India, women population - తొలిసారి మహిళాధిక్యం

By Prasad Nov. 28, 2021, 05:15 pm IST
India, women population - తొలిసారి మహిళాధిక్యం

దేశ జనాభా నిష్పత్తి లో పురుషులు కన్నా మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,020 మంది మహిళలు ఉన్నారు. నేషనల్‌ ఫ్యామిలీ అండ్‌ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఇచ్చిన నివేదిక వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదే కాకుండా దేశంలో యువకుల శాతం కూడా తగ్గుతుందని ప్రకటించింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ నిర్వహించిన శాంపిల్ సర్వేలో ఈ వివరాలు వెల్లడైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. జాతీయ జనాభా లెక్కలు తేలినప్పుడు పూర్తి స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పక్కాగా జనాభా లెక్కలు జరగనుంది.

జనాభా నిష్పత్తి దేశంలో మహిళలు శాతం పెరగడం ఇదే మొదటిసారి. 1990లలో మహిళా నిష్పత్తి చాలా తక్కువగా ఉండేది. అప్పట్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 927 మంది మాత్రమే మహిళలు ఉండేవారు. మహిళా శాతం ఇంత తక్కువగా ఉండడం చాలా ఆందోళనకరమని నోబెల్‌ బహుమతి విజేత, ప్రముఖ ఎకనామిస్ట్‌ అమర్త్యసేన్‌ వంటి వారు దేశంలో ‘మహిళలు అదృశ్యం’ అవుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పట్లో భ్రూణహత్యలు ఎక్కువగా ఉండేవి.

మహిళలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరగడంతోపాటు కొడుకైనా.. కూతురైనా ఒకటేననే తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తరువాత కాలంలో మహిళల శాతం పెరుగుతూ వచ్చింది. 2005-06లో పురుషులు, మహిళల నిష్పత్తి సరిసమానమైంది. 2015-16 కాలంలో కొంత వరకు తగ్గి ప్రతీ వెయ్యి మంది పురుషులకు 991 మంది మహిళలుగా ఉన్నారు.

తాజాగా నిర్వహించిన శాంపిల్ సర్వేలో మహిళల సంఖ్య ప్రతీ వెయ్యి మందికీ 1,020 ఉన్నట్టు తేలింది. దేశంలో పంజాబ్‌, హర్యానా, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ లలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 950 మంది కన్నా తక్కువగా మహిళలు ఉన్నారు. పంజాబ్‌లో కేవలం 938 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు లడఖ్‌ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 950 నుంచి వెయ్యి మంది వరకు మహిళలు ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలలో వెయ్యి మంది దాకా మహిళలు ఉన్నారు. ఈ రాష్ట్రాలలో కేరళలో అత్యధికంగా ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఏకంగా 1,121 మంది మహిళలు ఉన్నట్టు తేలింది. తమిళనాడులో 1,088 మంది, తెలంగాణాలో 1,049 మంది మహిళలు ఉన్నారు.

ఇదే సమయంలో దేశంలో యువకుల శాతం కూడా తగ్గుతూ వస్తుందని ఈ సర్వేలో వెల్లడైంది. 15 ఏళ్ల లోపు యువకుల శాతం గణనీయంగా తగ్గింది. 2005`06లో ప్రతీ వంద మందిలో 34.9 శాతం మంది యువత ఉండగా, ఇప్పుడు ఇది 26.5 శాతానికి తగ్గింది. జనాభా పెరుగుదల తగ్గడం వల్ల యువత శాతం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read : AP, Children Protection - బాలల భద్రతకు భరోసా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp