Punjab Amarinder Siddu-సిద్ధూ టార్గెట్ గానే అమ‌రీంద‌ర్ పార్టీ : కాంగ్రెస్‌కు కొత్త క‌ష్టాలు త‌ప్ప‌వా?

By Kalyan.S Oct. 28, 2021, 10:00 am IST
Punjab Amarinder Siddu-సిద్ధూ టార్గెట్ గానే అమ‌రీంద‌ర్ పార్టీ : కాంగ్రెస్‌కు కొత్త క‌ష్టాలు త‌ప్ప‌వా?

అధికారంలో ఉన్నామ‌న్న ఆనందం పంజాబ్ కాంగ్రెస్‌కు ఉండ‌డం లేదు. ఆది నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమ‌రీంద‌ర్ నేతృత్వంలో స‌జావుగా పాల‌న సాగిపోతున్న సంద‌ర్భంలో.. అధిష్ఠానం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు పార్టీని దూరం చేసేలా ఉంది. కొద్ది నెల‌ల్లోనే అక్క‌డ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో స‌మ‌ష్టి నిర్ణ‌యాలు తీసుకోవాల్సింది పోయి..తలబొప్పిక‌ట్టేలా చేసుకుంది. ఫ‌లితంగా అమ‌రీంద‌ర్ ఇప్పుడు కాంగ్రెస్‌కు శ‌రాఘాతంగా మారారు. ఓ వ్య‌క్తిపై ఉన్న అసంతృప్తే అమ‌రీంద‌ర్ కొత్త పార్టీ వైపు అడుగులు వేసేందుకు కార‌ణ‌మైన‌ట్లుగా ఆయ‌న తాజా వ్యాఖ్య‌లు మ‌రోసారి స్ప‌ష్టం చేస్తున్నాయి.

ప్ర‌భుత్వంలో ఉంటూనే ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా విమ‌ర్శ‌లు చేసే సిద్ధూను అంద‌లం ఎక్కించ‌డం అమ‌రీంద‌ర్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. రాహుల్, ప్రియాంక గాంధీలు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కు ప్రాధాన్యం ఇవ్వ‌డం, అధినేత్రి సోనియాగాంధీ కూడా అడ్డుచెప్ప‌క‌పోవ‌డం పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక‌కు కార‌ణాలుగా తెలుస్తున్నాయి. సిద్ధూ వ్య‌వ‌హారాన్ని సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో అమ‌రీంద‌ర్ సింగ్ కొత్త దారి ఎంచుకున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఆ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కావడం ఖాయమైంది. త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన తర్వాత తమ పార్టీ పేరు, చిహ్నంను ప్రకటించనున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నవ్‌జోత్ సింగ్ సిద్ధు ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తాము కూడా అక్కడి నుంచి పోటీ చేస్తామని స్పష్టంచేశారు. తన కొత్త పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని మొత్తం 117 స్థానాల్లోనూ తాము పోటీచేస్తామని అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. సీట్ల సర్దుబాట్లు ఉండే అవకాశముందని..లేని పక్షంలో తమ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగుతుందని చెప్పారు. అదే సమయంలో బీజేపీ, ఇతర చిన్న పార్టీలతో పొత్తులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు ఐక్య కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఇతర పార్టీలతో చర్చలు జరగాల్సి ఉందని తెలిపారు. వ్యవసాయ చట్టాల వివాదంపై చర్చించేందుకు గురువారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు వెల్లడించారు. తన వెంట 25-30 మందిని తీసుకెళ్లి అమిత్ షాతో కలుస్తానని తెలిపారు.

నోటికొచ్చిన‌ట్లు మాట్లాడ‌డ‌మే సిద్ధూకు తెలుసు త‌ప్పా ఇంకేమీ తెలియ‌ద‌ని అమరీందర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నట్లు తెలిపారు. కేంద్రంతో కలిసి పనిచేయకపోతే రాష్ట్రం పెద్దగా చేయగలిగింది ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. సుపరిపాలన అంటే ఏంటో సిద్ధూకు తెలుసని తాను భావించడంలేదన్నారు. సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచే పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతూ వచ్చిందన్నారు. పంజాబ్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ దళాల అధికార పరిధిని 50 కి.మీల దూరం వరకు విస్తృతం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమరీందర్ సింగ్ సమర్థించారు. రాష్ట్ర భద్రతకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వ్యాఖ్యానించారు మ‌రోవైపు సిద్ధూ కూడా అమరీందర్ సింగ్‌పై విమ‌ర్శ‌లు చేశారు. కేవలం తన వ్యక్తిగత స్వార్థంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని పీసీసీ చీఫ్ సిద్ధూ ఆరో పించారు.

Also Read : PK Prasanth Kishore - రాజకీయాలకు పనికిరానంటున్న పీకే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp