"హ‌ద్దు" మీరితే డ్రాగ‌న్ ఆట‌క‌ట్టించేందుకు సిద్ధంగా భార‌త్

By Kalyan.S Sep. 03, 2020, 02:03 pm IST
"హ‌ద్దు" మీరితే డ్రాగ‌న్ ఆట‌క‌ట్టించేందుకు సిద్ధంగా భార‌త్

తోకజాడిస్తే చైనాకు బుద్ధిచెప్పేందుకు భారత్ సంసిద్ధంగా ఉంది. అవ‌స‌ర‌మైతే డ్రాగన్ సైన్యాన్ని చుట్టుముట్టేందుకు భారీ ఎత్తున భ‌ద్ర‌తా ద‌ళాలు, యుద్ధ ట్యాంకుల‌తో రెడీగా ఉంది. భార‌త్ దళాలు, ట్యాంకులతో సన్నద్ధమైంది. స‌రిహ‌ద్దుల్లో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయా..? డ‌్రాగ‌న్ త‌న దొంగ బుద్ధి చూపుతోందా..? సరిహద్దు వివాదానికి తెరదించేందుకు ఓవైపు సంప్రదింపులు జ‌రుపుతూ.. మ‌రోవైపు వ‌క్ర‌మార్గాలు అనుస‌రిస్తుందా..? అంటే అవున‌న‌డానికి భార‌త్ తీసుకుంటున్న చ‌ర్య‌లు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఇరు పక్షాలు ఎల్‌ఏసీ వద్ద పెద్దసంఖ్యలో మోహరించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్ప‌డింది. మరోవైపు సరిహద్దు వెంబడి భారత్‌-చైనా ఉద్రిక్తతలు పెచ్చుమీరడంతో భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. ఇండో-చైనా, భారత్‌-నేపాల్‌, భారత్‌-భూటాన్‌ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ భద్రతా దళాలను ఆదేశించింది. చైనా సరిహద్దుల్లో నిఘాను, పెట్రోలింగ్‌ తీవ్రతరం చేయాలని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), సహస్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ)లను కోరాయి.

చైనా క‌వ్వింపు చ‌ర్య‌లు : భార‌త్ ఆగ్ర‌హం

ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, లడఖ్‌, సిక్కిం సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఐటీబీపీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఇండియా-నేపాల్‌-చైనా ట్రై జంక్షన్‌, ఉత్తరాఖండ్‌లోని కాలాపానీ ప్రాంతంలో నిఘాను ముమ్మరం చేయాలని ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీలకు స‍్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ, బోర్డర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ అధికారులతో బుధవారం జరిగిన అత్యున్నత స్ధాయి సమీక్షా సమావేశంలో ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తూర్పు లడఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ త్సో ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దళాల ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్ధితిని మార్చేందుకు చైనా విఫలయత్నం చేసిన నేపథ్యంలో సరిహద్దు వెంబడి వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. సైనిక చర్చలు కొనసాగుతుండగానే మంగళవారం కూడా చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీంతో భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీంతో సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్‌-చైనాల మధ్య చుషుల్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌ స్ధాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుపుతూ.. మ‌రోవైపు చైనా క‌య్యానికి కాలు దువ్వుతూ ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp