టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం.. చైనా యాప్‌లన్నింటిపై వేటు..

By Kotireddy Palukuri Jun. 29, 2020, 09:12 pm IST
టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం.. చైనా యాప్‌లన్నింటిపై వేటు..

లద్ధాఖ్‌ వెంబడి చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల్లో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ఆ దేశం రూపొందించిన యాప్‌లపై నిషేధం విధించింది. విరివిగా ప్రాచూర్యం పొందిన టిక్‌టాక్‌ సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొంత కాలంగా చైనా వస్తువులు, యాప్‌లు నిషేధించాలంటూ దేశ వ్యాప్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. లద్ధాఖ్‌లోని గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో ఒక కల్నల్‌ సహా 20 మంది భారత సైనికులు అసువులు బాసిన తర్వాత ఈ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా చైనా అన్ని యాప్‌లను నిషేధించడం గమనార్హం.

సరిహద్దుల వద్ద ఇటీవల నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. సరిహద్దులను చెరిపేసే ప్రయత్నాలను చైనా చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారత్‌ పొరుగు దేశాలైన నేపాల్,పాకిస్తాన్‌ల సహాయంతో చైనా దూకుడుగా వెళుతోంది. ఆ దేశాల్లో సైనిక సిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఉపగ్రహా చిత్రాల ద్వారా గుర్తించినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా బలగాలను సరిహద్దుల వద్ద మోహరిస్తున్నాయి. త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయి. యుద్ధ విమానాలను సరిహద్దుల వద్దకు తరలిస్తున్నారు. నావికాదళం కూడా అప్రమత్తమైంది. ఈ క్రమంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు భారత్‌ ప్రభుత్వం వెల్లడించింది.

తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తాయన్న చర్చ ప్రస్తుతం సాగుతోంది. చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడంతో వాణిజ్యం, పెట్టుబడులపై ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్నది చర్చనీయాంశమైంది. ఫ్లిప్‌కార్ట్‌ సహా పలు భారత్‌ కంపెనీల్లో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య వస్తువుల ఎగుమతులు దిగుమతులు విరివిగా సాగుతున్నాయి. భారత్‌ ఎగుమతుల విలువ, చైనా నుంచి మన దేశం దిగుమతి చేసుకునే విలువ కన్నా పలు రెట్లు తక్కువ కావడం గమనార్హం. స్వదేశీ తయారీని ప్రొత్సహించాలని, ఇకపై చైనా వస్తువల వినియోగం గరీష్ట స్థాయిలో తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp