భవానీ ఆలయంలో అమిత్ షా సోమవారం ప్రార్థనలు చేశారు. సాంప్రదాయ కాశ్మీరీ ఫిరాన్ దుస్తులు ధరించి, షా పోప్లర్ చెట్ల చుట్టూ ఉన్న ఆలయ సముదాయంలో చాలా సమయం గడిపాడు. ఆదివారం సాయంత్రం పాక్ సరిహద్దుకు చేరుకున్న అమిత్ షా.. విధుల్లో ఉన్న సైనికులను కలుసుకుని వారిని ప్రోత్సహించారు. దానికి ఒక రోజు ముందు, అతను ఉగ్రవాదంతో బాధపడుతున్న కుటుంబం బాధను పంచుకున్నారు.

జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి–నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫారూఖ్‌ అబ్దుల్లా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ గడచిన మూడు రోజుల్లో రెండు సార్లు సూచించారు. కానీ,పలుమార్లు పాకిస్తాన్‌ ద్రోహులతో, మరీ ముఖ్యంగా పుల్వామా దాడితో కేంద్రానికి మబ్బులు వీడి, కేంద్రమంత్రి ఆ సూచనల్ని తోసిపుచ్చారు. ‘నయా కాశ్మీర్‌’ కోసం కాశ్మీరీ యువతరంతోనే మాట్లాడతానంటూ తెగేసి చెప్పడం గమనార్హం. ప్రతిపక్ష కాశ్మీరీ నేతలపై విరుచుకు పడడమే కాక సోమవారం దాల్‌ సరస్సులో మిరుమిట్లు గొలిపే దీపకాంతుల మధ్య సాంస్కృతిక ప్రదర్శనల్లో షా పాల్గొన్నారు. కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనే భావన కలిగించేందుకు శతవిధాల ప్రయత్నించారు. షార్జాకు విమాన సర్వీసు, ఐఐటీ కొత్త ప్రాంగణం ప్రారంభోత్సవం వగైరా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో కాశ్మీర్‌లో అవినీతి, బంధుప్రీతి, తీవ్రవాదం నశించి, మునుపెన్నడూ లేని అభివృద్ధి జరుగుతోందని తన పర్యటనలో కాశ్మీరీ యూత్‌ క్లబ్‌ సభ్యులతో నమ్మబలికారు.

Also Read : Assembly Seats Hike - 2023 లోపే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందా..?

కానీ, కాశ్మీర్‌లో అల్పసంఖ్యాకులైన పండిట్లు, సిక్కులు, వలస కార్మికుల ఊచకోత... పదిహేను రోజులుగా తీవ్రవాదులపై ఆగని సైనిక చర్య – క్షేత్రస్థాయి ఉద్విగ్నతను కళ్ళకు కడుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లతో మూన్నాళ్ళ పర్యటనకు వచ్చిన మంత్రి మాటల్లోని ధైర్యం అక్కడి సామాన్యులకు ఉంటుందా అన్నది అనుమానమే. సోమవారం సైతం పుల్వామాలో పోలీస్‌స్టేషన్‌పై జరిగిన గ్రెనేడ్‌ దాడి లాంటివి కాశ్మీర్‌ నిజంగా సురక్షితమేనా, గుండెలపై చేతులేసుకొని బతికే పరిస్థితి ఉందా అని భయం రేపుతున్నాయి. భద్రతా దళాల నైతికతను పెంచడం. కాశ్మీర్ యువత విశ్వాసాన్ని పొందడం, కొత్త జమ్మూ కాశ్మీర్‌ను నిర్మించడం ల‌క్ష్యా‌లుగా సాగిన షా ప‌ర్య‌ట‌న ఫ‌లితాలు ఎలా ఉండ‌నున్నాయ‌నేది వేచి చూడాల్సిందే.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp